Updated : 04/08/2021 06:25 IST

కూతుళ్ల సంరక్షణ... వంద కోట్ల వ్యాపారమైంది!

పాపాయి పుట్టినప్పటినుంచీ తన గురించే తల్లి ధ్యాసంతా! కొత్తగా అమ్మ అయిన వాళ్ల గురించైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఏ ఉత్పత్తి వాడాలన్నా నలుగురి సలహాలు తీసుకున్నాకే మొదలుపెడతారు. మల్లికా దత్‌ పరిస్థితీ అంతే! కానీ ఒక సమస్య ఆమెను వ్యాపారిగా మలిస్తే... ఆ దిశగా తన కృషి నాలుగేళ్లలోనే వంద కోట్ల టర్నోవర్‌ సాధించే సంస్థకు అధిపతిని చేసింది...

ల్లిక భర్త మోహిత్‌ ఉద్యోగ రీత్యా కొన్నాళ్లు లండన్‌లో నివసించింది. అక్కడే ఆమెకు మొదటి పాప మైరా పుట్టింది. స్నేహితుల్లో తనే మొదట అమ్మ అవడంతో పాపాయికి వాడే ఉత్పత్తుల విషయంలో సలహాలిచ్చే వారే లేరు. తనే పరిశోధించుకునేది. తర్వాత వాళ్లు మన దేశానికి వచ్చేశారు. పాపకి అక్కడి ఉత్పత్తులనే కొనసాగించింది. భర్త అడపాదడపా విదేశాలకు వెళ్లివచ్చేటపుడు తెప్పిస్తుండేది. ఆయన పర్యటనలు తగ్గడంతో ఇతరుల ద్వారా తెప్పించడం మొదలుపెట్టింది. ఇదో జంజాటంలా తోచిందామెకు. దేశీయ బ్రాండ్‌లనే ప్రయత్నిద్దాం అనుకుంది.

ఆలోచన వెనుక.. మార్కెట్‌లో బోలెడు ఉత్పాదనలు. సురక్షితమైనవని వాడితే ఆ పాపకి చర్మ సమస్యలు వచ్చాయి. వైద్యుల సలహాతో వాటిని ఆపేసింది. మళ్లీ విదేశాల నుంచి తెప్పించడం ప్రారంభించింది. తర్వాత ఆమెకు ఇంకో పాప పుట్టింది. ఆమెకు పుట్టుకతోనే ఆస్తమా. ఉత్పత్తుల్లో పరిమళాలున్నా, అలర్జీ కలిగించే పదార్థాలున్నా ఆస్తమా తిరగబెట్టేది. మరింత జాగ్రత్త అవసరమై.. సహజ పదార్థాలతో చేసిన వాటిని పరిశోధించింది. ఆ పరిజ్ఞానంతో తనే కొన్ని ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేవాలనుకుంది. ఆ ఆలోచన ఫలితమే ‘ద మామ్స్‌ కో’.

మల్లిక వాళ్ల నాన్న సైనిక అధికారి. ఆయన బదిలీల వల్ల తను దేశంలోని చాలా ప్రదేశాల్లో పెరిగింది. ఇంజినీరింగ్‌ అయ్యాక ఓ కంప్యూటర్స్‌ సంస్థలో మేనేజర్‌గా చేసింది. ఏడాది తర్వాత ఉద్యోగం నుంచి విరామం తీసుకుని ఎంబీఏ చేసి, ఐసీఐసీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేరింది. పెళ్లి తర్వాతా దాన్ని కొనసాగించింది. ప్రెగ్నెన్సీ, భర్తకు లండన్‌ వెళ్లే అవకాశం రావడంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పింది. కానీ తన కూతుళ్ల పరిస్థితి వ్యాపారం వైపు అడుగులు వేయించింది.

‘పిల్లల సంరక్షణలో రాజీ పడటం నాకిష్టం లేదు. కానీ నా పాప పరిస్థితి నన్ను చాలా భయపెట్టింది. సామాజిక మాధ్యమాల్లో చాలా మందితో మాట్లాడాక ఇది నా ఒక్కదాని సమస్యే కాదని అర్థమైంది. కొన్ని నెలల పరిశోధన, కొందరు శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చల అనంతరం పరిష్కారం దొరికింది. దీన్ని  తల్లులందరికీ అందించాలనుకున్నాను. అందుకే గర్భిణుల నుంచి అన్ని వయసుల పిల్లలకూ అత్యంత సురక్షిత బాడీ, హేర్‌ కేర్‌ ఉత్పత్తులను రూపొందించాం. మా ఇంటిల్లపాదీ వీటినే ఉపయోగిస్తాం. అసలు మొదలైందే వాళ్ల కోసం కదా! ఇది మా నాణ్యతపై మాకున్న నమ్మకానికి నిదర్శనం’ అని వివరించింది 37 ఏళ్ల మల్లిక.

ఏడాదికి మూడు రెట్లు.. ఆలోచనను పంచుకున్నప్పుడు భర్త ఆమెను ప్రోత్సహించాడు. కో ఫౌండర్‌గా చేరాడు. 2017 మార్చిలో గుడ్‌గావ్‌లో ఆన్‌లైన్‌ సంస్థగా ‘ద మామ్స్‌ కో’ ప్రారంభమైంది. దీనికోసం 4 నగరాల్లో గిడ్డంగులనూ ఏర్పాటు చేసుకుంది. రూ.15 లక్షల పెట్టుబడితో ప్రారంభిస్తే మొదటి ఏడాది రూ.2 లక్షల టర్నోవర్‌ వచ్చింది. రెండో ఏడాది నుంచే వ్యాపారం ఇంతలింతలుగా పెరుగుతూ కేవలం నాలుగేళ్లలోనే రూ.100 కోట్లకు చేరుకుంది.

ఈ నాలుగేళ్లలో మల్లిక ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలనూ అందుకుంది. ద టైమ్స్‌ షీ అన్‌లిమిటెడ్‌, కాస్మోపాలిటన్‌ బ్యూటీ, బిజినెస్‌ వరల్డ్‌ 40 అండర్‌ 40 వాటిలో కొన్ని. షీలీడ్స్‌టెక్‌, ఆంత్రప్రెన్యూర్‌ స్టార్టప్‌ సమ్మిట్‌, ఇండియా రిటైల్‌ఫోరం మొదలైన వేదికలపైనా ప్రసంగించింది. వచ్చే ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్‌ సాధించడంతోపాటు భవిష్యత్‌లో సంస్థను లిస్టెడ్‌ కంపెనీ స్థాయికి చేర్చడం తన లక్ష్యంగా చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని