మా అత్తింటి వారికి తెలిస్తే ఏమంటారో!
మనస్పర్థల వల్ల వదిన మా అన్నయ్యతో పాటు నా మీద, అమ్మ మీదా కూడా 498ఎ కేసు పెట్టింది. విడాకులు ఇస్తే దీన్ని వెనక్కు తీసుకుంటామని ఆమె తరఫు వాళ్లు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు ఒప్పుకొన్నాడు.
మనస్పర్థల వల్ల వదిన మా అన్నయ్యతో పాటు నా మీద, అమ్మ మీదా కూడా 498ఎ కేసు పెట్టింది. విడాకులు ఇస్తే దీన్ని వెనక్కు తీసుకుంటామని ఆమె తరఫు వాళ్లు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు ఒప్పుకొన్నాడు. వాళ్లు కేసుని విత్‌డ్రా చేసుకుంటున్నామని కాగితం రాసి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారు. ఇప్పుడు ఎవరి దారిన వారు బతుకుతున్నారు. అయితే, ఎప్పుడో క్లోజ్ అయ్యిందనుకున్న ఆ కేసు సమన్లు ఇప్పుడు మాకు అందాయి. అడిగితే, మీరు బయట రాజీపడితే కుదరదనీ, కేసు కోర్టులో ఉంది కాబట్టి అక్కడే తేల్చుకోవాలనీ చెప్పారు. ఇప్పుడు నాకు పెళ్లయ్యింది. ఇదంతా తెలిస్తే... మా అత్తింటి వారు ఎలా స్పందిస్తారోనని భయంగా ఉంది. దీన్నుంచి ఎలా బయటపడగలమో సలహా ఇవ్వగలరు.
- ఓ సోదరి
సాధారణంగా వరకట్న వేధింపులు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్‌లో 498ఎ కేసును పెడతారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా కేసుల్లో కుటుంబ సభ్యులందరినీ ఇరికించే సంఘటనలు ఎక్కువయ్యాయి. 498ఎ లేదా గృహహింస చట్టం కింద ఫిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు విచారణ చేసి కేసు రిజిస్టర్ చేయాలి. అందుకోసం వారు సీఆర్‌పీసీ 41(ఎ) కింద నోటీసు ఇచ్చి ఇరు వర్గాలనూ కూర్చోబెట్టి నిజానిజాలు తేలుస్తారు. అక్కడే చాలా కేసులు సెటిల్ అవుతాయి. లేదంటే అప్పుడు కోర్టుకి వెళ్తాయి. అంటే దానర్థం వరకట్న వేధింపుల కింద కేసు రిజిస్టర్ అయ్యిందని చెప్పొచ్చు. అప్పుడు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకోవడమో, అరెస్ట్ అయ్యాక రెగ్యులర్ బెయిల్ తీసుకోవడమో జరుగుతుంది. ఒకసారి కోర్టుకి కేసు చేరాక పోలీస్ స్టేషన్‌లో కేసు విత్ డ్రా చేసుకుంటున్నామని రాసిస్తే సరిపోదు. కోర్టులోనూ ఆ విషయం చెప్పాలి. అసలు ఈ కేసు ఇన్నాళ్లు ఎందుకు కోర్టులో పెండింగ్ ఉండిపోయిందో తెలియదు. సాధారణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసు విత్ డ్రా అవుతుంది. అది అమ్మాయి ద్వారానే జరగాలి. ఆ అమ్మాయి తరఫున వారికి ఈ విషయాన్ని పెద్ద మనుషుల సాయంతో తెలియజేయండి. స్టేషన్‌లోనే రాజీ పడ్డ విషయాన్ని కోర్టుకి లాయర్ ద్వారా చెప్పించండి. ఆ అమ్మాయి రాసిన లేఖను కోర్టులో చూపించండి. ఇక, మీరు కోర్టులో హాజరు కావాల్సిన అవసరం లేకుండా ‘డిస్పెన్స్ విత్ పిటిషన్’ వేయించండి. కోర్టులో రాజీ అయ్యాక పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడటానికి రెండు మూడు నెలల సమయం పడుతుంది. అధైర్యపడకండి. ముందు ఓ మంచి లాయర్‌ని సంప్రదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.