ఉల్లాసంగా ఉత్సాహంగా..!

మనం ఏ రంగంలోనైనా బావుండాలి, వృద్ధి చెందాలి.. అంటే ముందుగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. అప్పుడే దేన్నయినా సాధించగలం, అద్భుతాలు సృష్టించగలం. అందుకోసం నిపుణులు సూచిస్తోన్న ఈ సూత్రాలు పాటించండి అమ్మాయిలూ...

Published : 13 Jun 2022 01:02 IST

మనం ఏ రంగంలోనైనా బావుండాలి, వృద్ధి చెందాలి.. అంటే ముందుగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. అప్పుడే దేన్నయినా సాధించగలం, అద్భుతాలు సృష్టించగలం. అందుకోసం నిపుణులు సూచిస్తోన్న ఈ సూత్రాలు పాటించండి అమ్మాయిలూ...

* శరీరంలో పెద్ద భాగం, అత్యంత ముఖ్యమైందీ అంటే చర్మం. కాదా మరి?! ఆసాంతం కప్పిపెట్టి ఉంచుతూ సంరక్షణ కల్పించేది అదే కదా! కనుక చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమతులాహారం తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

* చర్మం మెరిసిపోవాలి, నిగారింపు రావాలి అంటూ కనిపించినా క్రీములూ లోషన్లూ రాసేయకండి. అవి నాణ్యత లేనివైతే చర్మం పాడవుతుంది. మంచివీ, బ్రాండెడ్‌వీ కూడా కొందరికి సరిపడకపోవచ్చు. కనుక సౌందర్య సాధనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

* రుచికరమైన పదార్థాలు చూసి జిహ్వ చాపల్యంతో అతిగా లావైపోవడమో, పని ఒత్తిడి లేదా నిరాశా నిస్పృహల కారణంగా సరిగా తినకపోవడమో సరి కాదంటున్నారు డైటీషియన్లు. మనల్ని మనం మోసుకోలేని భారీ కాయం, ఎముకలకు చర్మం కప్పినట్టుగా ఉండే పల్చటి రూపం- రెండూ అందహీనమే కాదు అనారోగ్య లక్షణం. తినడంలో లోపాలే కారణమైతే తక్షణం సరిచేసుకోవాలి. కాదూ థైరాయిడ్‌ లాంటి సమస్యలుంటే చికిత్స తీసుకోవాలి. వ్యాయామంతోనే అనేక సమస్యలను నివారించుకోవచ్చు. బరువులో హెచ్చుతగ్గులు చోటుచేసుకోకుండా జాగ్రత్తపడొచ్చు. ఏం చేసినా ప్రయోజనం కనిపించలేదంటే ఇక అదే ఆలోచిస్తూ మనసు పాడుచేసుకోవద్దు.

* మీ రంగు, రూపం, పొట్టి, పొడవు, లావు, సన్నం... లాంటి విషయాలకు పొంగిపోవడమో, కుంగిపోవడమో తగదు. మీరెలా ఉన్నా మిమ్మల్ని మీరు అంగీకరించడం మొట్టమొదట చేయాల్సింది. మన పట్ల మనకే అభిమానం లేకపోతే ఇక ఇతరులు గౌరవించాలని ఎలా ఆశిస్తాం?

* అందానికి కొలబద్దలంటూ ఏమీ లేవు. మన మంచితనం, మాటతీరు, నిజాయితీ, ఆత్మవిశ్వాసం.. లాంటి గుణాలన్నీ ఆకర్షణలుగా మెరుస్తూ అందంగా అలరిస్తాయి.

* శారీరక, మానసిక ఆరోగ్యాలు పరస్పరం ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా అలక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా డిప్రెషన్ను ఎక్కువ మంది పట్టించుకోరు. ఏ విషయం మనల్ని కలవరపరుస్తోంది, ఎందుకు బాధపడుతున్నాం, ఎలా బయటపడాలి- అనే విషయాల గురించి ఆలోచిస్తే ప్రతిదానికీ మార్గం కనిపిస్తుంది. పరిష్కారం సులువౌతుంది. మీకు మార్గాలు కనిపించకపోతే పెద్ద వాళ్లతో చర్చించండి. లేదా నిపుణుల సాయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్