150 ఊళ్లు మెచ్చిన ఆర్‌జే!

‘హల్లో.. నమస్తే.. నేను మీ వర్షా’.. అంటూ ఈ రేడియో జాకీ చెప్పే మాటల కోసం రోజూ 150 ఊళ్లు ఎదురు చూస్తుంటాయి. సిన్మా పాటల కోసమో, కథల కోసమో అనుకుంటున్నారేమో! కాదు. మరి ఏం చెబుతుందీ అమ్మాయి? మీరూ వినండి...

Published : 19 Jun 2022 01:07 IST

‘హల్లో.. నమస్తే.. నేను మీ వర్షా’.. అంటూ ఈ రేడియో జాకీ చెప్పే మాటల కోసం రోజూ 150 ఊళ్లు ఎదురు చూస్తుంటాయి. సిన్మా పాటల కోసమో, కథల కోసమో అనుకుంటున్నారేమో! కాదు. మరి ఏం చెబుతుందీ అమ్మాయి? మీరూ వినండి...

నాన్న రైతు. ఏటేటా పంటల దిగుబడి తగ్గుతూ వస్తోంది. కొన్నిసార్లు కరవు, ఇంకొన్నిసార్లు తాగునీటికీ ఇబ్బందే. ‘ఇలా ఎందుకు జరుగుతోంది నాన్నా’ అని అడిగింది చిన్నారి వర్ష. దానికి వాళ్ల నాన్న ‘దేవుడి లీల’ అన్నాడు. ఆ జవాబు ఆ అమ్మాయిని సంతృప్తిపరచలేదు. దానికి సమాధానాన్ని తనే వెతకాలనుకుంది. ఒక్కో విషయాన్నీ తెలుసుకుంటోంటే వాతావరణ మార్పులు, అవి వ్యవసాయం, భూమిపై చూపే ప్రభావం వంటి అంశాలపై అవగాహన ఏర్పడింది. నాన్న లాగే ఎంతోమందికి ఈ విషయంపై అవగాహన లేదని గ్రహించింది. స్నేహితురాలితో ఓసారి మాటల్లో రేడియో జాకీల గురించి వింది. వర్షకి అసలే పాటలు పాడటం, నాటకాలంటే ఇష్టం. దీంతో పర్యావరణ అవగాహనకీ ఇదే సరైన మార్గమనుకుంది. ఆలోచన మంచిదే కానీ ఆచరణకు ఎంత కష్టపడాలో తర్వాత అర్థమైందామెకు.

వర్షా రైక్వాడ్‌ది మధ్యప్రదేశ్‌లో ఓర్చా అనే చిన్న పట్టణం. అక్కడ అమ్మాయిలు పనిచేయడం అన్న ఆలోచనకే స్థానం ఉండదు. ఇంట్లో వాళ్లూ అంతే. బుద్ధిగా పెళ్లి చేసుకోమన్నారు. ఆ సంప్రదాయాన్ని తను మార్చాలనుకుని పట్టుబట్టి మరీ రేడియో బుందేల్‌ఖండ్‌లో ఇంటర్న్‌గా చేరింది. ఆ ప్రాంతంలో తనొక్కతే మహిళా ఆర్‌జే. వెళ్లేప్పుడూ, వచ్చేప్పుడూ ఎన్నో వేధింపులు... అయినా తట్టుకొంది. తోటి ఉద్యోగులూ అండగా నిలిచారు.

‘వాతావరణ మార్పులు అనగానే పెద్ద విషయంగా అనిపిస్తుంది. అందుకే ఊరి వాళ్లకు అర్థమయ్యేలా చిన్న చిన్న కథల్లా, ముచ్చట్లలా వివరించేదాన్ని. కరెంటు, నీటి ఆదా, మొక్కల పెంపకం.. ఇలా వీటిపై అవగాహన కల్పించేదాన్ని. తర్వాత రసాయనాల్లేని పంటలు, వ్యవసాయ వ్యర్థాలతో పర్యావరణ హాని మొదలైన వాటిపై స్కిట్‌లు చేసేవాళ్లం. ఊళ్లలో అవగాహన కార్యక్రమాలూ నిర్వహించాం. ‘కౌన్‌ బనేగా శుభ్‌కాల్‌ లీడర్‌’ పేరుతో రియాలిటీ షో చేస్తే ప్రపంచ బ్యాంకు నిధులిచ్చింది. దీంట్లో ఇంటి పంట, వర్షపు నీటి ఆదా వంటి వాటిల్లో 100 గ్రామాల వాళ్లు పాల్గొనేలా చేశాం. అది ఇప్పుడు ఆ గ్రామాల్లో నిరంతర ప్రక్రియ అయ్యింది’ అని ఆనందంగా వివరిస్తోంది వర్ష. అయిదేళ్లలో ప్రత్యేక దినాలకు గుర్తుగా మొక్కల్ని నాటడం, సేంద్రియ సాగు, వర్షనీటి ఆదా, కరెంటు, నీటి వృథాని అరికట్టడం వంటి ఎన్నో మార్పులకు కారణమైంది కూడా.

‘జీవించడానికి ఇల్లు, డబ్బు అవసరమని భావించే వాళ్లు స్వచ్ఛమైన నీరు, గాలి కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి ఆలోచించి, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నా చాలు. దీర్ఘకాలంలో ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అడ్డుకోవచ్చు’ అంటుందీ 23 ఏళ్ల అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్