అంకురాలకు న్యాయం చేస్తోంది..!

భారత్‌లో అంకుర సంస్థలు దూసుకుపోతున్నాయనడానికి ఇటీవల మనదేశం నుంచి 100వ యూనికార్న్‌ సంస్థ రావడమే నిదర్శనం. ఈ మార్పుని ముందే పసిగట్టి.. ఆ రంగంలోనే ప్రత్యేకంగా న్యాయసేవలు అందించే సంస్థని మొదలుపెట్టారు 38 ఏళ్ల అర్చనా రాజారామ్‌. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ‘రాజారామ్‌ లీగల్‌’కు  వ్యవస్థాపకులూ, పెట్టుబడిదారులూ ఖాతాదారులుగా ఉండటం విశేషం. ..

Published : 11 May 2022 06:52 IST

భారత్‌లో అంకుర సంస్థలు దూసుకుపోతున్నాయనడానికి ఇటీవల మనదేశం నుంచి 100వ యూనికార్న్‌ సంస్థ రావడమే నిదర్శనం. ఈ మార్పుని ముందే పసిగట్టి.. ఆ రంగంలోనే ప్రత్యేకంగా న్యాయసేవలు అందించే సంస్థని మొదలుపెట్టారు 38 ఏళ్ల అర్చనా రాజారామ్‌. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ‘రాజారామ్‌ లీగల్‌’కు  వ్యవస్థాపకులూ, పెట్టుబడిదారులూ ఖాతాదారులుగా ఉండటం విశేషం.  


న్యాయవాదుల్లో, వ్యాపారాల్లో మహిళలు తక్కువే.. కానీ, ఆ కొద్ది శాతంలోనూ విజయవంతంగా కెరియర్‌ నడిపిస్తోన్నవాళ్లూ ఉన్నారు. కాబట్టి మహిళలు ఇటువైపు రావాలని గట్టిగా నిర్ణయంచుకోవాలేకానీ సహాయ సహకారాలు అందిచే వాళ్లున్నారు. ఆంత్రప్రెన్యూర్‌ అవ్వాలనుకుంటే.. పెట్టుబడిదారులూ, మార్గదర్శులూ ఉన్నారు.

చెన్నైలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ గవర్న్‌మెంట్‌ లా కాలేజీ నుంచి 2006లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకుంది అర్చనా రాజారామ్‌. ఆ వెంటనే ముంబయిలోని ‘నిషిత్‌ దేశాయ్‌ అసోసియేట్స్‌’లో చేరి ప్రాక్టీసు మొదలుపెట్టింది. అక్కడ నాలుగేళ్ల అనుభవంతో ‘ఏజెడ్‌బీ అండ్‌ అసోసియేట్స్‌’లో సీనియర్‌ అసోసియేట్‌గా అంకుర సంస్థలకు న్యాయ సేవలు అందించేది. అప్పుడే యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌ని 1.4 బిలియన్‌ డాలర్లకు వాల్ట్‌ డిస్నీ చేజిక్కించుకునే ప్రక్రియలోనూ పనిచేసింది. 2013లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పనిచేసేది. మొదట్లో రోనీ స్క్రూవాలాకు చెందిన ‘యునిలేజర్‌ వెంచర్స్‌’కు జనరల్‌ కౌన్సెల్‌గా ఉండేది. స్పోర్ట్స్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌, డిజిటల్‌ కంటెంట్‌, మీడియా, వినోదం... తదితర రంగాల్లోకి సంస్థ అడుగుపెట్టినపుడు న్యాయ సంబంధ విషయాల్లో మార్గనిర్దేశం చేసింది. అర్చన ప్రతిభని గుర్తించి.. మ్యాట్రిక్స్‌ పార్ట్నర్స్‌, ఐడీజీ వెంచర్స్‌ కూడా ఈమె సేవల్ని తీసుకోవడం మొదలుపెట్టాయి. ఖాతాదారులు పెరుగుతుండటంతో 2017లో ముంబయి కేంద్రంగా ‘రాజారామ్‌ లీగల్‌’ను ప్రారంభించింది. ఇప్పుడీ సంస్థలో 20 మంది న్యాయవాదులున్నారు. ప్రధానంగా అంకుర సంస్థల్లో పెట్టుబడులు, భాగస్వామ్యం, పెట్టుబడుల ఉపసంహరణ, చేజిక్కించుకోవడం... ఈ విభాగాల్లో న్యాయ సేవలు అందిస్తుంది. నీ సంస్థ సేవలు అందిస్తున్న సంస్థల్లో యూనిలేజర్‌ వెంచర్స్‌, మ్యాట్రిక్స్‌ పార్ట్‌నర్స్‌, కలారీ క్యాపిటల్‌, సికోయా క్యాపిటల్‌, నెక్సస్‌, స్టెలారీస్‌, లెన్స్‌కార్ట్‌, డైలీహంట్‌, చుంబక్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌.. లాంటి ప్రఖ్యాత సంస్థలెన్నో ఉన్నాయి. స్విగ్గీలో గతేడాది రూ.3300 కోట్లు పెట్టుబడి పెట్టిన ఒప్పందంలో సాఫ్ట్‌బ్యాంక్‌కు, సింగ్‌పూర్‌కు చెందిన టెమాసెక్‌ గతేడాది అప్‌గ్రేడ్‌లో సుమారు రూ.1000కోట్లు పెట్టుబడి పెట్టినపుడు అప్‌గ్రేడ్‌కూ సేవలు అందించింది. మ్యాట్రిక్స్‌ పార్ట్నర్స్‌ ఇండియాలో రూ.5000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఈమెనే న్యాయసేవలు అందిస్తున్నారు.

దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన న్యాయవాదుల్లో ఒకరిగా అర్చనకు అనేక సంస్థలు కితాబిచ్చాయి. ‘వ్యవస్థాపకుల వాటాలూ, నిధుల సమీకరణ, ఉద్యోగులకు వాటాలు ఇవ్వడం, ఖాతాదారులతో వ్యాపార లావాదేవీలూ... ఈ అంశాల్లో న్యాయపరంగా అంకుర సంస్థల వ్యవస్థాపకులు ముందే స్పష్టతతో ఉండాలి’ అంటారు అర్చన. కెరియర్‌లో రాణించడం గురించి మాట్లాడుతూ... ‘100 రకాల పనులు చేయాలనుకోవడం ఎవరికైనా సహజం. కానీ అన్నీ సవ్యంగా సాగిపోతున్నట్లయితే చేయాల్సినంతగా పని చేయడంలేదని అర్థం... అని మా ప్రొఫెసర్‌ చెప్పిన మాటల్ని ఫాలో అవుతా’ అని చెప్పే అర్చన ఆన్‌లైన్‌ చదువుల వేదిక ‘అప్‌గ్రేడ్‌’లో న్యాయశాస్త్ర పాఠాలూ చెబుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్