అనారోగ్యానికి వైట్ కార్పెట్ వేయద్దు!

ఆహార పదార్థాలు.. సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేవైనా.. అనారోగ్యాల పాలు చేసేవైనా.. అవే! అదేంటి.. అన్ని ఆహార పదార్థాలు అలా ఉండవు కదా.. అనుకుంటున్నారా? నిజమే.. కానీ రోజూ మనం తీసుకునే ఆహారంలోని కొన్ని తెలుపు రంగులో ఉండే పదార్థాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు నిపుణులు.

Updated : 18 Feb 2022 20:50 IST

ఆహార పదార్థాలు.. సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేవైనా.. అనారోగ్యాల పాలు చేసేవైనా.. అవే! అదేంటి.. అన్ని ఆహార పదార్థాలు అలా ఉండవు కదా.. అనుకుంటున్నారా? నిజమే.. కానీ రోజూ మనం తీసుకునే ఆహారంలోని కొన్ని తెలుపు రంగులో ఉండే పదార్థాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు నిపుణులు. అందుకే వాటిని 'వైట్ డెవిల్స్'గా కూడా అభివర్ణిస్తున్నారు. అయినా సరే.. కొంతమంది వాటిపై ఉండే మోజుతో వాటిని తీసుకోకుండా ఉండలేరు. అలాగని ఈ పదార్థాలను మరీ ఎక్కువగా తీసుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి ఆయా పదార్థాల్ని పూర్తిగా తీసుకోకపోవడం లేదా చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. మరి నిత్యం మనం తీసుకునే ఆ తెలుపు వర్ణపు పదార్థాలేంటి? వాటివల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో తెలుసుకుందామా..

మైదాతో ముప్పే!

మైదాపిండి.. దీన్ని మనం చాలా రకాల పిండివంటల తయారీలో ఉపయోగిస్తుంటాం. కొంతమంది మృదువుగా ఉంటుందని గోధుమ పిండికి బదులుగా దీంతోనే టిఫిన్లు తయారు చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరుగుతుందట! అదెలాగంటే.. మైదాపిండిని మనం తీసుకున్నప్పుడు.. అది జీర్ణమయ్యే క్రమంలో చక్కెరగా మార్పు చెందుతుంది. ఇలా ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో విడుదలైన చక్కెరలు శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా క్లోమగ్రంథిపై ఒత్తిడి తీసుకొస్తాయి. ఇది ఆ చక్కెరను కొవ్వులుగా మార్చి రక్తనాళాల్లో పేరుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. అలాగే మైదాలో ఫైబర్ అసలే ఉండదు కాబట్టి.. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్తి, కడుపునొప్పి, మలబద్ధకం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి మైదాను పూర్తిగా తగ్గించి.. ముడి గోధుమపిండిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చంటున్నారు నిపుణులు.

'తీపి' ఎక్కువైతే చేదే!

ఆరోగ్యానికి హాని చేసే తెలుపు రంగు పదార్థాల్లో చక్కెర కూడా ముఖ్యమైనది. ఇది కేవలం స్వీట్లలోనే కాదు.. చాక్లెట్లు, చూయింగ్‌గమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్‌డ్ ఫుడ్స్.. వంటి వాటితో పాటు ఆఖరికి సహజసిద్ధంగా లభించే పండ్లలో కూడా ఉంటుందట. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర శాతం అధికమవడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఈ లక్షణం రోగనిరోధకశక్తితో పాటు మూత్రపిండాలు, నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థ, కాలేయం.. వంటి ఇతర అవయవ వ్యవస్థల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాలేయంలో చక్కెర శాతం విపరీతంగా పెరిగిపోతే అది వాటిని కొవ్వుల రూపంలోకి మార్చి రక్తనాళాల్లోకి పంపిస్తుంది. తద్వారా బరువు పెరగడం, రక్తపోటు.. వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. చక్కెర బదులుగా తేనె వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. ప్రత్యేకించి మహిళలు రోజువారీ ఆహారంలో భాగంగా చక్కెరను ఏ రూపంలోనైనా దాదాపు 25 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

పాలిష్డ్ బియ్యం వద్దు...

గ్త్లెసెమిక్ ఇండెక్స్ విలువ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎంత త్వరగా జీర్ణమవుతాయో.. అంతే త్వరగా రక్తంలో చక్కెర స్థాయుల్ని కూడా పెంచుతాయంటున్నారు నిపుణులు. ఇందుకు ఉదాహరణే.. రోజూ మనం ఉపయోగించే బియ్యం. ఎందుకంటే బియ్యం గ్త్లెసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా శరీరంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల కాలేయం వాటిని కొవ్వుగా మారుస్తుంది. తద్వారా వచ్చే పలు రకాల ఆరోగ్య సమస్యల గురించి మనకు తెలిసిందే. కాబట్టి మనం రోజూ తీసుకునే పాలిష్డ్ బియ్యపు అన్నానికి బదులుగా గ్త్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బ్రౌన్‌రైస్‌ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉప్పూ తగ్గించండి!!

చిప్స్, చీజ్, బటర్.. వంటి వాటిల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది వివిధ రకాల ఆహార పదార్థాలపై ఉప్పును చల్లుకుని మరీ తీసుకుంటుంటారు. వీటికి తోడు వివిధ ఆహార పదార్థాలలో ఉపయోగించే ఉప్పూ ఎక్కువే. ఇలా ఏ రూపంలోనైనా సరే.. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజూ దాదాపు 1500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకుండా జాగ్రత్తపడమంటున్నారు.

చూశారుగా.. మనం రోజూ తీసుకునే ఈ వైట్ డెవిల్స్ ఆరోగ్యానికి ఎలా ముప్పు తీసుకొస్తాయో! కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని వీటిని వీలైనంతగా తగ్గించడం, లేదంటే పూర్తిగా దూరంగా ఉండడం ఎంతో ఆరోగ్యదాయకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్