సహోద్యోగులతో సరిపడకపోతే..

కళాశాల లాంటిదే ఆఫీసు కూడా! భిన్న మనస్తత్వాలు, నేపథ్యాల వారుంటారు. చిన్న చిన్న గొడవలు, విమర్శలు సహజమే. అవి సానుకూల దిశలో సాగితే మనకూ లాభమే. కానీ పరిధి దాటినప్పుడే సమస్యలు. కాబట్టి.. పనిచేసే చోట సదా అప్రమత్తత అవసరమంటారు నిపుణులు...

Updated : 13 Aug 2022 04:49 IST

కళాశాల లాంటిదే ఆఫీసు కూడా! భిన్న మనస్తత్వాలు, నేపథ్యాల వారుంటారు. చిన్న చిన్న గొడవలు, విమర్శలు సహజమే. అవి సానుకూల దిశలో సాగితే మనకూ లాభమే. కానీ పరిధి దాటినప్పుడే సమస్యలు. కాబట్టి.. పనిచేసే చోట సదా అప్రమత్తత అవసరమంటారు నిపుణులు..

కొందరికి పని ప్రదేశం గంభీరంగా ఉండటం నచ్చదు. కొంచెం సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిని వీలైనంత వరకూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన పనిలేదు. మరీ బాధించేలా ఉన్నప్పుడు భరించాల్సిన అవసరం లేదు. వెంటనే అలా మాట్లాడొద్దని చెప్పేయండి. భవిష్యత్‌లోనూ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మొదట మొహమాటపడి వదిలేసి, తర్వాత బాధపడొద్దు. కావాలనే బాధిస్తుంటే మాత్రం పట్టించుకోకుండా ఉండటం మంచిది. తమకంటే బాగా పనిచేస్తున్నవారిని ఇబ్బంది పెట్టి, తప్పులు చేసేలా చేయడం కొందరికి అలవాటు. అందుకనే ఇలా చేస్తుంటారు. ఆ అవకాశమివ్వకూడదంటే.. వాళ్లని పట్టించుకోవడం మానేయండి.

పట్టించుకోకపోయినా ఆపడం లేదా? ఒకట్రెండు రోజుల్లోనే ఫలితం ఆశించొద్దు. కాస్త ఓపిక పట్టండి. వాళ్లే విసుగు చెందుతారు. మీమీద ఎంత నెగెటివ్‌గా ప్రచారం చేసినా.. మీరు మాత్రం మీ పని కొనసాగించండి. నమ్మిన వాళ్లకి మీ సమాధానం అవసరం లేదు. నిజమైన స్నేహితులైతే అసలు నమ్మరు లేదా మీతో రూఢీ చేసుకుంటారు. ‘మనవాళ్లు’ ఎవరో తెలిసేది ఇలాంటి సందర్భంలోనే!

మీ, మీ ఇంట్లోవాళ్లకు సంబంధించిన ప్రాథమిక వివరాల వరకూ చెబితే చాలు. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్నీ బయట పంచుకోవద్దు. కొందరు తెలుసుకోవాలని ప్రయత్నించినా నవ్వి ఊరుకోండి. లేదూ సంభాషణని మరల్చండి. అంతేకానీ ఇంట్లో జరిగే చిన్న విషయాన్నీ, పంచుకుంటే వదంతులకు దారి తీసే ప్రమాదమెక్కువ.

పని ప్రదేశంలోనూ స్నేహితులుండాలి. ప్రాణ స్నేహితులే అవ్వాల్సిన పనిలేదు కానీ.. ఒత్తిడినీ, చిరాకునీ దూరం చేయగలిగేలా, సరదా సంభాషణలు చేసేవారైతే ఆఫీసూ ఆనందంగా ఉంటుంది. అయితే వాళ్ల కామెంట్లు, ఇతరులపై ఫిర్యాదుల విషయంలో త్వరపడి మాట జారొద్దు. విని ఊరుకోండి. ముఖ్యంగా వదంతులను చర్చించొద్దు. మీ కోపాన్నీ ఆఫీసు ప్రాంగణంలో అదుపులో ఉంచుకోండి. త్వరపడి నోరు జారారో మీకే సమస్యగా మారొచ్చు.

పొగరనో, పని చేయరనో చెప్పుకుంటే మనకు పోయేదేమీ ఉండదు. అప్పగించిన పని సక్రమంగా పూర్తి చేయడం ద్వారా నిరూపించుకోవచ్చు. కానీ వ్యక్తిత్వానికి సంబంధించి నోరు జారితే మాత్రం ఊరుకోవద్దు. ధైర్యంగా నిలబడండి. వాళ్లనే పక్కకు తీసుకెళ్లి నిలదీయండి. అవసరమైతే పైవాళ్ల దృష్టికీ తీసుకెళ్లండి. వీటిని మాత్రం మౌనంగా భరించొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్