బంధంలోనూ కొత్త కావాలి!

కొత్త జంటల్ని చూడండి.. కబుర్లు, ఎదుటివారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో గడిచిపోతుంది. ఆ హనీమూన్‌ దశ దాటిన దగ్గర్నుంచి మొదలవుతాయి.. గొడవలు! ప్రారంభంలో ఉన్న కొత్త పోయి అలవాటుగా మారడమే కారణం. అలా కాకూడదంటే..

Published : 12 Aug 2022 01:29 IST

కొత్త జంటల్ని చూడండి.. కబుర్లు, ఎదుటివారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో గడిచిపోతుంది. ఆ హనీమూన్‌ దశ దాటిన దగ్గర్నుంచి మొదలవుతాయి.. గొడవలు! ప్రారంభంలో ఉన్న కొత్త పోయి అలవాటుగా మారడమే కారణం. అలా కాకూడదంటే..

* ఏదైనా మన చేతికి రానంతవరకూ దాన్ని అందుకోవాలన్న ఆతృత ఉంటుంది. తీరా సొంతమయ్యాక మొదట్లో ఉన్న ఉత్సాహం క్రమంగా తరిగిపోతుంది. ఇది సహజమే! బంధమూ దీనికి మినహాయింపు కాదు. అలాగని ఊరుకుంటేనే ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. కాబట్టి.. చిన్న చిన్న టూర్లు సర్‌ప్రైజ్‌గా ప్లాన్‌ చేయండి. టూర్‌ అనగానే పెద్దవే అనుకోకండి. సినిమాకో, దగ్గర్లోని చూడదగ్గ ప్రదేశానికో అన్నమాట. చేసింది చిన్న సాయమే అయినా కితాబులు ఇచ్చిపుచ్చుకోండి. రోజూ కొత్తగానే ఉంటుంది.

* చాలామందికి కోపాన్ని చూపించే ప్రధాన సాధనం.. అలగడం. ఇద్దరి మనసులూ గాయపడే మాటలు దొర్లవు కాబట్టి, ఇది మంచిదే అనుకుంటాం. నిజమే.. కానీ దానికీ ఓ పరిమితి ఉంటుంది. రోజుల కొద్దీ దీన్ని కొనసాగిస్తే కొత్త అనుమానాలు చేరడం, కోపం ఎక్కువై ఇద్దరి మధ్యా ఎడం పెరుగుతుంది. కాబట్టి... మనసు విప్పి మాట్లాడండి. అదెంత ఇబ్బంది పెట్టే అంశమైనా చర్చించుకుంటేనే ఓ పరిష్కారం దొరికేది. సంబంధిత విషయంలో ఇద్దరి ఆలోచనలు విరుద్ధంగా ఉన్నా పర్వాలేదు. ఎవరు ఎక్కడ సర్దుకుపోవాలో అర్థమవుతుంది.

* ఏదైనా నచ్చకపోతే కాస్త సర్దుకుపోవడంలో తప్పు లేదు. మొండిగా కొనసాగితే అవతలి వ్యక్తిపై ప్రేమ తగ్గి తెలియకుండానే ద్వేషం ఏర్పడుతుంది. అక్కడిదాకా తెచ్చుకోకూడదంటే.. నచ్చనివి చెప్పేయండి. ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. మాటల్లో వ్యక్తం చేయడం ఇబ్బందిగా ఉంటే కాగితంపై పెట్టేయండి. భారం తగ్గడమే కాదు.. రాసేప్పుడు ఆలోచిస్తాం కాబట్టి, మనసును ఇంకా బాగా వ్యక్తం చేయగలుగుతాం.

* వ్యాపకాలు, రుచులు, వ్యక్తులు.. ప్రతిదాంట్లోనూ ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉండాలని లేదు. ఎంతసేపూ ఒకరి ఇష్టాలకు ప్రాధాన్యమిస్తేనే సమస్య. ఒకవారం మీకు నచ్చింది చేస్తే.. మరో వారం మీ భాగస్వామికి నచ్చింది చేయండి. బోర్‌ అనుకుంటాం కానీ.. ప్రతి కొత్త ప్రయత్నమూ ఉత్సాహం కలిగించేదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్