ఎరీ... ఆ ఊరి పట్టు..!

‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా... ఆ కట్టుబడికే తరించేను పట్టు పురుగు జన్మ...’ అన్నారో కవి. ఆ అందమైన పట్టుచీర వెనక అమాయక పట్టుపురుగుల త్యాగం ఉందన్నది దాని అంతరార్థం. ‘ఇది మా ఊరి ఎరీ పట్టుకు ఏమాత్రం వర్తించదు... మాది అహింసా పట్టు’ అంటోంది ఇబా మలై అనే అమ్మాయి.

Updated : 15 Mar 2024 14:10 IST

‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా... ఆ కట్టుబడికే తరించేను పట్టు పురుగు జన్మ...’ అన్నారో కవి. ఆ అందమైన పట్టుచీర వెనక అమాయక పట్టుపురుగుల త్యాగం ఉందన్నది దాని అంతరార్థం. ‘ఇది మా ఊరి ఎరీ పట్టుకు ఏమాత్రం వర్తించదు... మాది అహింసా పట్టు’ అంటోంది ఇబా మలై అనే అమ్మాయి. అనడమే కాదు, ‘కినిహో’ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌తో దానికి ప్రాచుర్యం కల్పిస్తోంది. స్థానిక తెగలకు చేయూతగా నిలుస్తోంది. ఆ ఊరేంటో... ఆ పట్టు కథేంటో... వివరాల్లోకి వెళ్తే...

మేఘాలయలోని రిభోయ్‌ జిల్లా, వుమ్డెన్‌ అనే పల్లెలో పుట్టింది ఇబా. ‘ఫ్యాషన్‌ అంటే అత్యాధునిక దుస్తుల్ని ధరించడమే కాదు, వారసత్వాన్ని అందించే బాధ్యత కూడా అని నమ్ముతాను’ అనే ఈ పాతికేళ్ల అమ్మాయి, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేసి, బెంగళూరులోని కార్పొరేట్‌ సంస్థలో  చేరింది. కానీ తరాలనుంచీ వస్తోన్న తమదైన సంప్రదాయ దుస్తులమీద మక్కువను చంపుకోలేకపోయింది. వాటిని ఎలాగైనా అందరికీ పరిచయం చేయాలనుకుని ఉద్యోగాన్ని వదిలి, జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ అండ్‌ టెక్నాలజీలో డిప్లొమా చేసింది. మూడు లక్షల రూపాయలతో 2016లో ‘కినిహో’ పేరుతో ఎకో బ్రాండ్‌ను ప్రారంభించింది. ఆపై ఊరి వాళ్లను పట్టు పురుగులు పెంచడంలో ప్రోత్సహించింది. అందుకోసం అవసరమైన సౌకర్యాలనీ సమకూర్చి, కకూన్లను కొని, దారాలు వడికించడం ద్వారా వాళ్లకు ఉపాధిని కల్పిస్తోంది. అలా వడికిన దారాలతోనే డిజైనర్‌ వేర్‌ను రూపొందిస్తూ అటు స్థానిక మహిళలకు ఉపాధినీ ఇటు ఆధునికులకు ఎకో-ఫ్యాషన్‌వేర్‌నీ అందిస్తోంది. మొత్తంగా అందరిలోనూ పర్యావరణ స్పృహనీ పెంచుతుంది.

