వసారాలో పుస్తకాల అర

మనందరికీ మహా ఇష్టమైన ప్రదేశం మనిల్లే. వృత్తి ఉద్యోగాల రీత్యా రోజంతా బయట గడిపినా, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లినా, పెళ్లిళ్లూ పర్యటనలకు వెళ్లినా అవేవీ మనవి కావు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అనిపిస్తుంది. పూర్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు అనుభవించేది అక్కడే మరి. అది ఇంద్రభవనమే కానక్కర్లేదు, ఎంత చిన్నదైనా అక్కడే

Published : 22 Aug 2022 00:35 IST

మనందరికీ మహా ఇష్టమైన ప్రదేశం మనిల్లే. వృత్తి ఉద్యోగాల రీత్యా రోజంతా బయట గడిపినా, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లినా, పెళ్లిళ్లూ పర్యటనలకు వెళ్లినా అవేవీ మనవి కావు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అనిపిస్తుంది. పూర్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు అనుభవించేది అక్కడే మరి. అది ఇంద్రభవనమే కానక్కర్లేదు, ఎంత చిన్నదైనా అక్కడే అసలైన ఆనందం అనుభూతికొస్తుంది. అక్కడే మనకి నచ్చినట్టు ఉండగలుగుతాం. అంత ఇష్టమైన ఇంటిని ఇంకాస్త అందంగా, అద్వితీయంగా తీర్చిదిద్దుకోడానికి ఇంటీరియర్‌ డిజైనర్ల సూచనలివి...

* గోడలకు ఆకర్షణీయమైన రంగులేస్తాం కానీ ఐదో గోడ.. అదేనండీ సీలింగ్‌ను పట్టించుకోం. మనకు తెలీకుండానే మన చూపు పైకప్పు మీద నిలుస్తుంటుంది. కనుక సీలింగును నిర్లక్ష్యం చేయొద్దు. చక్కటి పెయింటింగ్‌ వేయించినా లేదా వాల్‌పేపర్‌ అంటించినా చాన్నాళ్లు శోభిస్తుంది. గోడల్లా త్వరగా మాసిపోదు.

* చాలామంది స్థలం కలిసొస్తుందని భోజనాల బల్లను గోడకు చేర్చి ఉంచుతారు. కానీ నలువైపులా ఖాళీ ఉండేలా అమరిస్తే మరింత అందంగా ఉంటుంది. ఎటైనా సులువుగా కూర్చుని లేవొచ్చు. వడ్డన కూడా సులువవుతుంది.

* నగరాల్లో భద్రత కోసం తలుపులు మూయక తప్పని పరిస్థితి. కానీ కిటికీలు మాత్రం తెరిచే ఉంచండి. వాటికి డిజైన్‌ జాలీలు(మెష్‌) అమర్చారంటే సౌందర్యం ఉట్టిపడుతుంది, స్వచ్ఛమైన గాలీవెల్తురూ లోనికి వస్తాయి.

* ముందు హాల్లో ఎక్కువ సామానుంటే సంతను తలపిస్తుంది. ఒక సోఫా, రెండు కుర్చీలు, రెండు మోడాలు మధ్యలో టీపాయ్‌ ఉంటే చాలు. ఎక్కువమంది అతిథులు వస్తే లోపల్నుంచి ఫోల్డబుల్‌ కుర్చీలు తెచ్చి వేయొచ్చు. వీలైతే గోడ పక్కగా రెండు ఇండోర్‌ ప్లాంట్స్‌ అమర్చండి.

* సోఫా కవర్లూ కుషన్లూ, కర్టెన్లు సాధారణంగా సాదా రంగులవి ఇష్టపడతాం. అవి త్వరగా బోర్‌ కొట్టించని మాట నిజం. కానీ అతిథులు విచ్చేస్తున్నప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో పూలూ లతలున్న తెరలూ, కవర్లూ తగిలించండి. ఎంతో మార్పుగా, మనసుకు హాయిగా ఉంటుంది.

* ఇరుకైన వసారాలో వస్తువులేమీ పెట్టలేమని చింతిస్తున్నారా? ఒక గోడకు బుక్‌ షెల్ఫ్‌ తగిలించారంటే స్థలం కలిసొస్తుంది, మీ అభిరుచి ప్రతిఫలిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్