స్మూథీలతో మారాను కాబట్టే...

తల్లయ్యాక ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. బరువు తగ్గాలన్నది వైద్యుల ప్రధాన సూచన. అందుకు అవసరమయ్యే ఆహార పదార్థాల కోసం మార్కెట్‌లో వెతికిందామె. తృప్తికరమైనవేవీ కనిపించలేదు. దాంతో స్మూథీలను తయారు చేసుకుంది. అనుకున్న మార్పు సాధించింది.

Updated : 27 Feb 2022 05:44 IST

తల్లయ్యాక ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. బరువు తగ్గాలన్నది వైద్యుల ప్రధాన సూచన. అందుకు అవసరమయ్యే ఆహార పదార్థాల కోసం మార్కెట్‌లో వెతికిందామె. తృప్తికరమైనవేవీ కనిపించలేదు. దాంతో స్మూథీలను తయారు చేసుకుంది. అనుకున్న మార్పు సాధించింది. ఆ అనుభవాన్ని అందరికీ అందించాలనుకున్నా... అందుకే కొత్త మార్గంలో నడుస్తున్నా అంటోంది వకుళ శర్మ. తన వ్యాపార ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందీ హైదరాబాదీ అమ్మాయి...

బీటెక్‌ చదువుకున్న 28 ఏళ్ల వకుళ.. ఇంటీరియర్‌ డిజైనింగ్‌పైన ఆసక్తితో ఆరేళ్లు ఆ వ్యాపారంలో ఉంది. తల్లి అయ్యాక ఆమె ఒక్కసారిగా బరువు పెరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలూ వచ్చాయి. ఆ సమయంలో బరువు తగ్గాలని వైద్యులు సూచించారు. అందుకు పోషకాహారమే సరైన మార్గమనుకుంది వకుళ. కానీ మార్కెట్‌లో తాజా, సహజమైన ఆహారం కనిపించలేదామెకు. అయినా ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని సేంద్రియ పదార్థాలతో స్మూథీలు తయారుచేసి తీసుకునేది. పెరుగు, ఐస్‌క్రీం, చీజ్‌ వంటి వాటిని వాడి పండ్లు లేదా కాయగూరల్ని మెత్తని గుజ్జులా చేయడాన్నే స్మూథీ అంటారు. వీటిని తీసుకుంటూ 3, 4 నెలల్లోనే బరువు తగ్గగలిగింది. వీటిని ఇంట్లో చేసుకోవడం శ్రమతో కూడిన వ్యవహారమని గ్రహించింది. తనలాంటి వారందరికీ ఉపయోగపడేలా స్మూథీ తయారీ సంస్థను మొదలు పెట్టాలనుకుంది. ఇంటీరియర్‌ వ్యాపారాన్ని భర్తకు అప్పగించి తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.

పోషకాలు సమపాళ్లలో... న్యూట్రిషన్‌ విభాగంలో డిప్లొమా చేసి గత సెప్టెంబరులో ‘పల్ప్‌ బ్రూ’ను ప్రారంభించింది వకుళ. ‘గ్రీన్‌ యాపిల్స్‌, అవకాడో, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నారింజ, జామ, బొప్పాయి, ద్రాక్ష, అరటి వంటి పండ్లు... చియా సీడ్స్‌, ఫ్లాక్‌ సీడ్స్‌, పీనట్‌ బటర్‌ వంటి ప్రొటీన్‌ అధికంగా ఉండే ఉత్పత్తులతోపాటు ఆకుకూరలు, కూరగాయలతో రెడీ టు గ్రైండ్‌ స్మూథీలను ప్యాక్‌లలో అందిస్తున్నాం. సాధ్యమైనంతవరకూ సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వాటినే ఉపయోగిస్తాం. హైడ్రోఫోనిక్స్‌ విధానంలో సాగుచేస్తోన్న కూరగాయల్ని తీసుకుంటున్నాం. కూర్గ్‌, కొడైకెనాల్‌ నుంచి అవకాడో, మహాబలేశ్వరం నుంచి స్ట్రాబెర్రీలను రైతుల దగ్గరే నేరుగా కొంటున్నాం. పక్వానికి వచ్చిన పండ్లనే ఎంపిక చేసుకుంటాం. దీనివల్ల పోషకాలు పూర్తిస్థాయిలో లభిస్తాయి. ఆకుకూరల్ని వేడినీటిలో ఉంచి ఆపైన చల్లనీటిలో పెడతాం. ఈ (బ్లాంచింగ్‌) పద్ధతిలో శుభ్రం చేయడంవల్ల సూక్ష్మక్రిములు పోతాయి. పీనట్‌ బటర్‌లాంటివి సొంతంగా తయారు చేస్తున్నాం’ అని వివరించింది వకుళ. పండ్లు, కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువునీ తయారుచేస్తున్నారు.

ప్రస్తుతం పండ్లూ, గ్రీన్స్‌, డిటాక్స్‌, కెఫిన్‌ విభాగాల్లో 30 రకాల స్మూథీలకు అవసరమైన ప్యాక్‌లను అందిస్తోంది పల్ప్‌ బ్రూ. పండ్లను కోసిన గంటలో బ్లాస్ట్‌ ఫ్రీజింగ్‌ టెక్నిక్‌ (-18 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర నిల్వ)తో వాటిని భద్రపరుస్తారు. దీనివల్ల వాటి రంగు, రుచి, పోషక విలువలు తగ్గవు. చక్కెర కలపకుండా తయారు చేస్తున్న ఈ స్మూథీలను అన్ని వయసులవారూ తీసుకోవచ్చంటుందీమె. వీటి కోసం ప్రత్యేక అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్‌లైన్లో, సూపర్‌ మార్కెట్‌లలో కూడా అందుబాటులో ఉంచుతోంది. ‘సప్లిమెంట్స్‌, పిల్స్‌ కంటే వీటితో సహజంగా పోషకాలు అందుతాయి. మన దగ్గర స్మూథీలు తాగే అలవాటు లేదు. కానీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది, పైగా వీటిని వాడటం తేలిక కాబట్టి డిమాండ్‌  పెరుగుతోందంటుందామె. కంపెనీ ప్రారంభించాక తొలి వేసవి ఇదేనని డిమాండ్‌ పెరుగుతుందని నమ్మకంగా చెబుతోంది వకుళ! వ్యాపారమనే కాక, నాలాంటి వేల మందికి మంచి ఆరోగ్యాన్ని అందించడం, పెద్ద సంఖ్యలో రైతులకు ఉపాధినివ్వడం సంతృప్తిని కలిగిస్తున్నాయని సంతోషంగా చెప్పుకొచ్చిందీ యువ వ్యాపారవేత్త.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్