బతకడనుకున్న బిడ్డ.. పతకం తెచ్చాడు!

మారియప్పన్‌ తంగవేలు! రియో పారాలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం సాధించిన వీరుడు. నిజానికి అతని పేరు తంగవేలు మారియప్పన్‌ అనే ఉండాలి! తమిళులకి ఇంటిపేరు ఉండదు కాబట్టి తండ్రి పేరునే ముందు చేర్చుకోవడం వాళ్ల పద్ధతి. కానీ మారియప్పన్‌ అలా చేయలేదు.

Updated : 09 Dec 2022 13:22 IST

మారియప్పన్‌ తంగవేలు! రియో పారాలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం సాధించిన వీరుడు. నిజానికి అతని పేరు తంగవేలు మారియప్పన్‌ అనే ఉండాలి! తమిళులకి ఇంటిపేరు ఉండదు కాబట్టి తండ్రి పేరునే ముందు చేర్చుకోవడం వాళ్ల పద్ధతి. కానీ మారియప్పన్‌ అలా చేయలేదు. తంగవేలు అనే తండ్రి పేరుని కసితో వెనక్కి నెట్టాడు. తండ్రి పదిహేడేళ్ల కిందటే ఆ కుటుంబాన్ని నడివీధిలో వదిలి వెళ్లిపోయాడు కాబట్టి! వ్యవసాయ కూలీగా, ఇటుకలుమోసే కార్మికురాలిగా, రాళ్లుకొట్టే శ్రామికురాలిగా మారిన సరోజ తన రక్తంలోని ప్రతి అణువునీ చెమటగా మార్చి మారియప్పన్‌ని ఇంతటివాణ్ని చేసింది. ఆర్థిక విషయాలు అలా పక్కన పెడితే పచ్చి మంచినీళ్లూ ఇవ్వకుండా దూరం పెట్టారట ఆమెని. ఎందుకు?

ప్రస్తుతం మారియప్పన్‌ స్వస్థలం ఉన్న పెరియవడుగన్‌పట్టి గ్రామానికి దగ్గర్లోనే సరోజ వూరు కూడా. పెళ్లీడొచ్చి సంబంధాలు చూస్తున్నప్పుడు వచ్చాడతను. ఇటుకబట్టీ కార్మికుడు. అనాథనన్నాడు. నిన్నే ప్రేమించానన్నాడు. ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు. ఇద్దరూ లోకానికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పాప కడుపున పడ్డాకే చెప్పాడతను.. తనకు ఇదివరకే పెళ్లైందని. మోసం జరిగిందని గుండెలవిసేలా ఏడ్చిన ఏడుపు అతణ్ని ఏ మాత్రం కరిగించలేదు. పైగా అతని క్రౌర్యాన్ని మరింత పెంచింది! దారిలేక అతణ్ని నమ్మి ఆ వూరొచ్చిందామె. చురచుర చూపులు, ఈసడింపులూ, మొహంపైనే ఉమ్మివేతలు.. ఇవే ఆమెని ఆహ్వానించాయక్కడ. మూడేళ్ల తర్వాత మారియప్పన్‌ పుట్టాడు. రెండో భార్యకి ఆడపిల్లైతే ఫర్వాలేదు. అదే మగపిల్లాడైతే ఆస్తిపాస్తులకి వారసుడు కదా?! కార్పణ్యాలు ఆకాశాన్నంటాయి. హత్యా ప్రయత్నాలే మొదలయ్యాయి!

బడిలో తలదాచుకున్నారు.. మొదటి పాప పుట్టిన తర్వాతి నుంచే భర్తపై ఇక ఎప్పటికీ ఆధారపడకూడదని నిర్ణయించుకుంది సరోజ. రోజంతా పొలంపనులు. అవి లేకపోతే క్వారీలో రాళ్లు కొట్టడం.. ఇదే ఆమెకు తెలిసిన ప్రపంచం. ఓ రోజు సుదూర గ్రామంలో చంటి పిల్లాడితో పొలం పనులకి వెళ్లిందామె. పంటలోకి దిగి కలుపు తీస్తుండగా తల్లి పేగులు కదిలేలా చంటిపిల్లాడి ఏడుపు! వూయలకి నిప్పు పెట్టారెవరో! వీపు భాగం మొత్తం కాలిపోయింది. చుట్టూ ఉన్నవాళ్ల కాళ్లావేళ్లాపడి ఆసుపత్రికి తరలించింది. నెలల పిల్లాడికి అంతపెద్ద నిప్పుగాయమైతే.. ఇక బతకడనే అనుకుంది. కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. ‘ఆ బిడ్డతో వూరికెళితే.. ఎవరూ చేర్చుకోలేదు నన్ను. భర్తతోపాటూ నన్ను వెలివేశారు. పచ్చి మంచినీళ్లూ ఇవ్వలేదు. వేరే దారిలేక పక్క వూళ్లొని బడిలో తలదాచుకున్నాం. వాళ్లూ పొమ్మంటే ఓ బావికింద ఉండేవాళ్లం. కాలిన గాయంతో ఏడుస్తున్న చంటిపిల్లాడిని పడుకోబెట్టడానికి. నా చీర కొంగుని పరిచేదాన్ని..!’ అంటున్న ఆమెలో కన్నీటి సుడులు ఆగలేదు.

