వారానికో రోజు చాలు...

అటు ఇంటి పనులు ఇటు ఉద్యోగ బాధ్యతలూ నిర్వహించే మహిళలకు మొక్కలు పెంచాలనే ఆసక్తీ అనురక్తీ ఉన్నా తీరికా ఓపికా లేక  వెనకాడుతుంటారు. కానీ మనసుంటే మార్గముంటుంది. ఖాళీ సమయం లేని స్త్రీలకు పనిదినాల్లో సమయం కుదరకున్నా

Published : 05 Apr 2022 01:20 IST

అటు ఇంటి పనులు ఇటు ఉద్యోగ బాధ్యతలూ నిర్వహించే మహిళలకు మొక్కలు పెంచాలనే ఆసక్తీ అనురక్తీ ఉన్నా తీరికా ఓపికా లేక  వెనకాడుతుంటారు. కానీ మనసుంటే మార్గముంటుంది. ఖాళీ సమయం లేని స్త్రీలకు పనిదినాల్లో సమయం కుదరకున్నా ఆదివారం కాస్త తీరిక చిక్కుతుంది కదా! ఆరోజు మొక్కల కోసం రెండు మూడు గంటలు వెచ్చించినా చిన్నపాటి తోటను పెంచేయొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో మనమూ పాటించేద్దామా...

* తోట పెంపకంలో మొదటి జాగ్రత్త మట్టి సారవంతమైంది అయ్యుండాలి. ఖాళీ స్థలంలో మొక్కలను పెంచదలచుకుంటే ఎత్తుపల్లాలు లేకుండా నలుచదరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే కొన్ని మొక్కలకు నీరు అందదు, ఇంకొన్ని చోట్ల నీళ్లు నిలిచిపోతాయి. కుండీల్లో పెంచేట్లయితే మట్టి దిమ్మెస కొట్టినట్టు గట్టిగా లేకుండా గుల్లగా ఉంటే అదనపు నీళ్లు అడుగున ఉన్న రంధ్రం లోంచి వెళ్లిపోతాయి.

* సూర్యరశ్మి తగిలే చోట మొక్కలను నాటాలి. ఇతర చెట్ల కొమ్మలు, పొదల నీడ పడితే మొక్కలు ఎదగవు.

* రోజూ మొక్కల కోసం సమయం కేటాయించే అవకాశం లేదు కనుక పెద్దగా నీళ్ల అవసరం లేని రకాలను, నీటి మొక్కలను ఎంచుకోవాలి. వాటికి వారానికోసారి నీళ్లు పోయడం, సీసాల్లో నీళ్లు మార్చడం చేస్తే సరిపోతుంది.

* తప్పక నీళ్లు పోయాల్సిన మొక్కలు కొన్ని ఉన్నా మరేం పరవాలేదు. వాటిని వంటింటికి దగ్గరగా ఉంచాలి. నిత్యం వంట చేసుకుంటాం కదా.. ఉల్లిపాయలు, కూరగాయలు, ఆకుకూరలు లాంటివి కడిగిన నీళ్లను తొక్కలతో సహా ఆ మొక్కల కుదుళ్లలో వంచేస్తే సరిపోతుంది. అందుకు ఒక నిమిషం కూడా పట్టదు. మొక్కలకు బలమూ చేకూరుతుంది. ఆ వ్యర్థాలు సింక్‌లో అడ్డుపడకుండానూ ఉంటాయి.

* రోజూవారీ పని ఒత్తిడి, జీవితంలో ఎదురయ్యే రకరకాల ఆందోళనల నుంచి ఉపశమనానికి మొక్కల పెంపకం దివ్య ఔషధమని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలిని పీల్చగలుగుతాం. మన వంతుగా వాతావరణ కాలుష్యాన్ని నివారించిన వాళ్లమూ అవుతాం. పువ్వులూ కాయలే కాదు.. చిగుళ్లు తొడుగుతున్న కొమ్మలు కూడా బోల్డంత ఆనందాన్నిస్తాయి. మన చేతులతో పెంచుకున్న కాయగూరలు తింటుంటే ఆ ఆనందమే వేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్