Sex Education: నాలా మరే చిన్నారీ బాధపడకూడదని..!

లైంగిక హింస.. పెద్దలే కాదు, పిల్లలూ దీని బారిన పడుతున్నారు. 18 ఏళ్లు దాటని బాలల్లో ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రూపంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలోనూ ఎక్కువ మంది తెలిసిన వారి చేతుల్లోనే హింసకు గురవుతున్నట్లు తేలింది. అందుకే చేతుల కాలాక ఆకులు.....

Published : 02 Jun 2022 15:57 IST

(Photos: Instagram)

లైంగిక హింస.. పెద్దలే కాదు, పిల్లలూ దీని బారిన పడుతున్నారు. 18 ఏళ్లు దాటని బాలల్లో ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రూపంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలోనూ ఎక్కువ మంది తెలిసిన వారి చేతుల్లోనే హింసకు గురవుతున్నట్లు తేలింది. అందుకే చేతుల కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందే జాగ్రత్త పడడం మంచిదంటోంది అహ్మదాబాద్‌కు చెందిన అనుజా అమీన్‌. చిన్న వయసులోనే  లైంగిక హింసను ఎదుర్కొన్న ఆమె.. తనలా మరే చిన్నారీ బాధపడకూడదని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే పిల్లల్లో లైంగిక విద్యపై అవగాహన కల్పించేందుకు ఓ సంస్థను నెలకొల్పింది. పలు కార్యక్రమాలతో పాటు దీనిపై పాఠ్యాంశాల్ని సైతం రూపొందిస్తోందీ సంస్థ. దేశవ్యాప్తంగా పాఠశాలలు, పిల్లలు, తల్లిదండ్రులతో మమేమకమవుతూ లైంగిక వేధింపులపై ఆమె చేస్తోన్న ఈ ఉద్యమం గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఎదుటివారు ఏం చేస్తున్నారో తెలియదు.. వారి చేష్టలు అర్థం చేసుకునే వయసు కాదు. కానీ ఏదో తెలియని అసౌకర్యం. దాని గురించి తల్లిదండ్రులతో ఎలా చెప్పాలో తెలియని పసితనం. ఇలా తమపై జరిగింది లైంగిక హింస అని తెలుసుకునేసరికి.. ఎన్నో వ్యక్తిగత కారణాలు నిజం బయటపెట్టకుండా అడ్డుపడుతుంటాయి. ఇలా ఎంతోమంది.. అటు హింసతో పాటు ఇటు దానివల్ల కలిగిన అసౌకర్యం, శారీరక-మానసిక క్షోభను పంటి బిగువునే భరించాల్సి వస్తోంది. దీనంతటికీ లైంగిక హింస గురించి పిల్లల్లో అవగాహన లేకపోవడమే కారణమంటోంది అనుజ.

ఐదేళ్లకే హింసకు గురయ్యా!

ఐదేళ్ల వయసులో తానూ తెలిసిన వ్యక్తి చేతిలో లైంగిక హింసకు గురయ్యానని.. ఆ విషయం తెలుసుకొని, ధైర్యం తెచ్చుకొని అమ్మకు చెప్పేసరికి 21 ఏళ్లు పట్టిందని చెబుతోంది అనుజ. ‘అప్పుడు నా వయసు ఐదేళ్లు. ఆ రోజు మా బామ్మ పూజ గదిలో ఉంది.. అమ్మ బయటికి వెళ్లేందుకు రడీ అవుతోంది. నేనేమో నా గదిలో ఆడుకుంటున్నా. అప్పుడే మా ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి నా వద్దకొచ్చాడు. నన్ను అసభ్యంగా తాకాడు. కానీ అతనలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మరికొన్నిసార్లు నాపై లైంగిక హింసకు పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే.. ఓ రోజు అమ్మతో కలిసి మార్కెట్‌కి వెళ్లాను. అక్కడ రద్దీ విపరీతంగా ఉంది. ఓ వ్యక్తి తన వేళ్లను నా కాళ్లకు తాకిస్తూ వెళ్లిపోయాడు. చాలా ఇబ్బందికరంగా అనిపించింది. షార్ట్‌ డ్రస్‌ వేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నా. ఇక అప్పట్నుంచి బయటికి వెళ్లిన ప్రతిసారీ అలర్ట్‌గా ఉండేదాన్ని.. హ్యాండ్‌బ్యాగ్‌ను నా ఛాతీకి అడ్డుపెట్టుకునేదాన్ని.. శరీరం మొత్తం కవరయ్యేలా వదులుగా ఉండే దుస్తులు వేసుకునేదాన్ని.

అందుకు 21 ఏళ్లు పట్టింది!

ఇలా రాన్రానూ నాలో అభద్రతా భావం పెరిగింది. నన్ను నేను నిందించుకోవడం, కట్టుబాట్లు విధించుకోవడం.. వంటివి చేసేదాన్ని. ఈ మౌనంలోనే ఏళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు నాకు జరిగిన అన్యాయం గురించి రియలైజ్‌ అయ్యాను. ఇదంతా లైంగిక హింస, గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌.. వంటి కొన్ని కీలక అంశాల గురించి నాకు ఎవరూ చెప్పకపోవడం వల్లనే అని తెలుసుకున్నా. మానసికంగా కుంగిపోయా. ఇలా సుమారు 21 ఏళ్ల పాటు ఈ బాధను, భారాన్ని మోసిన నేను.. ఆ తర్వాత ఓ రోజు అమ్మతో నాకు జరిగిన అన్యాయం గురించి పెదవి విప్పా.. ఈ మానసిక వేదన నుంచి బయటపడేందుకు థెరపీ కూడా తీసుకున్నా..’ అంటూ తన అనుభవాలను ఓ సందర్భంలో పంచుకుంది అనుజ.

ఉద్యోగం వదిలేసి స్వదేశానికి..!

ఇలా ఓవైపు శారీరక, మానసిక క్షోభను భరిస్తూనే.. మరోవైపు తన చదువు పైనా దృష్టి పెట్టిందామె. నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ నుంచి సైకాలజీ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అనుజ.. లండన్‌ స్కూల్ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ‘మానవ వనరుల నిర్వహణ (HRM)’ సబ్జెక్టుగా పీజీ పట్టా పుచ్చుకుంది. చదువు పూర్తయ్యాక నెదర్లాండ్స్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే తాను ఎంత బిజీగా ఉన్నా.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు ఆమె మనసును మెలిపెట్టేవి. ఇదే సమయంలో ‘భారత్‌లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు వివిధ రూపాల్లో లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు..’ ఓ సర్వేలో భాగంగా తెలుసుకొని చలించిపోయిందామె. ఇంత జరుగుతున్నా మౌనం వహించడం తన వల్ల కాదనుకున్న అనుజ.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి భారత్‌కు చేరుకుంది.

‘సర్కిల్స్‌ ఆఫ్‌ సేఫ్టీ’ ముఖ్యోద్దేశమదే!

ఎలాగైనా సరే.. చిన్నారులపై జరుగుతోన్న లైంగిక హింసకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో స్వదేశానికి చేరుకున్న అనుజ.. ఈ సమస్యకు మూలకారణం.. చిన్నారులు, తల్లిదండ్రుల్లో అవగాహన లేమే అని తెలుసుకుంది. ఇలాంటి కేసులు తగ్గాలంటే.. లైంగిక హింస గురించి అవగాహన పెంచడమొక్కటే మార్గమనుకున్న ఆమె.. ఈ ఆలోచనతోనే 2015లో ‘సర్కిల్స్‌ ఆఫ్‌ సేఫ్టీ’ అనే సంస్థను స్థాపించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, పిల్లలు, తల్లిదండ్రులతో మమేకమవుతూ.. లైంగిక విద్య గురించి వారిలో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకురావడమే దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ఇప్పటికే లక్నో, బెంగళూరు, సూరత్‌, ముంబయి, చెన్నై.. వంటి నగరాల్లోని పాఠశాలల్లో వర్క్‌షాప్స్‌ నిర్వహించింది. మరోవైపు ఎగ్జిబిషన్లలో, ఫెయిర్స్‌లో పిల్లల కోసం ప్రత్యేకమైన ఆటల్ని రూపొందిస్తూ.. వారిలో మోటార్‌ స్కిల్స్‌ పెంచేందుకు కృషి చేస్తోంది. ‘వీటి వల్ల పిల్లలు పెద్దయ్యే కొద్దీ ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే సమస్యను ముందే పసిగట్టి జాగ్రత్తపడే నైపుణ్యాలు వారికి అలవడతాయి..’ అంటోంది అనుజ.

