Published : 26/08/2021 16:48 IST

ఈ అమ్మవారికి నూడుల్సే నైవేద్యం!

(Image for Representation)

సాధారణంగా చాలా గుళ్లలో లడ్డూ, పులిహోర, కేసరి.. వంటి పదార్థాలు దేవతలకు నైవేద్యాలుగా సమర్పించడం చూస్తుంటాం. నైవేద్యం పెట్టి వాటినే ప్రసాదంగా స్వీకరిస్తుంటాం. కానీ మన దేశంలోని ఓ కాళీ మందిరంలో అమ్మవారికి నూడుల్స్‌ని నైవేద్యంగా సమర్పిస్తారట. ఇదొక్కటనే కాదు.. Chop Suey, వేయించిన కాయగూరలు.. వంటి చైనీస్‌ వంటకాలతోనే అమ్మను ప్రసన్నం చేసుకుంటారట! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయినా మన దేవతకు చైనా నైవేద్యాలేంటి? ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుంది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

కాళీ మందిరం అనగానే బెంగాలే గుర్తొస్తుంది. ఎందుకంటే అమ్మవారి దేవాలయాలు ఎక్కువగా వెలసిన రాష్ట్రమది! భక్తులు నూడుల్స్ నైవేద్యంగా సమర్పించే కాళీ మాత ఆలయం కూడా కోల్‌కతాలోనే ఉంది. ఇక్కడి టాంగ్రా అనే ప్రాంతంలో ఉందీ మందిరం. ‘చైనా టౌన్‌’గా పిలిచే ఈ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి ‘చైనీస్‌ కాళీ టెంపుల్‌’ అని పేరు. అంతేకాదు.. టిబెటన్‌, తూర్పు ఆసియా సంప్రదాయాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే దేశ, విదేశీ పర్యటకుల్ని అధికంగా ఆకర్షిస్తుందని స్థానికులు చెబుతారు.

80 ఏళ్ల చరిత్ర!

నిజానికి ఈ దేవాలయం ఈనాటిది కాదు.. సుమారు 80 ఏళ్ల నుంచే ఇక్కడి కాళీ మాత భక్తుల పూజలందుకుంటోంది. అయితే 20 ఏళ్ల క్రితం వరకు ఓ చెట్టు కింద ఉన్న రెండు గ్రానైట్‌ రాళ్లను కుంకుమతో పూజించేవారు భక్తులు. ఆ తర్వాత బెంగాల్‌, చైనాకు చెందిన కొన్ని కమ్యూనిటీలు కలిసి ఈ చైనీస్‌ కాళీ ఆలయాన్ని నెలకొల్పి.. అందులో కాళీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారట! ఇక ఇక్కడి అమ్మవారికి నూడుల్స్‌, స్టికీ రైస్‌, వేయించిన కాయగూరలు (Stir Fried Vegetables), Chop Suey.. వంటి చైనీస్‌ వంటకాల్ని నైవేద్యంగా సమర్పించడం, వాటినే భక్తులకు ప్రసాదంగా అందించడం ఈ ఆలయ ప్రత్యేకత!

చైనీయుల ప్రత్యేక పూజలు!

కాళీ మాత దేవాలయ నిర్మాణంలో చైనీయులు భాగమవడమేంటి? అమ్మవారికి చైనా ప్రసాదాలేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? దీని వెనకా ఓ చారిత్రక కథ/పురాణ గాథ ఉందంటున్నారు అక్కడి ప్రజలు. గతంలో ఓ పదేళ్ల చైనా బాలుడు తీవ్రంగా జబ్బు పడ్డాడట! ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేకపోయేసరికి ఆఖరి ప్రయత్నంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ బాలుడిని ఈ కాళీ మాత ఆలయానికి తీసుకొచ్చారట! తమ కొడుకు ఆరోగ్యం కుదుటపడాలని అమ్మను వేడుకున్నారట! దాంతో అమ్మవారి అనుగ్రహంతో ఆ బాలుడు కోలుకున్నాడని.. అప్పట్నుంచి చైనా ప్రజలు ఇక్కడి కాళీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం మొదలుపెట్టారని, ఆలయ నిర్మాణంలోనూ వారు భాగమయ్యారని చెబుతుంటారు. ఇక్కడికొచ్చే చైనా భక్తులు మనలాగే గుడి బయటే చెప్పులు వదిలి లోపలికి రావడం, చైనా స్టైల్‌లో అమ్మవారికి నమస్కరించడం ఈ ఆలయంలో చూడచ్చు.

ఇక ఏటా దీపావళి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో పొడవాటి క్యాండిల్స్‌ ఏర్పాటుచేసి వాటిని చైనీస్‌ అగర్‌బత్తీలతో వెలిగించడం ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టంగా చూడచ్చు. ఈ వెలుతురుతో అక్కడ పండగ శోభ రెట్టింపవుతుందని, ఈ సువాసనతో అక్కడి వీధులు గుప్పుమంటాయని చెబుతుంటారు స్థానికులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి