అమెరికాలో విజయాల అమ్మకుట్టి

అమెరికా ఎలా ఉంటుంది? అక్కడికెళ్లిన వాళ్లు ఎలా ఉంటారు? పూజలు, పండగలు ఎలా చేసుకుంటారు? మనం తినేవన్నీ అక్కడ దొరుకుతాయా? ఇలా బోలెడు సందేహాలు... ఈ ఉత్సుకతే వేములవాడ అమ్మాయి ‘కల్యాణి బొప్ప’ని ‘అమెరికాలో అమ్మకుట్టి’ని చేసింది.

Updated : 13 Nov 2022 09:14 IST

అమెరికా ఎలా ఉంటుంది? అక్కడికెళ్లిన వాళ్లు ఎలా ఉంటారు? పూజలు, పండగలు ఎలా చేసుకుంటారు? మనం తినేవన్నీ అక్కడ దొరుకుతాయా? ఇలా బోలెడు సందేహాలు... ఈ ఉత్సుకతే వేములవాడ అమ్మాయి ‘కల్యాణి బొప్ప’ని ‘అమెరికాలో అమ్మకుట్టి’ని చేసింది. యూట్యూబ్‌, ఉద్యోగం, వ్యాపారాలతో మూడు పడవల ప్రయాణం చేస్తున్న తను ఆ విశేషాలను వసుంధరతో పంచుకుందిలా..

న్ను నా పేరుతో కంటే... ‘అమెరికాలో అమ్మకుట్టి’గానే ఎక్కువ గుర్తుపడతారు. ఇది నేనసలు ఊహించనిది. మాదో మధ్యతరగతి కుటుంబం. పుట్టి, పెరిగిందంతా అమ్మమ్మ వాళ్లూరు మల్యాలలో. నాన్న శంకర్‌ ఆర్‌ఎంపీ డాక్టర్‌, అమ్మ ఉమ. మంచి స్థాయికి చేరాలంటే చదువే దారనేది అమ్మ. నాన్నకు చేదోడుగా బొటిక్‌ నిర్వహించేది. వారి కష్టాన్ని అర్థం చేసుకుని చెల్లి, తమ్ముడు, నేనూ బాగా చదివే వాళ్లం. జేఎన్‌టీయూ కొండగట్టులో బీటెక్‌ చేశా. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనే ఉద్యోగం వచ్చింది.

అన్నీ కొత్తగానే...

మా వారు కార్తీక్‌దీ వేములవాడే. తన ఉద్యోగరీత్యా అమెరికా వచ్చేశాం. ఇక్కడ నాకు ఉద్యోగం రావడానికి కాస్త సమయం పట్టింది. ఆ ఖాళీలో ఈ దేశ విశేషాలు తెలుసుకుంటోంటే కొత్తగా తోచేవి. ప్రతిదీ ఇండియాతో పోల్చేదాన్ని. తేడాల్ని మా వారితో చెబుతోంటే.. ‘ఆసక్తిగా అనిపించిన వాటిని యూట్యూబ్‌లో పంచుకోవచ్చుగా’ అన్నారు. అలా 2019 ఫిబ్రవరిలో ఛానల్‌ ప్రారంభించా. చిన్నప్పటి నుంచీ నాకు స్టేజ్‌ ఫియర్‌ లేదు కానీ... యూట్యూబ్‌ అనే సరికి మొదట్లో బెరుగ్గా ఉండేది. వీక్షకుల ఆదరణ చూశాక ధైర్యం వచ్చింది. ఇందులో నెగిటివిటీ ఎక్కువే. అయితే నేనవి పెద్దగా పట్టించుకోను. ఇద్దరం పొద్దున్నే ఆఫీసులకెళ్లి ఏ సాయంత్రమో ఇంటికి చేరతాం. ఆ తర్వాత ఇంటి, వంట పనులతో తీరికుండదు. అందుకే ప్రతి వ్యాఖ్యనీ చదవలేం. మొదట్లో నా వీడియోలకు 10, 20 వేల వ్యూస్‌ వస్తే గొప్పనుకునేదాన్ని. కానీ తక్కువ సమయంలోనే సబ్‌స్క్రైబర్ల సంఖ్య 4 లక్షలకు, వీక్షణలు 10.5 కోట్లకు చేరాయి. ప్రతి వీడియోలోనూ కొంత సమాచారమైనా వీక్షకులకు ఉపయోగపడేలా చూసుకోవడం వల్లే ఈ ఆదరణ. ఒక్కో వీడియో సిద్ధమవడానికి సుమారు ఏడు గంటలు పడుతోంది. మొదటి సారి అమెరికాను నేను చూసిన కళ్లతోనే మన వాళ్లకీ చూపిస్తున్నా. అందుకే అందరూ నన్ను వాళ్లింట్లో అమ్మాయిలా చూస్తున్నారు. ఈ మధ్య భారత్‌ వచ్చా. అప్పటికప్పుడు కరీంనగర్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం పెడితే ఎంతమంది వచ్చారో!

ప్రతికూలతల్ని పట్టించుకోను...

యూట్యూబ్‌, ఇన్‌స్టాలను ప్రధాన ఆదాయ వనరుగా భావించలేదు. మధ్యతరగతి అమ్మాయిగా నా జీవితం స్థిరంగా ఉండాలనుకుంటా. సామాజిక మాధ్యమాలు పేరు తెస్తాయి కానీ అదే శాశ్వతం కాదు.. అందుకే ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం. ఏ వీడియో చేసినా.. మీ దుస్తులు బాగున్నాయి, ఎక్కడ కొన్నారని చాలామంది అడిగేవారు. అప్పుడే డిజైనింగ్‌ ఆలోచన వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పట్నించీ అమ్మ డ్రస్సులు కుడుతోంటే నేనూ, చెల్లీ గమనించే వాళ్లం. తన సాయంతో నా దుస్తుల్ని నేనే డిజైన్‌ చేసుకునేదాన్ని కూడా. ఆ అవగాహనతోనే ‘హౌస్‌ ఆఫ్‌ కల్యాణీ బొప్ప’ ప్రారంభించా. యాంకర్‌ లాస్య, హారిక, శ్రీదేవి డ్రామా కంపెనీలో కొందరికి డిజైన్‌ చేసిచ్చా. ఆన్‌లైన్‌ ఆర్డర్లూ, డిజైన్లూ వంటివి నేనూ... ఆఫ్‌లైన్‌ పనంతా అమ్మా, చెల్లీ, సిబ్బంది చూసుకుంటాం. మా బృందంలో 12 మంది పని చేస్తున్నారు. చేస్తున్న పని మీద కచ్చితమైన అవగాహన ఉండాలి. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే తీసుకున్న నిర్ణయమ్మీద నిలబడగలగాలి.. అప్పుడే అనుకున్నది సాధించగలం.

- అవదూత హరిప్రియ, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని