Updated : 08/08/2021 13:34 IST

అలా బరువు తగ్గేశారు!

సినిమా పాత్రలకు తగ్గట్లుగా నటీనటుల శరీరాకృతిని మార్చడానికి ప్రోస్థటిక్ మేకప్‌ వినియోగించడం మనకు తెలిసిందే! అయితే ఈ తరం తారలు అందుకు ససేమిరా అంటున్నారు. పాత్ర డిమాండ్‌ చేస్తే అందులో ఒదిగిపోయేందుకు నిజంగానే బరువు తగ్గడానికి లేదా పెరగడానికి తాము సిద్ధమే అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఇక ఇందుకోసం కఠిన ఆహార నియమాలు, వ్యాయామాలకు కట్టుబడుతున్నారు. ఇలా మూడు గంటల సినిమా కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తూ.. వృత్తి పట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా టాలీవుడ్‌ తార షాలినీ పాండే కూడా చేరిపోయింది. ఓ బాలీవుడ్‌ సినిమా కోసం కసరత్తులు చేసి మరీ బరువు తగ్గిన ఈ ముద్దుగుమ్మ.. తన స్లిమ్‌ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. షాలిని ఒక్కర్తే కాదు.. గతంలోనూ పలువురు తారలు సినిమాల్లో తమ పాత్రల కోసం సన్నబడ్డారు.. పాత్రలకు ప్రాణం పోశారు. మరి, వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

కొంతమంది బొద్దుగా ఉంటే ముద్దొస్తే.. మరికొంతమంది నాజూగ్గా ఉంటేనే అందంగా కనిపిస్తారు. ఇలా చక్కటి శరీరాకృతిని కొనసాగిస్తూ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బరువు పెరగడమో, తగ్గడమో చేస్తే.. వాళ్లను ఓ పట్టాన గుర్తుపట్టలేం. ఒకవేళ గుర్తించినా ‘నువ్వేంటి ఇంతలా మారిపోయావ్‌!’ అంటూ ఆశ్చర్యపోతాం. ‘అర్జున్‌ రెడ్డి’ బ్యూటీ షాలినీ పాండేను చూసి ఇప్పుడంతా ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. బబ్లీగా, క్యూట్‌గా కనిపించే తను.. ఒక్కసారిగా సన్నబడిపోయేసరికి ఆమె అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇదంతా బాలీవుడ్‌లో తాను ఎంట్రీ ఇవ్వబోయే ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ అనే సినిమా కోసమే అంటోంది షాలిని. అంతేకాదు.. ఈ క్రమంలో తాను కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా మారడానికి ఎలాంటి కసరత్తులు చేసిందో కూడా చెప్పుకొచ్చింది. అలా ఆమె వెయిట్‌ లాస్‌ జర్నీ, సోషల్‌ మీడియాలో పంచుకున్న తన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.


నా కోసం చేశా.. ఇతరుల కోసం కాదు!

‘నాకు తెలిసి శరీరాకృతి గురించి బాధపడే వారిలో చాలామంది మహిళలే ఉంటారు. ఎందుకంటే ఈ విషయంలో వారి పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విమర్శలూ ఎదుర్కొంటుంటారు. కానీ ఇది ఎంతమాత్రమూ కరక్ట్‌ కాదు. నేనైతే ఇలాంటివి అస్సలు సహించను. ఒక్కమాటలో చెప్పాలంటే నా శరీరాకృతే నా బలం! అందుకే దాన్ని నాకు నచ్చినట్లుగా నేను మలచుకుంటానే తప్ప ఇతరుల మాటలు, విమర్శల్ని నేను పట్టించుకోను. ఇప్పుడు కూడా నా పాత్రలో ఒదిగిపోయేందుకు నేను తెరపై ఎలా కనిపించాలనే దాని పైనే పూర్తి దృష్టి పెట్టా. తగ్గిన బరువు పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా.

అయితే నాకు ముందు నుంచీ ఉన్న కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు ఈ జర్నీని మరింత సులభతరం చేశాయి. చక్కటి పోషకాహారం తీసుకోవడం నాకు చిన్నప్పట్నుంచే అలవాటు. స్కూలింగ్‌ నుంచే బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌.. వంటి క్రీడలపై నాకు పట్టుంది. ఐదో తరగతి నుంచే ఈత కొట్టడం అలవాటు. ఇక ఈ సినిమా కోసం బరువు తగ్గడంలో అదనంగా నాకు సహకరించినవి.. నిపుణులు సూచించిన మీల్‌ ప్లాన్‌, డ్యాన్స్‌ రిహార్సల్స్‌, కార్డియో వ్యాయామాలు..’ అంటూ తన వెయిట్‌ లాస్‌ జర్నీని పంచుకుంది షాలిని. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ‘మహారాజ’ అనే మరో హిందీ చిత్రంలో నటించే ఛాన్స్‌ వచ్చింది.


అలా ఏడు కిలోలు తగ్గా!

‘RX100’, ‘వెంకీమామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. సహజంగానే స్లిమ్‌గా కనిపించే ఈ టాల్‌ బ్యూటీ.. ఇప్పుడు మరింతగా బరువు తగ్గి.. మల్లెతీగలా మారిపోయింది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసే ఫొటోలు చూసి అభిమానులు ‘ఎందుకిలా?’ అని అడుగుతున్నారు. అయితే ఈ కసరత్తంతా తన తదుపరి చిత్రం, ‘ఆ కరాళ రాత్రి’ అనే కన్నడ చిత్ర తెలుగు రీమేక్‌ కోసమే అంటోంది పాయల్.

‘ఈ కన్నడ రీమేక్‌ సినిమాలో నేను ఓ పేద అమ్మాయిగా నటించబోతున్నా. దానికి తగ్గట్లే నా శరీరాకృతిని మార్చుకోవాలనుకున్నా. ఈ క్రమంలో 63 కిలోలున్న నేను 56 కిలోలకు చేరుకున్నా.. అంటే ఏడు కిలోలు తగ్గా. నా ట్రైనర్‌ సూచించిన ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ నాకు మంచి ఫలితాలనిచ్చింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 మధ్యలోనే ఆహారం తీసుకునేదాన్ని. మిగతా సమయమంతా ఉపవాసం ఉండేదాన్ని. దీంతో పాటు యోగా, కొన్ని చిన్న పాటి వ్యాయామాలు సాధన చేశా. నిజంగా ఇలా బరువు తగ్గడం నాలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.. ఎంతో యాక్టివ్‌గా అనిపిస్తోంది..’ అంటోందీ పంజాబీ అందం. ప్రస్తుతం ఈ చిన్నది ‘ఏంజెల్‌’ అనే తమిళ చిత్రంతో పాటు ‘కిరాతక’ అనే తెలుగు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.


‘మిస్‌ ఇండియా’ కోసం మహానటి!

పాత్ర డిమాండ్‌ చేస్తే తాను బరువు తగ్గడానికైనా, పెరగడానికైనా సిద్ధంగా ఉంటానని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది అందాల తార కీర్తి సురేశ్. ఈ విషయాన్ని ‘మహానటి’ సినిమా ద్వారా నిరూపించింది కూడా! అయితే ‘మిస్‌ ఇండియా’ కోసం మరోసారి బరువు తగ్గక తప్పలేదంటోందీ చెన్నై చిన్నది. మొన్నామధ్య కారు దగ్గర నిలబడి తాను తీయించుకున్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఆమె ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కీర్తి ఏంటి ఇంత సన్నబడిపోయిందని తెగ కంగారు పడిపోయారు. అయితే ఈ సినిమాలో మరీ చిన్నమ్మాయిలా పాత్రలో ఒదిగిపోవడానికే ఇలా చేశానంటోందీ ముద్దుగుమ్మ.

