ఈమెది మానసిక భరోసా

ఎవరి సాయమైనా పొందితే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంట్లో ఏదైనా శుభకార్యాలుంటే గుర్తుంచుకుని వాళ్లని పిలుస్తాం. అవునా! అయితే ఆమెకు థాంక్స్‌ మాత్రం చెప్పి శుభకార్యాలు, పెళ్లిళ్లకు రావొద్దనే వాళ్లు. దేశంలోనే మొదటి మహిళా సైకియాట్రిస్ట్‌.. డాక్టర్‌ శారదా మేనన్‌కి ఇలాంటి అనుభవాలెన్నో!

Published : 18 Oct 2021 00:58 IST

ఎవరి సాయమైనా పొందితే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంట్లో ఏదైనా శుభకార్యాలుంటే గుర్తుంచుకుని వాళ్లని పిలుస్తాం. అవునా! అయితే ఆమెకు థాంక్స్‌ మాత్రం చెప్పి శుభకార్యాలు, పెళ్లిళ్లకు రావొద్దనే వాళ్లు. దేశంలోనే మొదటి మహిళా సైకియాట్రిస్ట్‌.. డాక్టర్‌ శారదా మేనన్‌కి ఇలాంటి అనుభవాలెన్నో!

తండ్రి.. వాళ్లమ్మాయి బాగైందని ఆనందంగా వచ్చాడు. పెళ్లి పత్రికా చూపించాడు. అయితే.. ‘దయచేసి మీరు మాత్రం రావొద్దు’ అన్నాడు. నా రాక బంధువుల్లో లేనిపోని సందేహాలను తెచ్చిపెడుతుందని ఆయన భయం. ఇలాంటి సమస్య ఉన్నవారిని పిచ్చివాళ్లనో, పైత్యం ఎక్కిందనో అనేవారు మరి. అందుకే ఆయన మాటకి బాధపడలేదు. అలాంటి ఉదంతాలెన్నో. అదప్పటి పరిస్థితి. ఇప్పుడూ పూర్తిగా మారిందని చెప్పలేను. కానీ పెళ్లిళ్లకు మాత్రం పిలుస్తున్నారు’ అని నవ్వేస్తారు శారదా మేనన్‌. పుట్టింది మంగళూరు. 11 మందిలో ఎనిమిదో సంతానం. మద్రాసులో విద్యాభ్యాసమంతా సాగింది.

ఆడపిల్లలంటే ప్రాధాన్యమే లేని సమయంలో వైద్యవిద్య పూర్తి చేశారీమె. చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఓసారి మానసిక వైద్యాలయానికి వెళ్లారు. అక్కడ మంచాలకు కట్టేసి, సరైన పోషణ, వస్త్రధారణ లేక తమలో తాము నవ్వుకుంటూ ఏడుస్తున్న ఎంతోమందిని చూశారు. ఆమెకు చాలా బాధేసింది. వాళ్లు అలా కావడానికి కారణం కానీ, అందుకు పరిష్కారం కానీ అప్పటికి తెలియకపోయినా వాళ్లకి సాయమందించాలనుకున్నారు. పరిశోధిస్తే సైకియాట్రీ గురించి తెలిసింది. ‘మానసిక ఆరోగ్యం చాలా లోతైన, అంతుచిక్కని సబ్జెక్టు. అవే నాలో ఆసక్తిని పెంచాయి’ అంటారీమె. దీని కోసం లండన్‌లో ఒక షార్ట్‌టర్మ్‌ కోర్సు చేసి, ఆంధ్రప్రదేశ్‌లోని జనరల్‌ హాస్పిటల్‌లో ప్రాక్టీస్‌ చేశారు. అప్పుడే ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ పీజీ కోర్సులను ప్రవేశపెడితే చేరారు. రెండేళ్ల తర్వాత మద్రాస్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టి 1959లో దేశంలోనే మొదటి మహిళా సైకియాట్రిస్ట్‌ అయ్యారు. రెండేళ్లకే ఆ విభాగానికి అధిపతి అయ్యారు.

కళాశాల నుంచి విభాగాధిపతి అయ్యేంతవరకూ కలిసి చదివిన, పనిచేసిన మగవాళ్ల నుంచి హేళనలు, ఇబ్బందులే. కానీ.. చిన్నప్పుడే ఇంటి నుంచి ఉన్న చిన్నచూపే కాబట్టి, అవేమీ తనపై ప్రభావం చూపించలేకపోయాయి అంటారీమె. ఓసారి తన క్యాబిన్‌లో కూర్చుని ఫైల్‌ చూస్తుండగా ఓ పేషెంట్‌ వైరును ఆమె మెడకు చుట్టి చంపబోయింది. ఇంకోసారి ఎవరో వెనుక నుంచి బలంగా కొట్టారు. రెండు సందర్భాల్లోనూ మిగతా పేషెంట్లు ఆమె సాయానికొచ్చారు. ఈ సంఘటనతో వాళ్లలో వచ్చిన పురోగతి అర్థమైంది. సరిగా దృష్టిపెడితే మానసిక సమస్యలున్నవారు కోలుకునేలా చేయొచ్చనే భరోసాను తెచ్చింది. దీంతో ఇండస్ట్రియల్‌ థెరపీ సెంటర్‌ను ప్రారంభించారు. వాళ్లకి వివిధ అంశాల్లో శిక్షణనిప్పించింది. బెంగళూరులో స్కిజోఫ్రెనిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ను తెరిచారు. దీని ద్వారా మానసిక సమస్యలపై పరిశోధన, చికిత్సనే కాకుండా ప్రజలకు అవగాహనా కల్పించేవారు. దీనికి డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపూ దక్కింది. ఈ క్రమంలో పరిచయమైన పోలీస్‌ ఆఫీసర్‌నే పెళ్లి చేసుకున్నారు.

1950ల్లో ప్రారంభించిన సేవలను శారద కొనసాగిస్తున్నారు. ఆ రంగంలో కొత్తగా వచ్చే నైపుణ్యాలనూ అందిపుచ్చుకుంటున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలోనూ వీడియో కన్సల్టేషన్‌ సేవలందించారు. ఏదైనా ప్రాంతానికి వెళ్లినపుడు అక్కడి భాషను నేర్చుకుంటారు. మాతృభాషలో మాట్లాడితేనే పేషెంట్లతో త్వరగా కలిసిపోగలమన్నది ఆవిడ నమ్మకం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఆంగ్లాలను ఈమె మాట్లాడగలరు. ‘ఇకనైనా విశ్రాంతి తీసుకోవచ్చుగా’ అని చాలామంది అంటుంటారు. పనిలా భావిస్తే కదా విశ్రాంతి. ఇదో బాధ్యత. ఎవరైనా ఆసక్తి చూపినా.. సహనం, ప్రేమ, దయతోపాటు బాధ్యతలా భావిస్తేనే ఎంచుకోమని సలహా ఇస్తా. రోగులు బాగై వెళ్లిపోతుంటే కలిగే ఆనందం ఇంకెందులోనూ దొరకదు.’ అనే 98 ఏళ్ల శారద 1992లో పద్మభూషణ్‌నూ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్