సినీ... కిరీటం తెచ్చేనా?

‘హే... నువ్వు మోడలింగ్‌ ప్రయత్నించొచ్చుగా! చక్కగా సరిపోతావు’... సాధారణంగా ఇలా అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? పొగడ్తగా భావిస్తారు. లేదా చిరునవ్వుతో థాంక్యూ చెప్పి ఊరుకుంటారు.

Updated : 09 Mar 2024 07:06 IST

‘హే... నువ్వు మోడలింగ్‌ ప్రయత్నించొచ్చుగా! చక్కగా సరిపోతావు’... సాధారణంగా ఇలా అన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? పొగడ్తగా భావిస్తారు. లేదా చిరునవ్వుతో థాంక్యూ చెప్పి ఊరుకుంటారు. సినీ శెట్టి అలా కాదు... ‘అయితే ప్రయత్నిద్దాం’ అనుకుని ‘మిస్‌ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. నేడు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ కోసం పోటీపడుతోంది. ఈ అమ్మాయి గురించి ఇంకా తెలుసుకోవాలనుందా? అయితే... చదివేయండి.

‘సంప్రదాయాలకు విలువనిచ్చే ఆధునిక యువతి’... సినీ శెట్టి గురించి చాలామంది చెప్పే మాటే ఇది. అందుకు కారణమూ లేకపోలేదు. ఈ అమ్మాయి పెరిగిందంతా ముంబయి. కానీ స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. ఆ సంస్కృతి, సంప్రదాయాలంటే ఇష్టపడుతుంది. అనుసరిస్తుంది కూడా. అంతెందుకు... 28 ఏళ్ల తర్వాత ఈసారి దేశంలో ‘మిస్‌ వరల్డ్‌’  పోటీలు జరుగుతున్నాయని తెలుసు కదా! సొంతగడ్డపై పోటీపడటం ఎలా ఉందని అడిగితే ‘ఒకప్పుడు భారత్‌ అంటే పాములను సమ్మోహన పరచుకుని ఆడించే వాళ్లకి ప్రసిద్ధి అనుకునేవారట. మన సంప్రదాయాలకీ, మనం చేసే అతిథి మర్యాదలకీ ప్రపంచాన్ని సమ్మోహనపరిచే శక్తి ఉంది. వాటిని పోటీ కోసం వచ్చిన అందాల రాణులందరికీ పరిచయం చేయాలనుంది’ అని చెప్పింది. దీన్నిబట్టి తెలియడం లేదూ... ఈ అమ్మాయి భారతీయతకు ఇచ్చే విలువేంటో!

ఆ మాటతో... ఆసక్తి!

అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది. పూర్తవ్వడంతోనే ఎంఎన్‌సీలో ఉద్యోగాన్నీ సాధించింది. తాజాగా సీఎఫ్‌ఏ చదువుతోంది. అన్నట్టూ మంచి డ్యాన్సర్‌. నాలుగేళ్లకే భరతనాట్య సాధన ప్రారంభించి 14 ఏళ్లకే అరంగేట్రం చేసింది. తర్వాత వెస్ట్రన్‌ డ్యాన్స్‌నీ నేర్చుకుంది. ఆ వీడియోలను సినీ శెట్టి తన ఇన్‌స్టా, యూట్యూబ్‌ ఖాతాల్లో పంచుకుంటుంది కూడా. తన ఎత్తును చూసి, ఆఫీసులో ఎవరో మోడలింగ్‌ చేస్తే, చక్కగా రాణిస్తావు అన్నారట. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకునే రకం సినీ. దీన్నీ ఓసారి ప్రయత్నిస్తే సరి అనుకొని శిక్షణ తీసుకుంది. కొద్దిరోజుల్లోనే అవకాశాలు వరస కట్టాయి. పాంటలూన్స్‌, షుగర్‌ కాస్మెటిక్స్‌, ఎయిర్‌టెల్‌, గ్లోబల్‌ దేశీ ఇలా ఎన్నో ప్రకటనల్లో మెరిసింది. దీన్నో హాబీగా మొదలుపెట్టిందే కానీ అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచన లేదు. కానీ మిస్‌ ఇండియా పోటీలకు సంబంధించిన ప్రకటన తనను ఆకర్షించి, దరఖాస్తు చేసింది. తర్వాత దీనిపై అవగాహన లేదని గుర్తొచ్చి ఓ శిక్షణ సంస్థలో చేరింది.

అక్కడ మూడు, ఇక్కడ కిరీటం

శిక్షణ సంస్థలో ప్రతి వారం మాక్‌ పోటీలు నిర్వహిస్తారు. దానిలో పాల్గొన్న సినీ మూడో స్థానంలో నిలిచింది. నెలరోజుల్లో ‘మిస్‌ ఇండియా’ పోటీలు. ఎవరికైనా కంగారొస్తుంది. తను మాత్రం ప్రయత్నించడం వరకే నా వంతు అనుకుంది. ‘మిస్‌ కర్ణాటక’, ఆపై ‘మిస్‌ ఇండియా’ కిరీటాలు గెలుచుకుంది. ఇప్పుడు ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో సత్తా చాటడానికి సిద్ధమైంది. ‘దేవుడు నాకు వరమిస్తే ఎవరూ ఖాళీ కడుపుతో పడుకోవద్దని కోరుకుంటా’ననే 23ఏళ్ల సినీ పేదల కోసం ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా క్యాన్సర్‌ పిల్లలకు వైద్యసేవలు అందిస్తోంది. మిస్‌వరల్డ్‌ పోటీలో భాగంగా ‘ఆశాయే’ పేరుతో ఓ ప్రాజెక్టునీ చేస్తోంది. దాని ప్రకారం మారుమూల గ్రామాల యువతకు పబ్లిక్‌ స్పీకింగ్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ల్లో శిక్షణ, కెరియర్‌ని నిర్మించుకోవడానికి అవసరమైన ఒకేషనల్‌ కోర్సులను అందించడం ఆమె ఉద్దేశం.


‘‘సర్దుకుపోవొద్దు.. గాజు తెరల్ని బద్దలుకొట్టడం నేర్చుకోండి’... ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా అన్న ఈ మాటలే నాకు ఆదర్శం. మొదట నేను మోడలింగ్‌ ప్రయత్నిస్తా అన్నప్పుడు అమ్మానాన్నలు భయపడ్డారు. మంచి ఉద్యోగం మాని కొత్తది చేస్తానంటే కంగారు సాధారణమే! కానీ ఆ కారణంగా ఆగిపోతే ఇంకేదీ ప్రయత్నించలేనని చెప్పడంతో సరేనన్నారు. ఇదనే కాదు... కొత్తగా ఏది చేయాలనుకున్నా ప్రియాంక మాటలే గుర్తొస్తాయి. అలాంటిది ఆమె గెలిచిన పోటీలో ఇప్పుడు నేను తలపడుతున్నా. ఆమెలా ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని గెలిచి దేశం గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ పోటీలో ప్రాముఖ్యం అందానికే కాదు... ప్రపంచం నుంచి ఆశిస్తున్న మార్పును తెలియజేసే మార్గం కూడా’ అంటోన్న సినీ శెట్టికి ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి?


తొలి మహిళ

నీనా సింగ్‌... బిహార్‌లో పుట్టిపెరిగిన ఈమె, మహిళా రక్షణే ధ్యేయంగా పోలీసు విధుల్లో చేరి, కొత్త విధానాలెన్నో ప్రవేశపెట్టారు. దిల్లీ మెట్రోకీ దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకూ భద్రత కల్పించే సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన తొలి మహిళ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్