పల్లె నుంచి ప్రపంచస్థాయికి..

మారుమూల పల్లెటూరి అమ్మాయి. అమ్మ ప్రోద్బలంతో ఇంటర్‌ వరకూ వచ్చింది. భర్త అండతో ఉన్నతవిద్య సాధ్యమైంది. మరి వాళ్ల ప్రోత్సాహానికి తగిన ఫలితం దక్కాలిగా! ఆ ప్రయత్నమే చేశారామె. కానీ.. ఆంగ్ల భాషపై పట్టులేక ఎన్నో ఉద్యోగ తిరస్కరణలు. ఇలాంటి పరిస్థితి నుంచి అంతర్జాతీయ సంస్థలో డైరెక్టర్‌ స్థాయికి మన్నె రమాదేవి ఎలా ఎదిగారు? ఆ స్ఫూర్తి ప్రయాణం.. ఆవిడ మాటల్లోనే..

Updated : 12 May 2023 12:49 IST

మారుమూల పల్లెటూరి అమ్మాయి. అమ్మ ప్రోద్బలంతో ఇంటర్‌ వరకూ వచ్చింది. భర్త అండతో ఉన్నతవిద్య సాధ్యమైంది. మరి వాళ్ల ప్రోత్సాహానికి తగిన ఫలితం దక్కాలిగా! ఆ ప్రయత్నమే చేశారామె. కానీ.. ఆంగ్ల భాషపై పట్టులేక ఎన్నో ఉద్యోగ తిరస్కరణలు. ఇలాంటి పరిస్థితి నుంచి అంతర్జాతీయ సంస్థలో డైరెక్టర్‌ స్థాయికి మన్నె రమాదేవి ఎలా ఎదిగారు? ఆ స్ఫూర్తి ప్రయాణం.. ఆవిడ మాటల్లోనే..

లోస్‌.. అమెరికాలో పేరొందిన గృహోపకరణాల సంస్థ. దానికి డైరెక్టర్‌నవడం, అక్కడి ఉద్యోగుల వ్యవహారాలను చూసుకోవడం.. తలచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఒకప్పుడు నా గురించి నేను ఆంగ్లంలో పరిచయం చేసుకోవడానికీ ఇబ్బంది పడ్డా మరి! మాది రాజమహేంద్రవరం దగ్గర నిడదవోలు. నాన్న ముళ్లపూడి రామారావు, అమ్మ శ్రీదేవి. నాన్న చిన్నప్పుడే కర్ణాటకలోని చెల్లూరు క్యాంప్‌లో స్థిరపడ్డారు. నేను పుట్టింది అక్కడే. అయినా ఇంట్లో తెలుగే మాట్లాడతాం. ఇంటర్‌ మొదటి ఏడాది పూర్తవగానే పెళ్లైంది. మావారు మన్నె శేషగిరి మైసూరులో సేల్స్‌ విభాగంలో పనిచేసేవారు. ఇక చదువు ముగిసినట్లే అనుకున్నా. వ్యవసాయ కుటుంబం, అమ్మానాన్నా చదువుకోలేదు. తమ్ముడిని వేరే ఊళ్లో ఉంచి చదివించినా నా విషయంలో మాత్రం ‘అమ్మాయిని వేరే ఊరెలా పంపిస్తా’మనే ధోరణే. కానీ మావారలా కాదు. ‘అమ్మాయి అయితేనేం.. డిగ్రీ ఉండాల’ని పట్టు బట్టారు. చదువయ్యే వరకూ పిల్లలూ వద్దనుకున్నాం. ప్రిన్సిపల్‌ సాయంతో ఇంట్లో ఉండే ద్వితీయ సంవత్సర పరీక్షలు రాశా.

నెట్‌వర్కింగ్‌తో..

