Women employment: ఆమెకు.. వెసులుబాటు..

అప్పటిదాకా ఎంతటి పోటీనైనా తట్టుకొని నిలదొక్కుకునే అమ్మాయి.. అమ్మవగానే.. ఆలోచనలో పడుతుంది. తన సమయం పిల్లలకే ఇవ్వాలనుకుంటుంది.

Published : 14 May 2023 00:32 IST

అప్పటిదాకా ఎంతటి పోటీనైనా తట్టుకొని నిలదొక్కుకునే అమ్మాయి.. అమ్మవగానే.. ఆలోచనలో పడుతుంది. తన సమయం పిల్లలకే ఇవ్వాలనుకుంటుంది. అందుకే కెరియరా, కడుపున పుట్టినవారా అన్న పరిస్థితి వస్తే ఉద్యోగాన్నే వదులుకుంటుంది. అది అర్థం చేసుకున్న కొన్ని సంస్థలు.. అమ్మకు తోడుగా నిలుస్తున్నాయిలా..

ప్రతి సంస్థా 26 వారాలు లేదా ఆరు నెలల తప్పనిసరి మాతృత్వ సెలవులు ఇస్తున్నాయి. అవి కాకుండా..

* అబాట్‌.. గర్భిణులకు ‘హ్యాపీ ఫీట్‌ ప్రోగ్రామ్‌’ నిర్వహిస్తోంది. దీని ద్వారా గర్భిణులైన తమ ఉద్యోగినులు తల్లి అయ్యేవరకూ అవసరమైన నిపుణుల సాయాన్ని అందిస్తోంది.

* ఆక్సెంచర్‌.. ఇంటరాక్టివ్‌ పేరెంటింగ్‌ వర్క్‌షాప్స్‌, ప్రీ అండ్‌ పోస్ట్‌ మెటర్నిటీ కౌన్సెలింగ్‌ సెషన్స్‌ వంటివి నిర్వహిస్తోంది. అవసరమైతే ఇంటి నుంచి లేదా నచ్చిన వేళల్లో పనిచేసే వీలు కల్పిస్తోంది. ప్రసూతి సెలవులు ముగిశాక ఏడాదిపాటు నచ్చినచోటు నుంచి పనిచేయొచ్చు. పిల్లలతో గడపడానికీ, వాళ్లతో సెలవులు ప్లాన్‌ చేసుకోవడానికీ, అనారోగ్యాల సమయంలో.. ఇలా భిన్న అవసరాలకోసం 9 పెయిడ్‌ లీవ్స్‌నీ అందిస్తోంది.

* డెలాయిట్‌.. ‘డీమామ్‌’ ద్వారా ప్రసవం తర్వాత కెరియర్‌ గాడిలో పడటానికి అవసరమైన శిక్షణిస్తారు. కాబోయే అమ్మలకు ప్రసవానికి ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. అవసరమైతే భర్త, పై అధికారికీ కౌన్సెలింగ్‌ ఇస్తారట. ప్రసవానికి ముందు, తర్వాత నచ్చినవేళల్లో, ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పిస్తున్నారు. సంస్థలో పేరెంట్‌ నెట్‌వర్కింగ్‌.. పిల్లల పెంపకం, ప్రత్యేక అవసరాలు, కొత్త బాధ్యతలో ఇమడటానికి అవసరమైన శిక్షణ సహా అన్నిరకాల సాయమూ అందుతుందట.

* అమెజాన్‌.. ‘ర్యాంప్‌ బ్యాక్‌ ప్రోగ్రామ్‌’ ద్వారా నచ్చిన వేళల్లో లేదా ఎనిమిది వారాలు కొన్ని గంటలే పనిచేసే వీలు కల్పిస్తోంది.

* ఐసీఐసీఐ.. ఐవర్క్‌జీహోమ్‌ పేరుతో ఏడాదిపాటు ఇంట్లోంచి పనిచేసే అవకాశమిస్తున్నారు. మహిళలు పనిరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సొస్తే పిల్లల్నీ వెంట తీసుకెళ్లనివ్వడమే కాదు.. ఖర్చూ సంస్థే భరిస్తుందట.

* బైజూస్‌.. ప్రసూతి సెలవులతోపాటు అవసరమైతే అదనంగా జీతం లేకుండా 13 వారాల లీవు తీసుకోవచ్చు. మహిళలకు నచ్చిన వేళల్లో పనిచేసే వీలూ కల్పిస్తున్నారు. తిరిగి విధుల్లో చేరినవారికి మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌లూ నిర్వహిస్తున్నారు.

* ఐబీఎం, జేపీ మోర్గాన్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ వంటి సంస్థలెన్నో.. కొత్త అమ్మ ఈ అదనపు బాధ్యతలతో ఉద్యోగానికి దూరం అవొద్దు, ఆఫీసు పని మరింత భారం కావొద్దన్న ఉద్దేశంతో పని విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఆరోగ్యమైన ఆహారం, విశ్రాంతి గదులు, మసాజ్‌, మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌, కెరియర్‌లో వెనకబడిపోకుండా మెంటరింగ్‌ వంటి సౌకర్యాలనూ కల్పిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్