భోజనం మానొద్దు..
ఇంటిల్లిపాదికీ సమయానికి ఆహారం అందించే ఉత్సాహం, తమ ఆరోగ్యంపై మాత్రం ఇల్లాలికి ఉండదు. సమయం ఉంటే ఆహారం తీసుకోవడం లేదా స్కిప్ చేస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో ఉపవాసం పేరుతో ఆహారానికి దూరంగా ఉండటం సరైనది కాదంటున్నారు నిపుణులు.
ఇంటిల్లిపాదికీ సమయానికి ఆహారం అందించే ఉత్సాహం, తమ ఆరోగ్యంపై మాత్రం ఇల్లాలికి ఉండదు. సమయం ఉంటే ఆహారం తీసుకోవడం లేదా స్కిప్ చేస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో ఉపవాసం పేరుతో ఆహారానికి దూరంగా ఉండటం సరైనది కాదంటున్నారు నిపుణులు.
ఆహారం తీసుకోవడంతో జీవక్రియల వేగం మెరుగ్గా ఉంటుంది. శరీరంలో కెలొరీలు కరిగే ప్రక్రియ బాగా జరుగుతుంది. భోజనానికి సమయపాలన పాటిస్తే, అదే సమయానికి ఆకలి వేసేలా శరీరంలో జీవక్రియలు జరుగుతుంటాయి. భోజనానికి సెలవిస్తే ఆకలి హార్మోన్లు ప్రభావితమవుతాయి. వీటిలో లెప్టిన్ హార్మోన్ క్రమేపీ ఆకలిని అణచివేస్తుంది. ఉదయం అల్పాహారాన్ని దాటవేయడం మరింత ప్రమాదకరం. ఇది పూర్తిగా శరీరంలోని జీవక్రియల వేగాన్ని తగ్గించేస్తుంది. రాత్రిళ్లు డైటింగ్ పేరుతో సరైన ఆహారాన్ని తీసుకోకుండా, తెల్లవారిన తర్వాత అల్పాహారం మానేస్తే పూర్తిగా జీర్ణక్రియ విధానం దెబ్బతింటుంది.
ఆకలికి తగినట్లుగా.. అధిక బరువు తగ్గాలని లేదా ప్రత్యేక పండుగ రోజుల్లో ఉపవాసాల పేరుతో ఆకలి వేస్తున్నా ఆహారానికి దూరంగా ఉంటారు. ఇది సరైన విధానం కాదంటున్నారు నిపుణులు. శరీరం కోరుకున్నది లేదా ఆకలికి తగినట్లు ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఆహారం తీసుకోకపోయినా పోషకాలుండే పానీయాలు, పండ్లు, నాలుగైదు బాదం పప్పులు, ప్రొటీన్ బార్స్, కప్పు పెరుగు వంటివి తాత్కాలికంగా తీసుకోవాలి. లేదంటే వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. సూక్ష్మజీవుల ప్రభావానికి శరీరం లోనయ్యే ప్రమాదం ఉంది. పోషకాహార లోపంతో వ్యాధులు దాడి చేస్తాయి.
చక్కెర స్థాయులు.. ఆహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. దీంతో శక్తిహీనత వస్తుంది. ఉపవాసాల్లోనూ ఇదే జరిగి నీరసం ఆవహిస్తుంటుంది. శరీరంలోని అవయవాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే గ్లూకోజు అవసరం. ఆహారానికి మధ్యలో నాలుగు నుంచి ఆరుగంటలు బ్రేక్ రాకుండా జాగ్రత్తపడాలి. లేదంటే చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి.
హార్మోన్లు.. నాలుగైదు గంటలకొకసారి ఆహారాన్ని అందించకపోతే శరీరంలోని హార్మోన్ల పనితీరులో అసమతుల్యత మొదలవుతుంది. ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ హార్మోనుని శరీరం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది కొనసాగితే పలురకాల అనారోగ్యాలకు కారణమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.