టాప్‌ ర్యాంకర్‌ని కాదు కానీ.. మంచి విద్యార్థినినే! మైసూరులో బీబీఏలో చేరా. చివరి సంవత్సరం పరీక్షలప్పుడు గర్భవతిని. అలాగని కెరియర్‌ పక్కన పడేయాలనుకోలేదు కానీ.. పాపకి ఏడాది వచ్చేవరకూ విరామం తీసుకోవాలనుకున్నా. మకాం బెంగళూరుకి మార్చాం. ఏడాదిన్నరయ్యాక ఉద్యోగాన్వేషణలో పడ్డా. ఇంటర్నెట్‌ సెంటర్లలో కూర్చొని దరఖాస్తులు పెట్టేదాన్ని. దినపత్రికలు వెతికి వాక్‌ఇన్‌లకు వెళ్లేదాన్ని. అక్కడ పరిచయాలతో నెట్‌వర్క్‌ ఏర్పరచుకున్నా. అలా ఇంటర్వ్యూల వివరాలు తెలిసేవి. ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేక మొదట్లో అన్నీ తిరస్కరణలే! క్రమంగా ఆ లోపాన్ని అధిగమించి ఇన్ఫోసిస్‌లో కొలువు సాధించా. పీజీ కలని దూరవిద్య ద్వారా నెరవేర్చుకున్నా. నాది హెచ్‌ఆర్‌ విభాగం. ఒక్కోమెట్టూ ఎక్కుతూ అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు అందుకున్నా. విదేశాలకూ వెళ్లొచ్చా. ప్రస్తుతం ‘లోస్‌ ఇండియా’లో చేస్తున్నా. అమెరికాలో సంస్థ ఉద్యోగుల ఆపరేషన్స్‌ ఇక్కడ్నుంచి చూసుకుంటాం. హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా చేరి నాలుగేళ్లలో డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నా.


ఆమే స్ఫూర్తి

17ఏళ్లకే పెళ్లి, ఉమ్మడి కుటుంబం. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే చదువుకున్నా. ఇన్ఫోసిస్‌లో నెలకోసారి షిఫ్ట్‌ మారేది. ఇంటి పని, పాప, ఆఫీసు.. చాలా ఒత్తిడనిపించేది. మగవాళ్లతో పోటీగా పనిచేసినా గుర్తింపు కష్టమే. నోరు తెరిచి అడగాలన్నా ఏమనుకుంటారోనన్న సందేహం. నిరూపించుకోవాలన్న తపనే ముందుకు నడిపింది. రెండోది అంతర్జాతీయ సంస్థ. అందరికీ కనీసం పదేళ్ల అనుభవముంది. నేనే జూనియర్‌ని. కానీ ఆరునెలల్లోనే కీలక ప్రాజెక్టుల్లో స్థానం, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నా. తర్వాత ఎన్ని పురస్కారాలు అందుకున్నా.. అది మర్చిపోలేని సందర్భం. తాజాగా లోస్‌ నుంచి ప్రతిష్ఠాత్మక ‘ఛాంపియన్‌ అవార్డూ’ ప్రత్యేకమే. పల్లెటూరి నుంచొచ్చి.. అంతర్జాతీయ సంస్థలో డైరెక్టర్‌ అవ్వడమే కాదు.. టాప్‌ సంస్థల్లో చదివిన వారికి పోటీనివ్వడం గర్వంగా అనిపిస్తుంది. బంధువులు, తెలిసినవారు, ఆఫీసులో ఎంతో మంది అమ్మాయిలకు మెంటర్‌గా మార్గనిర్దేశం చేస్తున్నా. నాకు లేని అవకాశం ఇతరులకు దొరకాలన్న చిన్న కోరిక. మా అమ్మ నాకు స్ఫూర్తి. నాన్న వ్యాపారం చేసి నష్టాల పాలయ్యారు. ప్రతి రూపాయీ చూసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అయినా అమ్మ మమ్మల్ని ధైర్యంగా నడిపింది. తన వల్లే ఇంటర్‌ వరకూ వెళ్లగలిగా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నేపథ్యం చూసుకొని వెనకడుగేయొద్దు. ఓపిక, ఆత్మవిశ్వాసం పెంచుకోండి చాలు.. రాణిస్తారు. ఈతరం అమ్మాయిలకి నా సలహా ఇది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్