పచ్చగా అడుగేస్తున్నారు!

అందాల జెనీలియా మాంసం తినదు.. ఎందుకో తెలుసా? వర్షం నీటిని ఒడిసిపట్టి ఏడాదంతా ఆ నీటినే వాడుతోంది గుల్‌పనాగ్‌..  వాడేసిన పూలను కూడా వదలదు అలియాభట్‌. వాటితో సబ్బులు, అగరొత్తులు చేసేస్తోంది.

Updated : 05 Jun 2023 07:27 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

అందాల జెనీలియా మాంసం తినదు.. ఎందుకో తెలుసా? వర్షం నీటిని ఒడిసిపట్టి ఏడాదంతా ఆ నీటినే వాడుతోంది గుల్‌పనాగ్‌..  వాడేసిన పూలను కూడా వదలదు అలియాభట్‌. వాటితో సబ్బులు, అగరొత్తులు చేసేస్తోంది. సెలబ్రిటీల ఈ అలవాట్లు భలే ఆసక్తికరంగా ఉన్నాయి కదా! పర్యావరణానికి మేలు చేసే ఆ విషయాలేంటో తెలుసుకుందాం.. వీలైతే ఆచరిద్దాం!

శాకాహార మాంసం..

జెనీలియా

బొమ్మరిల్లు హాసిని.. అదేనండీ జెనీలియా చాలా సంవత్సరాల నుంచీ మాంసాహారానికి దూరం. కారణం.. ఫామ్స్‌లో పెంచే జీవుల కారణంగా నీటి వినియోగం ఎక్కువవుతుంది. పశువులు విడుదల చేసే మిథేన్‌ వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది. అందుకే మొక్కల నుంచి అందే ప్రొటీన్‌ని అందరికీ చేరువ చేయాలని ప్లాంట్‌ బేస్డ్‌ మీట్‌ వెంచర్‌ ‘ది ఇమాజిన్‌ మీట్స్‌’ని భర్తతో కలిసి ప్రారంభించారు. ప్రోటీన్లు అధికంగా ఉండే సోయా బీన్స్‌, పప్పు ధాన్యాలూ, పచ్చి బఠాణీలు బియ్యం, గోధుమల్లోని గ్లూటెన్‌ వంటివి ఉపయోగించి ఈ మాంసాన్ని తయారు చేస్తారు. దీనికి మాంసం రుచిని తెచ్చేందుకు సుగంధ ద్రవ్యాలు, దుంపలూ వాడతారు. పర్యావరణహితమైన ఈ ఉత్పత్తుల్లో నిల్వకారక రసాయనాలేవీ ఉండవు. ఈ అలవాట్లు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయంటారు జెనీలియా.


తొక్కలతో బ్యాగులు

అంజనా అర్జున్‌

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ రెండో కూతురు అంజనా. అనుకోకుండా ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టారీమె. సింగపూర్‌, అమెరికాల్లోని ప్రఖ్యాత కళాశాలల్లో చదివి... రెండేళ్లపాటు ‘ప్రొయెంజా స్కూలర్‌’ సంస్థలో ఉద్యోగం చేశారు. అప్పుడే పర్యావరణ కాలుష్యానికి ఫ్యాషన్‌ ప్రపంచమూ ఓ కారణమని తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఫ్యాషన్‌ ఉత్పత్తుల తయారీ చేపట్టారు. ఫ్యాషన్‌ ఉత్పత్తుల తయారీలో పెద్ద ఎత్తున నీటి వినియోగం అంజనాను ఆలోచింపచేసింది. అప్పుడే వృథా, వ్యర్థాలతో చేసే ఉత్పత్తుల అన్వేషణలో... పండ్ల తొక్కలతో దుస్తులు తయారుచేసే టెక్నాలజీ ఆమెను ఆకర్షించింది. దాంతో మొదట ఆపిల్‌ తొక్కతో... లెదర్‌కి ఏమాత్రం తీసిపోని మన్నికైన మెత్తటి మెటీరియల్‌ని తయారుచేశారు. ఆపై అనాసతోనూ ఫైబర్‌ తీయడం ప్రారంభించారు. మార్కెట్‌లో విడుదల చేసిన వీటికి అంతర్జాతీయంగా బోలెడు డిమాండ్‌ కూడా. ‘భవిష్యత్తులో మరిన్ని పర్యావరణహిత ఉత్పత్తులూ, ఆవిష్కరణలపై దృష్టిపెట్టి అందరికీ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమంటారు’ అంజన.


కాలుష్యాన్ని తగ్గించాలనే...

అలియా భట్‌!

సామాజిక స్పృహ కాస్త ఎక్కువున్న నటి ఆలియాభట్‌. ఇప్పటికే వాడేసిన పూల వ్యర్థాలతో పరిమళాలూ, అగరుబత్తీలూ, సబ్బులూ తయారు చేసే వ్యాపారానికి అండగా ఉన్నారామె. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంటారు అలియా. ప్రకృతి-జీవితాల మధ్య సమతుల్యతను అర్థం చేసుకోవడానికి కోఎక్సిస్ట్‌ అనే కార్యక్రమాన్ని, ‘బీట్‌ప్లాస్టిక్‌ పొల్యూషన్‌’ అనే హ్యాష్‌టాగ్‌తో సోషల్‌మీడియాలో క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా జంతువులూ, చెట్లకు జరుగుతున్న హానీ, పారిశ్రామికీకరణ వల్ల మహాసముద్రాల్లో వస్తోన్న మార్పులూ, ప్లాస్టిక్‌ వల్ల ఏర్పడుతోన్న నీటి కాలుష్యం వంటి విషయాలన్నీ సమాచార రూపంలో ప్రచారం చేస్తున్నారు.


ఆదర్శంగా ఉండాలనే...

- గుల్‌ పనాగ్‌

‘ప్రకృతి శాంతంగా ఉంటేనే.. మనమంతా సంతోషంగా ఉంటామని నమ్ముతా. అందుకే నా పద్ధతులన్నీ పర్యావరణహితంగా మార్చుకుంటున్నా’ అంటారు బాలీవుడ్‌ నటి గుల్‌ పనాగ్‌. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ కారుకి మారి ఆ దిశగా మొదటి అడుగు వేశారీమె. పుణె శివారులో పర్యావరణహిత పద్ధతులతో తన కలల ఇంటిని నిర్మించుకున్నారు. విద్యుత్‌ కోసం సౌరశక్తిని ఆశ్రయించారు. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌ ద్వారా వర్షపు నీటిని వడిసిపట్టి ఏడాదికి లక్ష లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. ఇంట్లో ఏసీ అవసరాన్ని తగ్గించడానికి డబుల్‌ గ్లేజ్డ్‌ విండోని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ వాడకానికి దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులోనూ... మరిన్ని ప్రకృతి హిత జీవనశైలి అలవాట్లను అనుసరించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు గుల్‌పనాగ్‌.


బీచ్‌లు శుభ్రం చేస్తూ...

భూమి పెడ్నేకర్‌

‘ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమయ్యేది’ అంటారు బాలీవుడ్‌ నటి భూమి. క్లైమెట్‌ వారియర్‌గా మారి తరచూ ముంబయి, గోవా బీచుల్లో ప్లాస్టిక్‌ని శుభ్రం చేసే పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తుంటారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేసి.. సుస్థిర జీవనవిధానాల్ని అనుసరిస్తున్నారు.


ప్లాస్టిక్‌ వాడొద్దు...
దియా మీర్జా

‘ప్రకృతి విపత్తులకు కారణం... గ్లోబల్‌ వార్మింగే. చెట్లను కూల్చి గోడలు కట్టాలనుకుంటే నదులు విరుచుకుపడతాయి. ఇప్పటికే ఇలాంటి విపత్తులెన్నో చూశాం అంటారు’ నటి దియా మీర్జా. పర్యావరణ పరిరక్షణ ప్రచారాల్లో చురుగ్గా పనిచేసే దియా... ప్లాస్టిక్‌ రహిత జీవనశైలిని అనుసరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్