పాఠ్యాంశాల రూపంలోనూ..!

లైంగిక విద్య గురించి కేవలం అవగాహన కార్యక్రమాలే కాదు.. 2019 నుంచి పాఠ్యాంశాల్నీ రూపొందిస్తోంది అనుజ. ఇందుకు నిపుణులు, టీచర్ల సహాయం తీసుకుంటోంది. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం 1-12 గ్రేడ్లకు గాను.. ప్యూబర్టీ, లింగ వివక్ష, బుల్లీయింగ్‌, ప్రత్యుత్పతి, లైంగిక కోరికలు, శరీరంలోని వ్యక్తిగత భాగాలు, గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌.. వంటి అంశాలపై పాఠ్యాంశాల్ని రూపొందించిందామె.

‘పిల్లల వయసును బట్టి వాళ్లు అర్థం చేసుకునే రీతిలోనే మా పాఠ్యాంశాలుంటాయి. ఉదాహరణకు.. ఆరోగ్యకరమైన సంబంధాలే తీసుకోండి.. ప్రాథమిక దశలో విద్యనభ్యసించే పిల్లలకు స్నేహమంటే ఏంటి? స్నేహితుల్ని ఎలా ఎంచుకోవాలి? వాళ్లతో ఎంతవరకు మెలగాలి? వంటి విషయాలే చెప్తాం. అదే కాస్త పెద్ద తరగతి పిల్లలకైతే.. ఇంకాస్త పరిణతితో కూడిన సిలబస్‌ ఉంటుంది. టీచర్లు కూడా వీటిని పిల్లలకు సులభంగా, పాజిటివ్‌గా అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశ ప్రణాళికను రూపొందిస్తూ పిల్లలకు వివరిస్తున్నారు..’ అంటోంది అనుజ.

తల్లిదండ్రులు దాచిపెట్టద్దు!

లైంగిక పరమైన విషయాలు, స్వలింగ సంపర్కం.. వంటి అంశాల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఉత్సుకత చూపుతుంటారు. ఇలాంటప్పుడు వారిని వారించకుండా.. ఆయా విషయాల గురించి పాజిటివ్‌గా వారికి వివరించడం మంచిదంటోంది అనుజ.
‘పిల్లలకు ఆసక్తి ఉన్న ఇలాంటి అంశాల గురించి మాట్లాడడానికి చాలామంది పేరెంట్స్‌ నిరాకరిస్తుంటారు. దీనివల్ల వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి వారిలో మరింతగా పెరుగుతుంది. ఫలితంగా వారు పెడదోవ పట్టే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి వాళ్లు అడిగినప్పుడు మొహమాట పడకుండా సానుకూలంగానే వారికి వివరించాలి. అప్పుడు వాళ్ల సందేహం నివృత్తి అవుతుంది. ఏది మంచి, ఏది చెడు అనేది కూడా తెలుసుకోగలుగుతారు..’ అంటూ తన మాటలతో అటు తల్లిదండ్రుల్లోనూ స్ఫూర్తి నింపుతోందామె.
ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లకు తల్లైన అనుజ.. ఓవైపు తన సంస్థ వేదికగా పలు కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు లైంగిక విద్య, పిల్లల పెంపకం.. వంటి అంశాలపై వీడియోలు రూపొందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్