Published : 23/05/2022 18:08 IST

ఆ ఆలోచనతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నా.. ఏం చేయను?!

నేను ఒక స్టోర్‌లో సెక్షన్ ఇంఛార్జిగా పని చేస్తున్నాను. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు నా మనసుని చేసే పని మీద పూర్తిగా లగ్నం చేయలేకపోతున్నా. ఎందుకంటే నన్ను ఎవరో గమనిస్తున్నారన్న ఆలోచన నా మనసుని స్థిరంగా ఉండనీయడం లేదు. నా పైఅధికారులతో కూడా సూటిగా చూస్తూ మాట్లాడలేకపోతున్నాను. దీనివల్ల నా ఉద్యోగంలో ఎదగలేకపోతున్నా కూడా! ఈ సమస్యను ఎలా అధిగమించాలి? - ఓ సోదరి

జ. మీ ఉత్తరం ద్వారా మీరు యాంగ్జైటీతో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది. ఇది చాలా తీవ్రమైన సమస్య.. దీనివల్ల మీరు ఆఫీసులో పనిచేయడం కూడా కష్టంగా మారుతుంది. మీటింగ్‌కు ముందు కొద్దిగా ఆందోళనపడడం అందరిలోనూ కామన్. కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్య కాస్త భిన్నంగా ఉంది. దీన్ని తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ముందుగా మీ భయం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. దాని ప్రభావం మీ పని మీద పడకుండా చూసుకోండి. దీనికోసం మెడిటేషన్, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. ఉపయోగపడతాయి. వీటిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే మార్పు మీకే తెలుస్తుంది.

మీ ఆందోళనకు మూల కారణం నెగెటివ్ ఆలోచనాధోరణి. దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ మనసులో నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని పాజిటివ్ ఆలోచనలతో భర్తీ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం అంత సులభమేమీ కాకపోవచ్చు. కానీ ప్రయత్నించి చూస్తే మాత్రం మంచి ఫలితాలనిస్తుంది.

‘పాజిటివ్ సెల్ఫ్ టాక్’ కూడా మంచి పద్ధతే.. దీన్ని నేర్చుకోవడానికి బయట పుస్తకాలు, ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్సర్‌సైజ్, వాకింగ్.. లాంటి వాటి వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది. వీటివల్ల మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ విడుదలవుతుంది. అది ఆందోళనను దూరం చేస్తుంది. కార్డియో లాంటి ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా సమస్య కూడా తగ్గుతుంది. దగ్గర్లోని సైకాలజిస్ట్‌ని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

ఆఖరుగా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేంటంటే.. ఈ సమస్య కేవలం మీరు మాత్రమే కాదు.. చాలామంది ఎదుర్కొనేదే.. పైన చెప్పిన పద్ధతులు పాటిస్తూ చాలామంది దీన్ని తగ్గించుకుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా సమస్య కంటే మన శక్తి చాలా గొప్పదని గుర్తుంచుకోండి. ఇలా ఆలోచిస్తే సమస్య చాలా చిన్నదిగా తోస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని