బాధ్యతల భారాన్ని తగ్గించుకోవాలంటే

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లికి ముందు భారం, బాధ్యతల గురించి తెలియక పోయినా... తర్వాత వాటిని తలకెత్తుకోక తప్పదు.

Published : 08 Jun 2023 00:11 IST

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లికి ముందు భారం, బాధ్యతల గురించి తెలియక పోయినా... తర్వాత వాటిని తలకెత్తుకోక తప్పదు. ఇలాంటప్పుడు ప్రతికూలతలు మీ దరికి చేరకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు రీఛార్జ్‌ చేసుకోవాలి. అదెలాగంటే...

* ఏ కాస్త ఒత్తిడిగా అనిపించినా.. పదే పదే అవే ఆలోచనలతో సతమతమయిపోవద్దు. వాటి నుంచి బయటపడటానికి కాసేపైనా ప్రకృతిలో సేదతీరే ప్రయత్నం చేయండి. ఏ కాస్త ఖాళీ దొరికినా ఉద్యానవనాలు, పొలాలు, తోటలు ఏదైనా ప్రకృతి ఒడిలో ఓ రోజంతా గడిపితే ఒత్తిడి తగ్గి, పనిలో చురుకుదనం పెరుగుతుంది.

* కుటుంబ బాధ్యతలన్నీ మీదున్నాయని సంతోషాల్ని దూరం చేసుకుంటే ఎలా? ఒంటరితనం సమస్యల్ని మరింత కఠినంగా మార్చేస్తుంది. వీలైతే మీ స్నేహితులూ, బంధువుల్లో మీ మనసుకి నచ్చిన వారుంటే వారితో కాసేపు గడపడానికి ప్రయత్నించండి. మనసు విప్పి మాట్లాడండి. ఇది మీకు కొత్త శక్తిని ఇవ్వొచ్చు.

* బాధను, ఒత్తిడినీ జయించాలంటే... కాస్తంతైనా సేదతీరే సమయం మీకు చిక్కాలి. ఇందుకోసం మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. కామెడీ సినిమాలు చూడండి. పుస్తకాలు చదవండి. హాయిగా ఓ గంట నిద్రపోండి. అదీ లేదంటే పాదాలకూ, మెదడుకూ ఉపశమనాన్నిచ్చేలా స్పా చేయించుకోండి. ఇవన్నీ మీ శరీరంతో పాటు మెదడునీ తేలికపరుస్తాయి.

* ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీతో మీరు ఎపుడైనా మాట్లాడుకున్నారా? అదేంటి అని ఆశ్చర్యపోకండి! మీరేంటో? మీలో ఎంత శక్తి ఉందో మీకు మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకోండి. మీ బలాలు, బలహీనతలు చర్చించుకోండి. దీనివల్ల ఏదైనా సమస్య ఎదురైనపుడు మీవల్ల అవుతుందో లేదో తెలిసిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని