Eldest Daughter Syndrome: ముందు పుట్టడమే తప్పా!

‘ పెద్ద దానివి కదా ఆమాత్రం తెలియదా! తమ్ముడు చూడు ఎలా ఏడుస్తున్నాడో!’ ‘చిన్నవాళ్లకి చెప్తాం కానీ.. పెద్దవాళ్లకేం చెప్తాం...’ తీరా చూస్తే ఆ పిల్లకి నిండా ఐదేళ్లు కూడా ఉండవు.

Updated : 11 May 2023 07:53 IST

‘ పెద్ద దానివి కదా ఆమాత్రం తెలియదా! తమ్ముడు చూడు ఎలా ఏడుస్తున్నాడో!’ ‘చిన్నవాళ్లకి చెప్తాం కానీ.. పెద్దవాళ్లకేం చెప్తాం...’ తీరా చూస్తే ఆ పిల్లకి నిండా ఐదేళ్లు కూడా ఉండవు. చెల్లాయి కన్నా, తమ్ముడు కన్నా ఏడాదో, రెండేళ్లో పెద్దవ్వడమే ఆ పిల్ల చేసిన తప్పా! ప్రతి ఇంట్లోనూ ఇలా ముందు పుట్టిన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యనే ఎల్డెస్ట్‌ డాటర్‌ సిండ్రోమ్‌ అంటారు. ఈ పరిస్థితి వాళ్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది..

‘పెద్దదానివి. నిన్ను చూసి తమ్ముడూ, చెల్లి నేర్చుకుంటారు’.. కుటుంబంలో మొదట పుట్టిన పిల్లలకు ఈ మాటలు చిన్నప్పట్నుంచీ వినిపిస్తూనే ఉంటాయి. చెల్లాయి కంటే పెద్దే అయినా తనూ చిన్నదాన్నే కదా అనుకుంటుంది ఆ పసిమనసు. వారితో ఆడుకోలేక.. అలాగని పెద్దవాళ్ల మాదిరిగా ఉండలేక ఈ పిల్లలు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఇదొక మానసిక సమస్యగా మారే ప్రమాదమూ ఉందంటున్నారు నిపుణులు. దీన్నే ‘ఎల్డెస్ట్‌ డాటర్‌ సిండ్రోమ్‌’ అని పిలుస్తున్నారు.

వాళ్లూ పిల్లలేగా!

పెద్ద కూతురిగా పుడితే చాలు.. తన తర్వాత పుట్టిన వారికి ఆ అమ్మాయి స్ఫూర్తిదాయకంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మొదటి సంతానంగా పుట్టినంత మాత్రాన చిరు వయసులోనే వాళ్లు పెద్దవాళ్లలా వ్యవహరించలేరని అమ్మానాన్నలు గ్రహించకపోవడమే ఇందుకు కారణం. రెండో సంతానం రాగానే ముందు పుట్టినవాళ్లకి అకస్మాత్తుగా పెద్దరికాన్ని ఆపాదిస్తారు. చిన్నపిల్లల్ని ఆడించమంటారు, పాఠాలు చెప్పమంటారు. మరి ‘నేనెప్పుడు ఆడుకోవాలి? నేనెప్పుడు చదువుకోవాలి?’ అని పెద్దపిల్లలు ప్రశ్నిస్తే నీ తర్వాత పుట్టిన వాళ్లకోసం ఆ మాత్రం చేయలేవా అంటూ కసురుకుంటారు. ‘ఇలా చేస్తే ముందు పుట్టినవారు బాల్యంలో ఉండే సరదాలని కోల్పోతారు. మానసికవేదనకు గురవుతారు. తమ్ముడు ఆడుకొనే బొమ్మలాంటిదే తనకూ కావాలనిపించి అడిగితే ‘పెద్దదానివి.. నీకెందుకు బొమ్మలు, తమ్ముడికి ఇచ్చేయ్‌’ అని అమ్మా నాన్నలు అంటే నేను కూడా చిన్న దాన్నే కదా అని చెప్పడం ఆ పిల్లకు తెలియదు. అందరిలో నిందిస్తుంటే.. భావోద్వేగాలను ప్రదర్శించలేరు. బాల్యంలోనే ఈ అనవసరపు బాధ్యతను మోయలేక కుంగుబాటుకు గురవుతుంటారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ఈ సమస్య మరీ ఎక్కువ. అమ్మకు ఇంటి పనుల్లో సాయంగా ఉండాలి. దాంతో తోటివారితో కలవలేరు. 5-14 ఏళ్ల మధ్య పిల్లల్లో దాదాపు 40 శాతంమంది అమ్మాయిలే అబ్బాయిల కన్నా ఎక్కువగా ఇంటి పనిభారాన్ని మోస్తున్నారని తాజా అధ్యయనం తేల్చింది. స్వేచ్ఛగా, సంతోషంగా ఆడుకొనే వయసులో పని, బాధ్యతలవంటివి వీరిలో ప్రతికూల ఆలోచనలను పెంచుతాయి. ఆ అసంతృప్తి క్రమంగా అసూయ, అకారణ ద్వేషం, అనారోగ్యకర పోటీకి దారి తీయొచ్చు.


పరిష్కారం...

చిన్నపిల్లలను అతి జాగ్రత్తగా పెంచాలనే ఆలోచనతో తల్లిదండ్రులు పెద్దపిల్లల సంరక్షణ, మనోభావాలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఇది తప్పు. చిన్నారులకు బాల్యాన్ని దూరం చేయకూడదు. పెద్దయినా, చిన్నయినా పిల్లలందరినీ సమాన దృష్టితో చూడాలి. అందరితో కలిసి ఆడుకొనేలా చూడాలి. ముందు పుట్టినంత మాత్రాన వారు పెద్దవాళ్లు అయిపోరనే నిజాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లల ఒంటరితనాన్ని దూరం చేసి అందరితో కలిసేలా చేయగలిగితే చాలు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్