Updated : 06/01/2022 05:47 IST

ఈమె జీతం కోటిపైనే!

బహుముఖప్రజ్ఞాశాలి.. ఇది సంప్రీతి యాదవ్‌కు సరిగ్గా సరిపోతుంది. చదువు, ఆటలు, సంగీతం.. అన్నింట్లోనూ ముందే. అంతేనా.. ప్రాంగణ నియామకాల్లో నాలుగు పెద్ద సంస్థల్ని మెప్పించింది. తాజాగా గూగుల్‌లో రూ.కోటీ పదిలక్షల వేతనంతో ఉద్యోగాన్నీ సంపాదించింది. ఈమె గురించి ఇంకా తెలుసుకోవాలా? చదివేయండి.

సంప్రీతిది బిహార్‌లోని పట్నా. నాన్న రామశంకర్‌ యాదవ్‌ ఫైనాన్స్‌ సంస్థలో ఉన్నతోద్యోగి. అమ్మ శశిప్రభ పట్టణాభివృద్ధి విభాగంలో ఉపసంచాలకులు. ఉన్నత స్థాయిలో స్థిరపడి, అమ్మానాన్నకి మంచి పేరు తేవడం ఈమె కల. పది, ఇంటర్‌ ఏ తరగతైనా ఎప్పుడూ ముందే. దిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గత ఏడాదే కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. ప్రాంగణ నియామకాల్లో అడోబ్‌, ఫ్లిప్‌కార్ట్‌, మైక్రోసాఫ్ట్‌తోపాటు మరో సంస్థలో ఉద్యోగావకాశాలను దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకొని చేరింది. అక్కడ ఆమె వార్షిక వేతనం రూ.44లక్షలు. దీనిలో ఉద్యోగం చేస్తూనే గూగుల్‌కు దరఖాస్తు చేసుకుంది. 9 అంచెల మౌఖిక పరీక్షను విజయవంతంగా పూర్తిచేసుకుని రూ.1.10 కోట్ల వార్షిక వేతనంతో కొలువు దక్కించుకుంది.

‘ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సంపాదించినా.. వేరే సంస్థలకూ దరఖాస్తు చేసుకోవాలనుకున్నా. వాటిల్లో గూగుల్‌ ఒకటి. వాళ్లకి నా రెజ్యూమె నచ్చింది. 9 దశల్లో వివిధ అంశాల్లో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు. లండన్‌ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు’ అంటోన్న సంప్రీతికి శాస్త్రీయ సంగీతంలోనూ ప్రావీణ్యముంది. నాటకాలు, ఆటలన్నా ఇష్టమే. ఐఐటీ- దిల్లీ, ముంబయిల్లో పలు పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించింది కూడా. ఇన్నింట్లో ఎలా రాణిస్తున్నావంటే.. ఫలితం గురించి కంగారు పడకుండా ఇష్టంగా కష్టపడితే అనుకున్న స్థానానికి చేరడం సులువే అంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి