పిల్లల కోసం ప్లాన్ చేసుకునే ముందు.. ఈ గొడవలొద్దు!

పిల్లలతోనే వివాహబంధం పరిపూర్ణమవుతుందంటారు. పిల్లలు పుట్టాకే ఆలుమగల అనుబంధం మరింత దృఢమవుతుంది కూడా! అయితే ఇలా సంతానానికి జన్మనిచ్చే క్రమంలో జంటలు ఎన్నో మధురానుభూతుల్ని సొంతం చేసుకుంటాయి.

Updated : 11 Aug 2023 14:03 IST

పిల్లలతోనే వివాహబంధం పరిపూర్ణమవుతుందంటారు. పిల్లలు పుట్టాకే ఆలుమగల అనుబంధం మరింత దృఢమవుతుంది కూడా! అయితే ఇలా సంతానానికి జన్మనిచ్చే క్రమంలో జంటలు ఎన్నో మధురానుభూతుల్ని సొంతం చేసుకుంటాయి. ఇక ఇదే సమయంలో కొంతమంది భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలూ తలెత్తచ్చు. ముఖ్యంగా ఇప్పుడే పిల్లలు వద్దని, ఒక్కరే చాలని, పుట్టబోయే పిల్లల్ని ఇలాగే పెంచాలని.. ఇలా ఒకరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించక గొడవలొస్తుంటాయి. ఇలాంటి మనస్పర్థలు ఇద్దరి మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాదు.. దంపతుల మధ్య దూరాన్నీ పెంచుతాయంటున్నారు నిపుణులు. ఇలా జరగకుండా ఉండాలంటే.. పిల్లల కోసం ప్లాన్‌ చేసుకునే ముందే ప్రతి విషయంలోనూ ఇద్దరూ ఒక అవగాహనకు రావాలంటున్నారు. మరి, ఇంతకీ పిల్లల్ని కనే విషయంలో ఆలుమగల మధ్య వచ్చే కొన్ని సాధారణ గొడవలేంటి? వాటినెలా పరిష్కరించుకోవాలి? తెలుసుకుందాం రండి..

అందుకు సిద్ధమయ్యారా?

పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ ప్రతి బాధ్యతను కలిసి పంచుకున్నట్లే.. పిల్లల బాధ్యతనూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని మొక్కుబడిగా కాకుండా.. సమర్థంగా నిర్వర్తించాలంటే.. అసలు పిల్లల్ని కనడానికి, వారిని బాధ్యతగా పెంచడానికి సిద్ధంగా ఉన్నారా, లేదా.. అన్న విషయం నిర్ధరించుకోవాల్సి ఉంటుంది. దంపతుల్లో ఒకరు కెరీర్‌, ఇతర కారణాల రీత్యా సంతానాన్ని వాయిదా వేద్దామనుకున్నా.. మరొకరు ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో ఇందుకు అంగీకరించకపోవచ్చు. తద్వారా ఇద్దరి ఆలోచనలకు పొంతన కుదరక గొడవలు రావచ్చు. ఈ విషయంలో ఇద్దరి మధ్య సమన్వయం కుదరాలంటే.. కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది. అలాగే కొన్ని జంటల్లో.. ఒకరు చాలని, ఇద్దరు కావాలని.. ఇలా ఎంతమంది పిల్లలు కావాలన్న విషయంలో కూడా అభిప్రాయభేదాలు తలెత్తుంటాయి. ఈ క్రమంలో ఆర్థిక స్థితిగతులు, ఇతర విషయాల్ని దృష్టిలో ఉంచుకొని.. ఈ విషయంలోనూ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే ఏ గొడవా ఉండదు. నిజానికి ఇలాంటి చర్చలు పరోక్షంగా ఇద్దరి మధ్య అనుబంధాన్నీ దృఢం చేస్తాయంటున్నారు నిపుణులు.

బలవంత పెట్టద్దు!

దాంపత్య బంధాన్ని దృఢం చేయడంలో శృంగారానిదీ కీలక పాత్ర. అయితే గర్భం ధరించాక ఆరోగ్య సమస్యలు, హై-రిస్క్‌ ప్రెగ్నెన్సీ.. వంటి కారణాల రీత్యా కొన్ని జంటలు ఈ ప్రక్రియకు గ్యాప్‌ ఇవ్వాల్సి రావచ్చు. కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా భాగస్వామిని బలవంత పెట్టడం, అవతలి వారు వారించడం.. ఇలా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక గొడవలొస్తాయి. అయితే ఇలాంటప్పుడు సొంత నిర్ణయాలు కాకుండా.. డాక్టర్‌ సలహా మేరకు నడచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

కెరీర్‌ డైలమా!

వ్యక్తిగత జీవితానికి, కెరీర్‌కు సమప్రాధాన్యమిస్తున్నారు ఈ కాలపు మహిళలు. గర్భం ధరించినా.. నెలలు నిండే దాకా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు.. ఇక పిల్లలు పుట్టాక కూడా అటు వారి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇటు వృత్తి జీవితాన్నీ కొనసాగిస్తున్నారు. అయితే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలో, లేదంటే గర్భం ధరించాక.. మహిళలు తమ కెరీర్‌ని కొనసాగించే విషయంలో.. తమ భాగస్వామితో చర్చించి ఓ నిర్ణయానికి రావాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. గర్భిణిగా ఉన్నప్పుడు రిస్క్‌ చేయడం ఎందుకన్న ఉద్దేశంతో, ఈ సమయంలో పని చేయాల్సిన అవసరం లేదని ఒకరు.. నెలలు నిండే వరకు పని చేసినా ఏమీ కాదని మరొకరు.. ఇలా ఈ విషయంలో ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉండచ్చు. వీటి కారణంగా గొడవలు రాకుండా, ప్రశాంతత కోల్పోకుండా ఉండాలంటే.. అటు కెరీర్‌, ఇటు ఆరోగ్యం.. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి.. ఇద్దరూ ఒక నిర్ణయానికి రావాలంటున్నారు నిపుణులు. తద్వారా గొడవలు రాకుండా జాగ్రత్తపడడంతో పాటు.. ఆర్థికంగానూ ఒకరికొకరు అండగా నిలబడచ్చు.

నిందించద్దు!

సంతానం కోసం ప్లాన్‌ చేసుకుంది మొదలు గర్భం ధరించి.. బిడ్డకు జన్మనిచ్చే దాకా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పలు ప్రతికూల పరిణామాలు ఎదురుకావచ్చు. ఆలుమగలిద్దరిలో ఎవరో ఒకరిలో సమస్యలుండి ప్రెగ్నెన్సీ సక్సెస్‌ కాకపోవచ్చు.. ఒకవేళ గర్భం ధరించినా.. తొలి త్రైమాసికంలో అబార్షన్‌ కావచ్చు. ఇలాంటప్పుడు కొంతమంది ‘అంతా నీ వల్లే..’, ‘మనకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వే!’ అంటూ భాగస్వామిని నిందిస్తుంటారు. ఇలాంటి భావాలూ ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారితీస్తుంటాయి.. అనుబంధాన్ని దూరం చేస్తుంటాయి. కోరి కోరి ఈ పరిస్థితుల్ని కొని తెచ్చుకునే బదులు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిందించుకోకుండా ఒకరికొకరు తోడుగా నిలిస్తే.. తమ సమస్యకు పరిష్కారం వెతుక్కోవచ్చు.. ఈ అన్యోన్యత, అర్థం చేసుకునే తత్వం భార్యాభర్తల మధ్య అనుబంధాన్నీ దృఢం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్