శానిటైజర్ల విషయంలో ఇవి మర్చిపోకండి..
close
Published : 19/01/2022 21:04 IST

శానిటైజర్ల విషయంలో ఇవి మర్చిపోకండి..!

డెల్టా.. ఒమిక్రాన్.. వేరియంట్ ఏదైనా కరోనా వైరస్‌ కారణంగా మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నోటికి మాస్కులు పెట్టుకోవడం, ఎప్పుడూ లేని విధంగా తరచూ చేతులు శుభ్రపరచుకోవడం.. వంటివన్నీ మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఈ క్రమంలోనే శానిటైజర్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే వీటివల్ల చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు తొలగిపోవడం.. వంటి ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే..  ఈ క్రమంలో- ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల విషయంలో మర్చిపోకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అంటున్నారు నిపుణులు.

మహిళలూ జాగ్రత్త!

శానిటైజర్లతో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గృహిణులు వంటింట్లో పనిచేసే క్రమంలో గ్యాస్‌ స్టౌ వెలిగించడం, పూజ చేసే సమయంలో దీపాలు వెలిగించడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో శానిటైజర్లను చేతులకు రాసుకున్న వెంటనే ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ సెగ తాకి చేతులు మండే అవకాశం ఉంది. అంతేకాదు.. నిర్లక్ష్యంగా ఉంటే మంట చేతులకు అంటుకునే ప్రమాదమూ లేకపోలేదు. ఇందుకు కారణం శానిటైజర్లలో 60 నుంచి 90 శాతం ఆల్కహాల్‌ కలిసి ఉండడమే. సాధారణంగా ఆల్కహాల్‌కు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి గృహిణులు చేతికి శానిటైజర్లు రాసుకున్న వెంటనే కాకుండా అది చేతుల్లోకి పూర్తిగా ఇంకిపోయి, ఆరిన తర్వాతే వంటింట్లో పనులు మొదలు పెట్టడం ఉత్తమం.

చిన్నారుల విషయంలోనూ..

చిన్న పిల్లలు శానిటైజర్లను ఉపయోగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నోట్లో వేలు పెట్టుకునే అలవాటున్న పిల్లల చేతులకు శానిటైజర్లు రాయకపోవడమే ఉత్తమం అంటున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు దీనిని మింగకుండా జాగ్రత్త పడాలి.

మితిమీరి వాడద్దు!

* శానిటైజర్‌ మన చేతులపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.. తద్వారా ఎన్నో రకాల అనారోగ్యాలు మన దరిచేరవన్న మాట వాస్తవమే. అయితే కొన్ని సందర్భాల్లో మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా (మంచి బ్యాక్టీరియా)ను కూడా ఈ ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు నాశనం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

అలాగే- శానిటైజర్లలో బ్యాక్టీరియాను నిరోధించే కొన్ని పదార్థాలు ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల వీటికి అలవాటు పడిపోయి కాలక్రమేణా బ్యాక్టీరియా నిరోధక శక్తి పెరిగే అవకాశాలుంటాయి. ఫలితంగా కొద్ది కాలం తర్వాత శానిటైజర్లను వాడినప్పటికీ మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా అంత సులభంగా నాశనం కాదు. నిరోధకత పెంపొంది శానిటైజర్లకు నశించని మరింత శక్తిమంతమైన బ్యాక్టీరియా తయారు కావడమే ఇందుకు కారణం.

కాబట్టి పదే పదే శానిటైజర్‌ వాడకాన్ని తగ్గించి.. వీలైనంత వరకు చేతుల్ని సబ్బు, పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

* శానిటైజర్లను అధిక మోతాదులో ఉపయోగిస్తే కొన్ని రోజుల తర్వాత చర్మం పొడిబారే ప్రమాదం ఉంది. అయితే దీనికి చెక్‌ పెట్టడానికి మాయిశ్చరైజర్లను కూడా వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- వీలైనంత వరకు చేతులను నీటితో శుభ్రం చేసుకోవడమే మంచిది.

* విపరీతంగా శానిటైజర్లను ఉపయోగిస్తే కాలక్రమేణా.. చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు కాస్మెటిక్‌ నిపుణులు. కాబట్టి దీనికి బదులుగా వీలైనంత వరకు సబ్బు, శుభ్రమైన నీటితోనే చేతులు కడుక్కోమంటున్నారు.

* శానిటైజర్లు కేవలం చేతులకు అంటుకున్న బ్యాక్టీరియా, వైరస్‌లను మాత్రమే నాశనం చేస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగని దుమ్ము-ధూళి, ఇతర జిడ్డు మరకలు అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్‌ వాడడం వల్ల చేతులకు అంటుకున్న ఆ అవశేషాలు తొలగిపోవు.

అందుకే అవకాశం ఉన్నంత వరకు తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అవకాశం లేని పరిస్థితుల్లో శానిటైజర్ల వాడకం ఎలాగూ తప్పదు. అలాటి సందర్భాల్లో కూడా పైన చెప్పిన జాగ్రత్తలు పాటించాలని గుర్తుంచుకోండి మరి!


Advertisement

మరిన్ని