ఐదో ఏట ఆ ప్రమాదం.. క్వారీ, పొలం, ఇటుకబట్టీ.. వీటి మధ్యే పెరిగాడు మారియప్పన్‌. అమ్మ ఎక్కడుంటే అక్కడ మహా చురుగ్గా పరిగెత్తుతూ అల్లరల్లరి చేస్తూ ఉండేవాడు. ఐదేళ్లప్పుడు రోడ్డు పక్కన నడుస్తున్న ఆ పిల్లాడిని ఓ బస్సు ఢీకొంది. దాని డ్రైవర్‌ తాగిన మత్తులో ఉన్నాడట. ప్రాణమైతే పోకుండా ఆపారు కానీ కాలు నుజ్జునుజ్జుయింది. అప్పట్లోనే లక్షరూపాయలు ఖర్చుపెట్టి దానికి చికిత్స చేయించిందామె! ఆ ఖర్చుతో కాలు తీసేయకుండా ఆపినా వైకల్యం తప్పలేదు. నిజానికి ఆ అవకరమే హైజంప్‌లో తన దూకుడుకి ప్రధాన కారణమంటాడు మారియప్పన్‌. కాలుని ఆ మాత్రం కాపాడిన తల్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటాడు. మరి రోజుకూలీ లక్ష రూపాయల అప్పెలా తీరుస్తుంది. ఆమె కష్టాలు వడ్డీకేం తెలుస్తుంది! అది అలా అలా పెరిగి అసలుతో కలిసి మూడు లక్షల రూపాయలై కూర్చుంది. దానికోసమే ఇదిగో ఈ రోజుదాకా శ్రమిస్తున్నారు సరోజ.

అతను వెళ్లిపోయాడు.. మారియప్పన్‌ తర్వాత మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. అంతటితో తన కర్తవ్యం తీరిపోయిందన్నట్టు ఆ తండ్రి మొదటిభార్య దగ్గరకి వెళ్లిపోయాడు! ఆ తర్వాత ఈ పిల్లల మొహం చూడనేలేదు. ఒక ఆడపిల్ల ముగ్గురు మగపిల్లలు. కూలీ పనిచేస్తున్నా సరే అందర్నీ బాగా చదివించాలనుకుని కంకణం కట్టుకుంది సరోజ. పొలం పనులకు అంతగా డబ్బు రావడం లేదని.. క్వారీ పనులకే వెళ్లడం మొదలుపెట్టింది. ఫలానా వాడి రెండోభార్య అనే చిన్నచూపుతో ఆ వూళ్లొ తనకెవరూ ఇల్లూ ఇవ్వకపోవడంతో గుడిసె వేసుకుని బతికింది. ‘బడిలో మధ్యాహ్న భోజనం పథకంలో పెట్టే ఆహారంతోనే పిల్లల ఆకలి తీర్చేది. సాయంత్రం తప్పదు కదా! ఒక్కోరోజు కూలీ రాకున్నా.. అప్పోసప్పో చేసి మరీ మంచి భోజనం పెట్టేదాన్ని..!’ అని గుర్తు చేసుకుంటారామె.

‘ఆటలొద్దన్నాను..’ ‘నా పిల్లలందరూ పెద్ద చదువులకెళ్లాలనే ఆశ నాది. కానీ ఐదుగురి కడుపు నిండాలి కదా! మా అమ్మాయి నాతోపాటూ కూలిపనులకు రాక తప్పలేదు. మగపిల్లలు ముగ్గురూ బాగానే స్కూలుకి వెళ్లారు. పెద్దాడు మారియప్పన్‌ చదువులో చురుగ్గా ఉండేవాడు. ఓ రోజు ఎవరో వచ్చి చెప్పారు. వాడు చదువుకంటే ఆటల్లో బాగా రాణిస్తున్నాడు అని! అందుకని అటువైపు తీసుకెళ్లాలీ అని. నా కొడుకుని చదవనివ్వరేమో అని భయమేసింది. వాడు హైజంప్‌తో పక్క జిల్లాలు, బయటి రాష్ట్రాలకు వెళ్లి పతకాలు తెస్తున్నకొద్దీ నేనూ అభ్యంతరపెట్టడం మానేశా. దాంతోపాటూ శిక్షణలకంటూ బయటి రాష్ట్రాలకు వెళ్లేవాడు. ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరించేది. అలా వాడు డిగ్రీలో కూడా చేరినప్పుడు ఎంత సంతోషించానో! కూలీదాని కొడుకు డిగ్రీ సాధించడమంటే మాటలా చెప్పండి? పిల్లలు పెద్దయ్యేకొద్దీ నా రెక్కల కష్టం కూడా పెరిగింది. దాదాపు పాతికేళ్లుగా రాళ్లెత్తడం వల్ల అనుకుంటా..! నాకు గుండె నొప్పి మొదలైంది. వైద్యుల దగ్గరకెళితే అంత శ్రమ చేయకూడదని చెప్పేశారు. ‘నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో..!’ అని కుమిలి కుమిలి ఏడ్చా. అప్పుడే బెంగళూరుకి చెందిన కోచ్‌ సత్యనారాయణ వచ్చారు. రెండేళ్లు అక్కడే శిక్షణ ఇస్తానన్నారు. మాకు నెలకి పదివేల రూపాయలూ ఇస్తున్నారు. నా జీవితంలో మొదటిసారి దేవుడు కరుణించినట్టైంది.

రియోకి.. పది రూపాయలతో! ‘బెంగళూరికి శిక్షణకు వెళ్లినప్పటి నుంచే విదేశాలకీ వెళుతున్నాడు. ప్రతిసారీ దేశం దాటేటప్పుడూ నా దగ్గరకొచ్చి కాళ్లపై పడి ఆశీస్సులు తీసుకుంటాడు. కేవలం పదిరూపాయలు మాత్రం తీసుకుంటాడు. మళ్లీ వచ్చేటప్పుడు ఆ పది రూపాయలతోపాటూ పతకాన్నీ నా చేతిలో పెడతాడు. గత ఏడాది అలాగే బంగారు పతకం తెచ్చినప్పుడు.. నా కళ్లనే నమ్మలేకపోయా!! ఒలింపిక్‌కి వెళ్లేటప్పుడు అంతే. పదిరూపాయలే తీసుకెళ్లాడు మరి.. పతకంతోపాటూ రెండుకోట్ల రూపాయలు తెస్తున్నాడు!! రెండేళ్లుగా నాకొస్తున్న పదివేల రూపాయలని పొదుపుగా వాడుకుంటూ.. చిన్నపాటి అప్పులు తీర్చా. మా పాప పెళ్లిచేశాను. 500 రూపాయల అద్దెతో కాస్త పెద్ద ఇంటికి మారాం. వాడికో మంచి ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఎదురుచూస్తున్న కాలంలో.. ఇదిగో ఈ పెద్ద పతకమే వచ్చింది..!’ - అంటుంటారు సరోజ. తిట్టే నోరూ.. తిరిగేకాళ్లే కాదు.. శ్రమించే ఒళ్లూ వూరికే ఉండదేమో! కూలి పనులు మానేయమని వైద్యుడు చెప్పిన తర్వాతి నుంచి సైకిల్‌పై తిరుగుతూ కూరగాయల వ్యాపారం మొదలుపెట్టారు సరోజ. ‘కీరమా.. !’ (కూరలమ్మా) అంటూ ఆమె చేసే చప్పుడే ఆ గ్రామానికిప్పుడు మేలుకొలువు.

ఆయనేమయ్యాడు.. మారియప్పన్‌ ఈ పతకం తెచ్చుకున్నాడనే వార్త తెలిశాక.. తండ్రి తంగవేలు పదిహేడేళ్ల తర్వాత ఆ ఇంటికి వచ్చాడు! అక్కడికొస్తున్న ప్రతి టీవీ ఛానెల్‌కీ ‘నేనే అతని తండ్రి!’ అని ఇంటర్వ్యూలూ ఇస్తున్నాడు. సరోజ మాత్రం ఎప్పట్లాగే ఉదయానే కూరగాయల వ్యాపారం చేస్తూనే ఉన్నారు.. ప్రభుత్వం తమ కోసం రెండుకోట్ల రూపాయలు ప్రకటించిందని తెలిశాక కూడా!! అందుకేనేమో మారియప్పన్‌ వాళ్ల నాన్న ‘మారిన మనసుతో’ ఇస్తున్న ఇంటర్వ్యూలకన్నా సరోజ కాయగూరల సైకిల్‌ చేసే ట్రింగ్‌.. ట్రింగ్‌.. చప్పుడు ప్రపంచానికి ఘనంగా వినిపిస్తోంది!!

- జె. రాజు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్