అందుకే 17 ఏళ్ల తర్వాత నా ఆరడుగుల జుట్టును కత్తిరించుకున్నా!

పొడవాటి కురులతో ప్రపంచ రికార్డులు, గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కుతున్న ఆడవారిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే వినూత్నంగా ఓ మహిళ తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. మరి ఇంతకీ ఎవరా మహిళ?ఆ రికార్డుల సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

Updated : 28 Aug 2021 18:11 IST

(Photo: Instagram)

పొడవాటి కురులతో ప్రపంచ రికార్డులు, గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కుతున్న ఆడవారిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే వినూత్నంగా ఓ మహిళ తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. మరి ఇంతకీ ఎవరా మహిళ?ఆ రికార్డుల సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

17 ఏళ్ల తర్వాత హెయిర్‌ కటింగ్!

నల్లగా నిగనిగలాడే కురులు ఆడవారి అందానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే పొడవాటి శిరోజాల కోసం తెగ తాపత్రయపడుతుంటారు చాలామంది మహిళలు. ఇందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల నూనెలు, హెయిర్‌ ప్యాక్‌లు, షాంపూలు కూడా వాడుతుంటారు. అయితే ఇవేవీ అవసరం లేకుండానే... కేవలం తన అమ్మమ్మ ఇచ్చిన హెయిర్‌ ఆయిల్‌తోనే ఆరడుగుల జుట్టును సొంతం చేసుకుంది ఉత్తర వర్జీనియాకు చెందిన జహాబ్‌ కమాల్‌ ఖాన్‌. ఇందుకోసం ఒకటి...రెండు కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు తన కురులపై కత్తెర పడకుండా చూసుకుందీ 30 ఏళ్ల మహిళ. అయితే ఇన్నేళ్ల పాటు ఎంతో అపురూపంగా చూసుకున్న తన పొడవాటి జుట్టును తాజాగా ఓ మంచి పని కోసం కత్తిరించుకుంది జహాబ్.

ఆ పిల్లల విగ్గుల కోసం !

క్యాన్సర్‌ వంటి వ్యాధులకు చికిత్స తీసుకునే క్రమంలో చాలామంది పిల్లలు తమ జుట్టును కోల్పోతున్నారు. ఇలా చిన్న వయసులోనే వెంట్రుకలు రాలిపోవడం వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఇలాంటి పిల్లల విగ్గుల కోసమే తన ఆరడుగుల కురులను కత్తిరించుకుంది జహాబ్. తద్వారా పలువురి మన్ననలు అందుకోవడమే కాకుండా ‘పొడవాటి జుట్టును దానం చేసిన వ్యక్తి’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

అలా వెలుగులోకి!

పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన జహాబ్ ఓ మంచి స్క్వాష్‌ క్రీడాకారిణి. ఆరడుగుల జుట్టున్నప్పటికీ ఆమె ఎక్కువగా బన్‌ హెయిర్‌స్టైల్‌తోనే దర్శనమిచ్చేది. అయితే కొన్నేళ్ల క్రితం కరాచీలో జరిగిన ఓ స్క్వాష్‌ మ్యాచ్‌లో భాగంగా జహాబ్ బన్‌ హెయిర్‌ స్టైల్‌ జుట్టు ముడి విడిపోయింది. అప్పుడే ఆమె పొడవాటి జుట్టు గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమంలో కొన్ని కారణాలతో మూడేళ్ల క్రితం వర్జీనియాకు వలస వచ్చి అక్కడే స్థిరపడిపోయింది జహాబ్.

‘కురులున్న అమ్మాయి ఏ కొప్పు వేసినా అందమే’ అన్న మాటలను నిజం చేస్తోంది జహాబ్. ఇందులో భాగంగా గత నెలలో ఏకంగా 1,100 ప్లాస్టిక్‌ బటర్‌ ఫ్లై హెయిర్‌ క్లిప్స్‌తో తన జుట్టును ముడేసుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కిందీ వర్జీనియా రాపంజెల్‌. తాజాగా పిల్లల విగ్గుల కోసం తన పొడవాటి జుట్టును దానం చేసి మరోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా తన ఆరడుగుల కురుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అమ్మమ్మ చిట్కాలతోనే!

‘ఈ పొడవాటి శిరోజాల ఆలోచన మా నాన్నదే. ఆయనే కురులను కత్తిరించుకోవద్దని నాకు సలహా ఇచ్చారు. నా 13 ఏళ్ల వయసులో చివరిసారిగా జుట్టును కత్తిరించుకున్నాను. మళ్లీ 17 ఏళ్ల తర్వాత కత్తెరకు పని చెప్పాను. హెయిర్‌ కటింగ్‌కు ముందు కొంచెం భయపడ్డాను. అదే సమయంలో సరికొత్త హెయిర్‌ స్టైల్‌లో నేనెలా కనిపిస్తానో అన్న ఆసక్తి కూడా ఉండేది. ఓ మంచి పని కోసం నా కురులను దానం చేయడం సంతోషంగా అనిపించింది. ఏదేమైనా నేను నా ఆరడుగుల కురులను మిస్సవుతున్నాను. 
ఇక నా జుట్టు సంరక్షణ, పోషణ గురించి చెప్పాలంటే... మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్‌, షాంపూలు, కండిషనర్లు పెద్దగా వినియోగించను. అమ్మమ్మ ఇంట్లో తయారుచేసిచ్చిన నేచురల్‌ హెయిర్‌ ఆయిల్‌ను రెగ్యులర్‌గా వాడేదాన్ని. అదేవిధంగా శిరోజాలకు పోషకాలు పుష్కలంగా అందేలా అమ్మమ్మ సూచించిన బ్యాలన్స్‌డ్‌ అండ్‌ హెల్దీ డైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేదాన్ని. తలస్నానం చేసేటప్పుడు, జుట్టు ఆరబెట్టుకునే సయమాల్లో కొన్ని సమస్యలెదురైనా పెద్దగా ఇబ్బందులు మాత్రం ఎదురవ్వలేదు. నేను నా కేశాలతో జడ వేసుకోవడం కంటే బన్‌ హెయిర్‌స్టైల్‌ వేసుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తాను. దీంతో పాటు అమ్మమ్మ సూచించిన కొన్ని హెయిర్‌స్టైల్స్‌ను కూడా ఫాలో అయ్యేదాన్ని’ అని తన హెయిర్‌ కేర్‌ సీక్రెట్స్‌ గురించి చెప్పుకొచ్చింది జహాబ్.

ఇదొక్కటే కాదు...తన సోదరి నేహాతో కలిసి ‘జహాబ్‌ నేహా ఫౌండేషన్‌’ అనే ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది జహాబ్‌. కరాచీ వేదికగా ఉన్న ఈ సంస్థ పేద పిల్లలకు ఉచిత విద్య, క్రీడా సదుపాయాలను కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్