తెల్లజుట్టు... కారణమేంటి?

ఒకప్పుడు తల నెరుస్తోంది అంటే వయసు మీద పడుతోంది అనుకునేవారు. మరి ఇప్పుడు? ముప్పై రాకముందే తెల్ల వెంట్రుకలు పలకరించేస్తున్నాయి.

Published : 13 Mar 2024 19:28 IST

ఒకప్పుడు తల నెరుస్తోంది అంటే వయసు మీద పడుతోంది అనుకునేవారు. మరి ఇప్పుడు? ముప్పై రాకముందే తెల్ల వెంట్రుకలు పలకరించేస్తున్నాయి. దాచడానికి పడే పాట్లుంటాయి చూడండీ... కాస్త పొడవు జుట్టయితే ఇబ్బంది మరీ ఎక్కువ. 40 రాకముందే ఎందుకిలా జరుగుతోంది? అంటే...

  • జుట్టు నెరవడానికి ప్రధాన కారణాల్లో వంశపారంపర్యం కూడా ఒకటి. పూర్వీకుల జన్యువుల్లో మెలనిన్‌ ఉత్పత్తి తక్కువగా ఉండి, అవి మనకూ సంక్రమిస్తే చిన్నవయసులోనే నెరుపును తప్పించుకోలేం.
  • డైట్‌... దీనికి అమ్మాయిలు ఇచ్చే ప్రాధాన్యం గురించి వేరే చెప్పాలా? సన్నగా కనిపించాలి, బరువు పెరగొద్దు అంటూ నచ్చిన ప్రతిదీ ప్రయత్నించేస్తారు. దాంతో శరీరానికి కావాల్సిన ఐరన్‌, జింక్‌, కాపర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియంట్లూ దొరక్క ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కలుగుతుంది. ఇక ఫ్యాషన్‌ పేరుతో వేసే రంగులు, ఉపయోగించే హీటింగ్‌ పరికరాలు, రసాయనాలున్న కేశ ఉత్పత్తులకు కాలుష్యం, ఎండ ప్రభావం అన్నీ కలిసి ముప్పై దాటకుండానే తెల్లవెంట్రుకలు పలకరించేస్తున్నాయి.
  • సమయానికి తినకపోవడం, నిద్రావేళలు పాటించకపోవడం... ఈతరం అమ్మాయిల్లో చాలా సహజమే కదూ! దీంతో హార్మోనుల్లో అసమతుల్యత ఏర్పడుతుంటుంది. చదువు, ఉద్యోగం అంటూ పెంచుకునే ఒత్తిడి ఇంకా అదనం. ఇవన్నీ కూడా ఇందుకు కారణాలే. చర్మసమస్యలు, థైరాయిడ్‌ వంటివీ త్వరిత నెరుపును ప్రోత్సహించేవే. దాని బారిన పడొద్దా? అయితే...
  • బ్యాలెన్స్‌డ్‌ డైట్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, లీన్‌ ప్రొటీన్‌, పప్పుధాన్యాలకు రోజువారీ ఆహారంలో చోటివ్వాలి. కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి. ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు వంటివాటికి రోజులో కనీసం అరగంట కేటాయించండి. ఇవి ఒత్తిడితోపాటు జుట్టు త్వరగా నెరవడాన్నీ అదుపు చేస్తాయి.
  • రసాయనాలతో కూడిన షాంపూలు, బ్లీచింగ్‌, రంగులు, కెమికల్‌ ట్రీట్‌మెంట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. కొబ్బరినూనెలో కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి, తలస్నానానికి ముందు పట్టించండి. కనీసం పదినిమిషాలు మర్దన చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో కుదుళ్లు ఆరోగ్యంగా ఉండి, మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.
  • చర్మానికి సన్‌స్క్రీన్‌ రాయడం ద్వారా రక్షణ కల్పిస్తాం కదా! కురుల విషయంలోనూ ఆ జాగ్రత్త కావాలి. స్కార్ఫ్‌ కట్టుకోవడం, హెయిర్‌ సీరమ్‌, కండిషనర్‌ వాడటం, వారంలో మూడుసార్లు రసాయనాల్లేని షాంపూతో తలస్నానం తప్పనిసరి చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్