వీటిని కలిపి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గేయచ్చట!
డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటాం.. అతి వ్యాయామాలతో శరీరాన్ని కష్టపెడతాం.. అవసరమైతే ప్రమాదకర చికిత్సలకూ వెనకాడం.. అధిక బరువును తగ్గించుకోవడానికి ఇలా నానా పాట్లూ పడుతుంటారు మనలో చాలామంది. అయితే ఇంత కష్టపడే బదులు ఇంట్లో లభించే కొన్ని ఆహార....
డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటాం.. అతి వ్యాయామాలతో శరీరాన్ని కష్టపెడతాం.. అవసరమైతే ప్రమాదకర చికిత్సలకూ వెనకాడం.. అధిక బరువును తగ్గించుకోవడానికి ఇలా నానా పాట్లూ పడుతుంటారు మనలో చాలామంది. అయితే ఇంత కష్టపడే బదులు ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాల్ని కలిపి తీసుకుంటే ఈ ప్రక్రియ మరింత సులువవుతుందంటున్నారు నిపుణులు. అది కూడా కొన్ని రకాల ఘనాహారం, పానీయాల్ని కలిపి తీసుకుంటే మరీ మేలంటున్నారు. ఇంతకీ ఏంటా ఫుడ్ కాంబినేషన్స్? రండి.. తెలుసుకుందాం!
అల్పాహారంగా ఇవి!
ఉదయాన్నే తొలుత తీసుకునే అల్పాహారం ఆ రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే దీన్ని ఆచితూచి, నిపుణుల సలహా మేరకు ఎంచుకుంటారు చాలామంది. ఇదే బ్రేక్‌ఫాస్ట్ బరువు తగ్గడంలోనూ సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఓ కప్పు టీ/కాఫీ తాగడం కొంతమందికి అలవాటు. ఇలాంటప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌గా కోడిగుడ్లు, ఆ తర్వాత ఓ కప్పు కాఫీ.. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే బరువు తగ్గడం సులువవుతుందట! అది కూడా ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్, ఎగ్‌రోల్, ఎగ్ టోస్ట్.. వంటివి వెన్న, నెయ్యి.. వంటివి లేకుండా తయారుచేసుకోవాలి. ఇక కాఫీ విషయానికొస్తే బ్లాక్ కాఫీని ఎంచుకోవాలి. గుడ్లలోని ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.. అలాగే కాఫీ జీవక్రియల్ని వేగవంతం చేసి శరీరంలోని అదనపు కొవ్వులు, క్యాలరీల్ని కరిగిస్తుంది.
లంచ్‌లోకి చేపలు!
మధ్యాహ్నం కడుపు నిండినా ఓ ముద్ద ఎక్కువగా తినే వారే చాలామంది! నిజానికి బరువు పెరగడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అలా జరగకూడదంటే.. మధ్యాహ్న భోజనం మితంగా తీసుకుంటూనే.. గ్రిల్డ్ ఫిష్‌కు ప్రాధాన్యమివ్వమంటున్నారు. చేపల్లో ఉండే ప్రొటీన్లు ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చేయడంతో పాటు జీవక్రియల్నీ వేగవంతం చేస్తాయి. తద్వారా కొవ్వులు కరుగుతాయి. అలాగే లంచ్ పూర్తయ్యాకా వేడి వేడిగా టీ/కాఫీ తాగాలనుకునే వారు ఓ కప్పు గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఇందులో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వుల్ని కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి గ్రిల్డ్ ఫిష్, గ్రీన్ టీ.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి కాంబినేషన్ అన్నమాట!
సాయంత్రం స్నాక్‌గా..!
సాయంత్రం కాగానే మనసు చిప్స్, బిస్కట్-టీ, పకోడీ, మిర్చి బజ్జీ.. వంటి పదార్థాల పైకి మళ్లుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారికి ఈ పదార్థాలు మంచివి కాదంటున్నారు నిపుణులు. అలాంటి వారు సాయంత్రం స్నాక్‌గా పెరుగులో పండ్ల ముక్కలు కలుపుకొని తీసుకోవాలి. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక పండ్ల ముక్కల్లోని పీచు ఎక్కువ సమయం ఆకలేయకుండా చేస్తుంది. అయితే దీనికి కాంబినేషన్‌గా కాస్త చల్లగా ఉన్న ఓ గ్లాసు నీటిని తాగమంటున్నారు నిపుణులు. చల్లటి నీళ్లే ఎందుకు అంటే.. ఇవి మనం విశ్రాంతి దశలో ఉన్నప్పుడు మన శరీరంలోని క్యాలరీల్ని కరిగించడంలో సమర్థంగా పనిచేస్తాయట! అందులో రుచి కోసం పండ్లు, కీరా ముక్కల్ని కూడా కలుపుకోవచ్చు.
సలాడ్+అల్లం టీ!
రాత్రి భోజనంలో భాగంగా కడుపు నిండా లాగించేస్తుంటారు చాలామంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఇలాంటి పొరపాటు అస్సలు చేయకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే డిన్నర్‌లోకి ఎంత తేలికపాటి ఆహారం తీసుకుంటే అంత మంచిదంటున్నారు. ఈ క్రమంలో నట్స్, సీడ్స్, ఉడికించిన కాయధాన్యాలు, టొమాటో ముక్కలు, పుదీనా-కొత్తిమీర తరుగు.. వంటివన్నీ కలుపుకొని సలాడ్‌లా తయారుచేసుకోవాలి. ఆయా పదార్థాల్లో ఉండే ప్రొటీన్లు, పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే అధిక బరువును తగ్గించడంలోనూ సహాయపడతాయి. అయితే ఈ సలాడ్‌కు కాంబినేషన్‌గా ఓ కప్పు అల్లం టీ తీసుకున్నారంటే.. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆకలేయదని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలాగే అల్లం జీవక్రియల్ని వేగవంతం చేసి క్యాలరీలు కరిగించడంలోనూ సహాయపడుతుందట!
వీటితో పాటు.. అవకాడో+ఆకుకూరలు, ఓట్‌మీల్+వాల్‌నట్స్, గ్రీన్ టీ+నిమ్మరసం, చేపలు+చిలగడదుంప, ఆలివ్ నూనె+క్యాలీఫ్లవర్, పిస్తా పప్పు+యాపిల్, డార్క్ చాక్లెట్+బాదం పప్పులు.. వంటివి కలిపి తీసుకున్నా అధిక బరువు నుంచి విముక్తి పొందచ్చంటున్నారు నిపుణులు.
గమనిక: అయితే ఈ పదార్థాల కాంబినేషన్లు అందరికీ పడకపోవచ్చు. కాబట్టి ముందు కొద్ది మోతాదుల్లో తీసుకొని.. అవి మీ శరీరానికి పడితేనే వీటిని ప్రయత్నించచ్చు.. లేదంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.