అయితే పట్టు... అనగానే కంచి, ధర్మవరం, ఆరణి... వంటివే కదా. కొత్తగా ఈ ఎరీ పట్టు ఏమిటీ.. వాటితో ఫ్యాషన్‌వేర్‌ ఏమిటీ అనిపిస్తోంది కదూ. నిజమే, కానీ పట్టు దారాల్లో మల్బరీ, మూంగ, టస్సర్‌... ఇలా చాలా రకాలే ఉన్నాయి. వాటిల్లో ఒకటి... ఎరీ సిల్క్‌. ఇది అహింసా లేదా శాంతి పట్టుగా ఇప్పటికే దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందింది. సహజంగా తయారయ్యే ఈ పట్టుకి మేఘాలయ పెట్టింది పేరు. అక్కడి గిరిజన తెగలు సామియా రిసిని  రకం పట్టుపురుగుల్ని పెంచి, వాటి నుంచి వచ్చే పట్టుతో తమ దుస్తుల్ని తామే స్వయంగా తయారుచేసుకుంటారు. ఈ దారాలకు అద్దే రంగుల్ని సైతం అక్కడి అడవిలో పెరిగే మొక్కల నుంచే సేకరిస్తారు. అందుకే దీన్ని ‘వన్య’ పట్టు అనీ అంటారు. ఈ పురుగులు ఆముదం మొక్కల్ని తింటాయి. అసోం భాషలో ‘ఎరా’ అంటే ఆముదం అని అర్థం. కాబట్టే ఈ పట్టుకా పేరు వచ్చింది. అయితే వీళ్లకి దుస్తుల తయారీలో ఎంతటి నైపుణ్యమున్నా మార్కెటింగ్‌ తెలీక తమ అవసరాల కోసమే పట్టుపురుగుల్ని పెంచుకుని వస్త్రాల్ని చేసుకునేవారు. చిన్నప్పటి నుంచీ అవన్నీ చూస్తూ పెరిగింది ఇబా. అందుకే తమదైన సంప్రదాయ పట్టుని ఫ్యాషన్‌ ప్రపంచంలోకి తీసుకురావాలనుకుంది. అందుకోసం ఆ దారాలమీదా ఫ్యాషన్లమీదా చాలానే రిసెర్చ్‌ చేసింది.

అహింసా పట్టు!

సాధారణంగా పట్టుదారాల కోసం ఆ పురుగులతో సహా ఉడికించి దారాలు తీస్తారు. దాంతో ఆ దారాలకో మెరుపు వస్తుంది. కానీ ఎరీ పట్టులో పట్టుపురుగులు కకూన్ల నుంచి బయటకు వచ్చాక వాటి నుంచి దారాలు తీస్తారు. అదెలా అంటే- కకూన్లను నీళ్లలో ఉడికించి, వెడల్పాటి ముద్దల్లా చేసి ఎండబెట్టి అప్పుడు దాన్నుంచి దారాలను నేస్తారు. అందుకే దీన్ని అహింసా పట్టుగా భావించి బౌద్ధులూ వాడతారట. ‘మిగిలిన పట్టుతో పోలిస్తే ఎరీ దారాలు సుతిమెత్తని కాటన్‌ను పోలి ఉంటాయి. పైగా కాస్త బరువుగా ఉండటంతో ఊలు, కాటన్‌... వాటితో చక్కగా కలిసిపోతుంది. థెర్మల్‌ గుణాల కారణంగా చలికాలంలో వెచ్చగానూ వేసవిలో చల్లగానూ ఉంటుంది. వాడే కొద్దీ మెత్తబడుతుంది. పైగా పట్టు పురుగులు ఆహారంగా తినే మొక్కలు కూడా ఎరువులు వాడనివేనట. ‘అందుకే మా పట్టు పూర్తిగా సేంద్రియం. వీటికి అద్దే వర్ణాలన్నీ కూడా సహజమైనవే. బంతి, దానిమ్మ తొక్కలు, గింజలు, పసుపు ఆకులు, ఇంకా పలు రకాల వేళ్ల నుంచి తీసిన రసాలు, పొడులనే వాడతాం. దుస్తులు తయారైన తరవాత మిగిలిన వ్యర్థాలను వృథా చేయకుండా బ్యాగులూ టైలూ ఆభరణాలూ చేస్తూ కినిహోని జీరో వేస్ట్‌ బ్రాండ్‌గా తీర్చిదిద్దాం. అరవై మందికి పైగా చేనేత కార్మికులూ మహిళా రైతులకీ ఉపాధి కల్పించడంతోపాటు నిరుద్యోగులూ చదువు కొనసాగించలేనివాళ్లనీ ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తున్నా. వాళ్లకి మార్కెటింగ్‌లోనూ శిక్షణనిస్తున్నా. మా ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌, రిటైల్‌ దుకాణాల్లో అమ్ముతున్నా. లండన్‌, ఆస్ట్రేలియా, ఇటలీకీ ఎగుమతి చేస్తున్నా. అరుదైన ఎరీ పట్టును ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే నా లక్ష్యం’ అంటోన్న ఈ అమ్మాయి కృషి అభినందనీయమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్