ఈ పండ్లతో.. వేసవిలో మరెంతో ఆరోగ్యంగా!

మనకేం కావాలో.. మనకంటే బాగా ప్రకృతికే తెలుసంటారు..! అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలైతే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తుంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే రకరకాల పండ్లు కూడా...

Published : 10 May 2023 12:45 IST

మనకేం కావాలో.. మనకంటే బాగా ప్రకృతికే తెలుసంటారు..! అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలైతే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తుంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే రకరకాల పండ్లు కూడా మనకెంతో మేలు చేస్తాయి. వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతలకు శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడం, జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేయడం.. ఇలా పలు రకాలుగా ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ నేపథ్యంలో వేసవిలో లభించే పండ్లు.. వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!

తర్బూజా

నీటి శాతం అధికంగా ఉండే పండ్లలో తర్బూజా ముఖ్యమైంది. దీన్ని తినడం వల్ల ఇందులో ఎక్కువగా ఉండే నీరు శరీరంలోకి చేరి.. చెమట రూపంలో కోల్పోయిన నీటి శాతాన్ని తిరిగి భర్తీ చేస్తుంది. అలాగే ఈ పండు రక్తపోటుని అదుపులో ఉంచడంతో పాటు ఆస్తమా దరిచేరకుండా కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

పుచ్చకాయ

పుచ్చకాయలో అధికంగా ఉండే నీటి శాతం వల్ల దాహార్తి తీరడమే కాకుండా.. ఇందులో ఉండే ఇతర పోషకాలు కూడా మనకు అందుతాయి. బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌.. వంటి ఖనిజాలతో పాటు విటమిన్‌ సి.. కూడా ఈ పండులో సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడంలో సహాయపడతాయి. అలాగే పెద్దపేగు క్యాన్సర్ దరిచేరకుండా కూడా కాపాడుతుంది.

కివీ

పోషకాలు ఎక్కువగా నిక్షిప్తమై ఎండాకాలంలో లభ్యమయ్యే మరో పండే కివీ. ఇందులో అధికంగా ఉండే విటమిన్లు సి, ఇ, పొటాషియం, ఫైబర్‌.. వంటివి శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఆప్రికాట్

పొటాషియం, ఐరన్‌, బీటా కెరోటిన్‌, ఫైబర్‌తో పాటు విటమిన్‌ సి.. వంటి పోషకాలు అధికంగా లభించే మరో పండే ఆప్రికాట్‌. ఎండు ఆప్రికాట్‌ శరీరంలో ద్రవాల స్థాయులు తగ్గకుండా చేయడంతో పాటు మలబద్ధకం.. వంటి పలు జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే జ్వరం, రక్తహీనత, చర్మ సమస్యలు.. మొదలైనవన్నీ దరిచేరకుండా కాపాడుతుంది.

మామిడి పండ్లు

వేసవి కాలంలో లభించే పండ్లలో అతి ముఖ్యమైనవి మామిడి పండ్లు. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే ఫైబర్‌, బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి.. వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం.

అనాస

జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడే అద్భుతమైన పండు అనాస. దీనికి కారణం ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌. దీంతో పాటు ఈ పండులో ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు దాగి ఉన్నాయి. అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం పలు వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.

ఇవే కాదు.. బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రా బెర్రీ.. వంటి పండ్లలో ఫైటో కెమికల్స్‌ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. అలాగే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేయడంతో పాటు.. క్యాన్సర్, గుండె.. సంబంధిత సమస్యలు రాకుండా నివారించడంలో కూడా సహాయపడతాయి.

ఇదేవిధంగా వివిధ రకాల పండ్లను విడివిడిగా తీసుకోవడంతో పాటు, అన్నిటినీ కలిపి సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీనికి కొవ్వు తక్కువగా ఉండే పెరుగును కూడా కలుపుకోవచ్చు. ఫలితంగా శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు దాహం వేయకుండా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్