ఆ తల్లిని చూసి.. సేవను మొదలుపెట్టా!

వ్యాపారవేత్తగా కెరియర్‌లో ఎదిగిందామె. అప్పటివరకు లక్ష్యాన్ని చేరడమే జీవితమనుకుంది తను. కానీ సెరిబ్రల్‌పాల్సీ(సీపీ)తో పాప పుట్టడం అస్సలు జీవితమంటే ఏంటో అర్థమయ్యేలా చేసింది. పేద

Published : 09 Sep 2022 00:53 IST

వ్యాపారవేత్తగా కెరియర్‌లో ఎదిగిందామె. అప్పటివరకు లక్ష్యాన్ని చేరడమే జీవితమనుకుంది తను. కానీ సెరిబ్రల్‌పాల్సీ(సీపీ)తో పాప పుట్టడం అస్సలు జీవితమంటే ఏంటో అర్థమయ్యేలా చేసింది. పేద కుటుంబాల్లో ఇలాంటి చిన్నారులకు చికిత్స చేయించడం కోసం అమ్మానాన్నలెంత కష్టపడుతున్నారో చూసి కదిలిపోయింది. వారికి చేయూతనివ్వాలనే ఆమె ఆలోచన.. నేడు వందలాది బాధిత చిన్నారులకు ఉచిత చికిత్స అందేలా చేస్తోంది. ట్రస్టును స్థాపించి సేవలందిస్తున్న శ్రద్ధ స్ఫూర్తి కథనమిది.

వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రద్ధా సోపార్కర్‌ మొదట న్యాయవాది కావాలనుకుంది. ఆ చదువు కూడా పూర్తిచేసింది. అయితే కుటుంబ వారసత్వం వ్యాపారం కావడంతో అదే కెరియర్‌ను ఎంచుకుంది. జబల్‌పుర్‌కు చెందిన ఈమె, అహ్మదాబాద్‌లోని చంగోదర్‌ సమీపంలో ‘పర్‌ఫెక్ట్‌ అసెట్‌వేర్‌’ సంస్థను స్థాపించి హైజీన్‌ ప్రొడక్ట్స్‌ తయారీ ప్రారంభించింది. ఆ రంగంలో విజయాలను సాధిస్తున్నప్పుడు వివాహమై, శృతి పుట్టింది. లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేసి, సాధించడమే జీవితం అని భావించిన శ్రద్ధాకు శృతి పుట్టిన తర్వాత అసలు జీవితమంటే ఏంటో తెలిసింది. సెరిబ్రల్‌ పాల్సీ(సీపీ)తో పుట్టిన శృతిని ఎలా పెంచాలో అర్థం కాలేదు.

ఆమెను చూసి..
శృతికి నెలలు పెరుగుతుండగా, అందరి పిల్లల్లా తను లేకపోవడం శ్రద్ధను వేదనకు గురిచేసేది. వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధపడ్డా అంటుందీమె. ‘మా పాపకున్న అనారోగ్యం ఏదో ఒక సర్జరీతో సరయ్యేది కాదని తెలుసుకున్నా. తనను సంరక్షిస్తూ, పెంచి పెద్దచేయడమే నా లక్ష్యంగా మార్చుకున్నా. అవసరమైన థెరపీలు, శస్త్రచికిత్సలు చేయించడానికి నా ప్రయత్నాలు ప్రారంభించా. రోజూ థెరపీ చేయించడానికి అహ్మదాబాద్‌లోని ఒక కేంద్రానికి శృతిని తీసుకెళ్లేదాన్ని. అక్కడికి చాలామంది పిల్లలతో వచ్చేవారు. మధ్యాహ్నం భోజనానికి అందరం ఒకచోట కూర్చునే వాళ్లం. అప్పుడే ఒకామెను చూశా. అందరూ లంచ్‌ చేస్తుంటే, ఆమె మజ్జిగ పోసిన అన్నం తింటోంది. అదేంటని అడిగితే, నేను రోజూ కూరలు వండుకొంటే నా కొడుక్కి చికిత్సనెలా చేయించగలను అంది. అది వినగానే నా మనసు చివుక్కుమంది. పేదరికం, దానికి తోడు... అనారోగ్య వంతులైన పిల్లలు పుడితే ఎంత నరకమో అర్థం చేసుకున్నా. సీపీ పిల్లలకు థెరపీతోపాటు కొన్ని రకాల సర్జరీలు కూడా చేయించాలి. అదంతా పేదల వల్ల అయ్యేది కాదని అర్థమైంది. వాళ్లకి సాయం చేయాలనుకున్నా. అలా అక్కడికొచ్చే పేద పిల్లలకు థెరపీ, శస్త్రచికిత్సల ఖర్చులను భరించడం మొదలు పెట్టా. తర్వాత దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న మావారి సలహాతో ‘మధురం ట్రస్టు’ను ప్రారంభించా. అలాగే ‘స్టెపథాన్‌’ ప్రాజెక్టు ప్రారంభించి, దానిద్వారా కాళ్లులేని చిన్నారులకు కృత్రిమ అవయవాలు అందేలా చేస్తున్నా. ఒక్కొక్క కృత్రిమ కాలుకు రూ.లక్ష ఖర్చు అవుతుంది. వీటిని జర్మనీ నుంచి తెప్పిస్తున్నా. ఇప్పటివరకు 100 మందికి అందించా. వచ్చేఏడాదికల్లా ఈ సంఖ్యను 400కు పెంచాలనుకుంటున్నా. కొవిడ్‌ సమయంలో అహ్మదాబాద్‌లోని థెరపీ సెంటర్‌ మూసేశారు. అందుకే గతేడాది నేనే ఇక్కడ అక్వాథెరపీ సెంటర్‌ ప్రారంభించా. సీపీ బాధిత చిన్నారులకు ఈ థెరపీ చాలా ఉపయోగకరం. బయట సెంటర్స్‌లో దీనికి రూ.2వేలు తీసుకుంటారు. మేం దీన్ని ఉచితంగా అందిస్తున్నాం. ఇక్కడ రోజూ 100 మందికి ఈ థెరపీ చేస్తున్నాం. మా సేవలు నచ్చి కొందరు విరాళాలూ ఇస్తుంటారు. ఈ చిన్నారులకు విద్య కూడా చాలా అవసరం. అదే వీరిని సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తుంది. అంతేకాదు, కుటుంబం, సమాజం వీరిని అంగీకరిస్తేనే అందరిలా వీరూ ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు’ అని చెబుతోంది శ్రద్ధ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్