‘మహానటి తర్వాత నాజూగ్గా మారడానికి చాలా కష్టపడ్డా. మిస్‌ ఇండియా కోసం చాలా బరువు తగ్గా. ఏ కాస్ట్యూమ్‌ అయినా ఇట్టే నప్పేలా స్లిమ్‌గా తయారవడమే లక్ష్యంగా పెట్టుకున్నా. దర్శకుడు కూడా ఇదే కోరుకున్నారు. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకున్నా. నేను ముందు నుంచీ ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యమిస్తుంటా. పండ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన గింజలు, సలాడ్స్‌, సూప్స్‌, కోడిగుడ్లు.. వంటివి ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకుంటుంటా.. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తా. ఇక యోగా మాత్రం తప్పకుండా నా రొటీన్‌లో ఉండాల్సిందే!’ అంటోంది కీర్తి. ఈ సినిమా గతేడాదే ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుంది. గతేడాది ‘రంగ్‌ దే’ చిత్రంతో అలరించిన కీర్తి.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’తో పాటు మరో ఐదు సినిమాల్లో భాగమైందీ క్యూటీ.


రెండు నెలలు జిమ్‌లోనే..!

ఒకే సినిమా కోసం అప్పటికప్పుడు బరువు తగ్గడం, పెరగడం అంటే చాలా కష్టం. ‘తొలి ప్రేమ’ కోసం తాను అదే చేశానంటోంది దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. ‘తొలి ప్రేమలో కాసేపు కాలేజ్‌ అమ్మాయిగా, మరికాసేపు కాస్త పరిణతి చెందిన అమ్మాయిగా కనిపిస్తా. ఈ క్రమంలో కాలేజ్‌ అమ్మాయిలా కనిపించడానికి ఐదు కిలోలు తగ్గాల్సి వచ్చింది. అదే రెండో పాత్ర కోసం మూడు కిలోలు పెరిగా. ఇందుకోసం పదిహేను రోజులు క్రాష్‌ డైట్‌ ఫాలో అయ్యా. రెండు నెలలు నిరంతరాయంగా జిమ్‌లో కష్టపడ్డా. ఇవే తక్షణ ఫలితాలనిచ్చాయి..’ అంటూ తన వెయిట్‌ లాస్‌ గురించి పంచుకుంది రాశి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా ఉందీ బ్యూటీ.


పావుగంటే.. అయినా నచ్చింది!

బాపూ బొమ్మగా తెలుగు వారి మనసులో నిలిచిపోయింది అందాల నటి స్నేహ. హీరోయిన్‌గానే కాకుండా.. అక్కగా, వదినగా.. ఇలా పలు సహాయక పాత్రల్లోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లై పిల్లలు పుట్టాక తెరపై అరుదుగానే కనిపిస్తోంది. అయినా పాత్ర డిమాండ్‌ చేస్తే దానికి తగ్గట్లుగా తన శరీరాకృతిని మార్చుకోవడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నానంటోంది. 2015లో కొడుకు పుట్టాక కాస్త విరామం తీసుకొని తిరిగి సినిమాల్లోకి వచ్చిన ఈ అందాల తార.. వెలైక్కరన్‌ అనే తమిళ సినిమా కోసం సుమారు పది కిలోలు తగ్గింది.

‘దీన్ని పోస్ట్‌ ప్రెగ్నెన్సీ వెయిట్‌ లాస్‌ అని చెప్పను.. ఈ సినిమాలో నా పాత్ర డిమాండ్‌ చేసింది కాబట్టే పది కిలోలు తగ్గడానికి నిర్ణయించుకున్నా. ఇందులో నా పాత్ర నిడివి తక్కువే అయినా నా మనసుకు నచ్చిందిది. ఈ క్రమంలో కచ్చితమైన ఆహార నియమాలు పాటించా. కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉండే పదార్థాలను దూరం పెట్టా. ఉదయం కార్డియో, సాయంత్రం వెయిట్‌ ట్రైనింగ్‌.. ఇంటి వద్దే నా భర్త ప్రసన్న సహకారంతో సాధన చేశా..’ అంటోందీ బాపూ బొమ్మ. ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న ‘వాన్‌’ అనే తమిళ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.


ఆ రెండూ కష్టమే!

తన కెరీర్‌లో విభిన్న పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది బాలీవుడ్‌ అందం కృతీ సనన్‌. ఇటీవలే ‘మిమి’ సినిమాతో హిట్టు కొట్టిన ఈ చిన్నది.. ఇందులో సరోగేట్‌ మదర్‌గా కనిపించడానికి సుమారు 15 కిలోలు పెరిగింది. జీవక్రియలు చురుగ్గా ఉన్న వారు, జీన్స్‌ పరంగా.. ఇలా పలు కారణాల వల్ల బరువు పెరగడం ఎంత సవాలుతో కూడుకున్నదో తెలుసుకున్నానంటోంది కృతి.. ఆపై తన తదుపరి చిత్రాల కోసం పెరిగిన పదిహేను కిలోల్ని తగ్గించుకోవడానికి తనకు మూడు నెలలు పట్టిందంటోందీ చక్కనమ్మ. ఇందుకూ తీవ్ర కసరత్తులు చేశానంటోంది.

‘బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా ఎంత కష్టపడాలో నాకు అర్థమైంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉండాలి.. ముఖ్యంగా ఈ క్రమంలో ఆహార నియమాలు, వ్యాయామాలు నాకెంతో సహకరించాయి.

* అల్పాహారం కోసం రెండు ఉడికించిన గుడ్లు, రెండు బ్రౌన్‌ బ్రెడ్‌ స్లైసులు, రెండు కప్పుల బ్లాక్‌ టీ తీసుకునేదాన్ని.

* మధ్యాహ్నం లంచ్‌లో రెండు చపాతీలు, అన్నానికి బదులు క్వినోవా, ఏదైనా కాయగూర లేదంటే చికెన్‌ తీసుకున్నా.

* ఇక సాయంత్రాలు కార్న్‌తో పాటు గ్లాసు ప్రొటీన్‌ షేక్‌ తాగేదాన్ని.

* రాత్రి భోజనంలో శాండ్‌విచ్‌, వెజిటబుల్‌ సూప్‌.. వంటి తేలికపాటి ఆహారం తీసుకునేదాన్ని.

* ఫ్రైడ్‌ ఫుడ్‌, మసాలాలకు దూరంగా ఉంటూనే.. రోజుకు రెండు కప్పుల గ్రీన్‌ టీ తాగడం అలవాటు చేసుకున్నా. అలాగే రోజుకు 10-12 గ్లాసుల నీళ్లు తాగేదాన్ని.

* తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి ప్రొటీన్లకు ప్రాధాన్యమిచ్చా.

* వీటితో పాటు కార్డియో, పిలాటిస్‌, డ్యాన్స్‌, యోగా.. వంటివి సాధన చేశా..’ అంటూ తన ఫిట్‌నెస్‌ రొటీన్‌ను పంచుకుంది కృతి. ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’, ‘బచ్చన్‌ పాండే’.. వంటి సినిమాల్లో నటిస్తోందీ దిల్లీ భామ.

ఇలా వీళ్లే కాదు.. అనుష్క (సైజ్‌ జీరో), భూమి పెడ్నేకర్‌ (దమ్‌ లగాకే హైసా), కంగనా రనౌత్‌ (తలైవి), విద్యా బాలన్‌ (డర్టీ పిక్చర్‌).. వంటి ముద్దుగుమ్మలు.. తమ పాత్రల కోసం ప్రాణం పెట్టారు.. కిలోల కొద్దీ బరువు పెరిగి పాత్రల్లో ఒదిగిపోయారు. వృత్తిపట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి