close
Updated : 03/11/2021 05:58 IST

పాప కోసం చేస్తే... కోట్ల వ్యాపారమైంది!

ఎంబీఏ చేసిన ఆమెకు వ్యాపారమే లక్ష్యం. అనుకోకుండా తన పాప కోసం చేసిన ప్రయత్నం ఆ కలను తీర్చుకునే అవకాశం కల్పించింది. రూ.యాభై వేలు పెట్టుబడితో ప్రారంభించి, అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్లింది. ఇప్పుడది కోట్ల టర్నోవర్‌ వ్యాపారమైంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చంద్రలేఖ వ్యాపార ప్రస్థానం.. తన మాటల్లోనే..!

మాది పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, తర్వాత ఎంబీఏ చదివా. బెంగళూరులో కొన్నాళ్లపాటు ఉద్యోగమూ చేశా. మావారు వంశీది రాజమహేంద్రవరం. ఆయన ఉద్యోగరీత్యా బెల్జియం వెళ్లాల్సి వచ్చింది. దీంతో పెళ్లికి ముందే ఉద్యోగం మానేశా. కొన్నాళ్లకి తిరిగొచ్చాక ప్రసవం, పాపతో బిజీ అయ్యా. తిరిగి ఉద్యోగం చేద్దామనుకున్నా.. నా లక్ష్యం మొదట్నుంచీ ఉద్యోగం కాదు, వ్యాపారమే. పరిశోధనా చేశా కానీ, ఏదీ ఆకట్టుకోలేదు. ఇంతలో పాప మొదటి పుట్టినరోజు వచ్చింది. తన కోసం సొంతంగా నేనే డ్రెస్‌ డిజైన్‌ చేశా. చూసిన వాళ్లంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. కొందరు తమకీ చేసివ్వమన్నారు. దీన్నే వ్యాపారంగా చేస్తే అన్న ఆలోచన వచ్చింది. పైగా నాకు డిజైనింగ్‌పై ఆసక్తీ ఎక్కువే. కొంత పరిశోధన చేశా. బొటిక్‌లు ఎన్నో ఉన్నా.. పిల్లలకు ముఖ్యంగా మగపిల్లలకు ప్రత్యేకంగా ఏవీ లేవు. కాబట్టి ప్రయత్నిస్తే బాగుంటుందని అనిపించింది. 2013లో ‘యాహ్వి’ పేరిట అమ్మకాలు ప్రారంభించా. నేరుగా పెద్ద ఎత్తున బొటిక్‌ లేదా షాప్‌ పెట్టేయడం ఇష్టం లేదు. అందుకే ఫేస్‌బుక్‌ను వ్యాపార వేదికగా చేసుకున్నా. నేను ఎంబీఏ.. మార్కెటింగ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో చేశా. ఆ పరిజ్ఞానాన్నే ఇక్కడ ఉపయోగించా. అలా యాభై వేల రూపాయలతో ఇంటి దగ్గర్నుంచే వ్యాపారాన్ని ప్రారంభించా. ముందుగానే పెద్ద ఎత్తున చేసేసి అమ్మడం నా కాన్సెప్ట్‌ కాదు. డిజైన్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఉంచేదాన్ని అడిగినవాళ్లకి కోరిన సైజ్‌ల్లో చేసిచ్చేదాన్ని. అన్నట్టూ ఎంబీఏలో నా రెండో మేజర్‌ ఫైనాన్స్‌. మొదట్నుంచీ నష్టం రాకుండా చూసుకోవాలి, బయటి నుంచి మళ్లీ మళ్లీ డబ్బు తెచ్చిపెట్టొద్దని బలంగా భావించా. సగటు మధ్యతరగతి అమ్మాయిని మరి! ఆమాత్రం జాగ్రత్త ఉంటుందిగా!

అలాగే.. అమ్మేవి ఏవైనా ప్రత్యేకంగా ఉండాలి, ఎక్కడైనా దొరుకుతాయనిపించేలా ఉండొద్దనుకున్నా. అందుకే డిజైనింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టేదాన్ని. తాజా ట్రెండ్స్‌, మార్కెట్‌తోపాటు కొన్నేళ్లపాటు పనికొచ్చేలా ఉండేలా చూసుకునేదాన్ని. కొద్దికాలంలోనే మంచి ఫలితాలొచ్చాయి. ఉదాహరణకు ఇప్పుడు ఆదరణ ఉన్న రఫుల్‌ ఫ్రాక్‌లను మేం పరిచయం చేసేనాటికి ఇక్కడ మహా అయితే ఇద్దరో, ముగ్గురో డిజైనర్లు వాటిపై పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన మెటీరియల్‌నీ చైనా నుంచి తెప్పించేదాన్ని. ఇప్పుడు ఇవి సాధారణమయ్యాయి. అంత ముందుగా ప్లాన్‌ చేయగలిగితేనే మార్కెట్‌లో నిలదొక్కుకోగలం. ఇందుకు లోతైన అవగాహనా ఉండాలి. అందుకే వ్యాపారం ప్రారంభించిన రెండేళ్ల తర్వాత నిఫ్ట్‌ హైదరాబాద్‌ నుంచి బొటిక్‌ మేనేజ్‌మెంట్‌ చేశా. తర్వాత హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బొటిక్‌నీ ప్రారంభించా. నాలుగేళ్ల క్రితం చంద్ర అండ్‌ వాసు పేరిట మరో ఫ్యాషన్‌ లైన్‌ ప్రారంభించాం. ఇప్పుడు సందర్భమేదైనా వధువరుల మ్యాచింగ్‌ ఫ్యాషన్‌ అయ్యింది. దీన్ని ముందుగా ఊహించి పెట్టిందే ఇది. దీన్ని మొదలుపెట్టాక కలెక్షన్‌ కింద ఫొటోషూట్‌ రిలీజ్‌ చేశాం. అప్పుడు హీరోయిన్ల స్టైలిష్‌ల నుంచి కాల్స్‌ మొదలయ్యాయి. మొదట లావణ్య త్రిపాఠి తర్వాత అనుపమా పరమేశ్వరన్‌, యాంకర్‌ రష్మి, సీరియల్‌ ఆర్టిస్టులు.. ఎంతోమందికి డ్రెస్‌లు డిజైన్‌ చేశాం. సీఎంఆర్‌ లాంటి ఎన్నో సంస్థలతోనూ కలిసి పనిచేశా. ఇప్పటికీ ఆన్‌లైన్‌లోనే వ్యాపారం కొనసాగిస్తున్నా. విదేశాలకీ పంపుతుంటాం. నా దగ్గర ఇప్పుడు సుమారు 50 మంది వరకూ పనిచేస్తున్నారు. ఏటా టర్నోవర్‌ 4 కోట్ల వరకూ ఉంటుంది. ఒకప్పుడు అమీర్‌పేట లాంటి చోట్ల బోర్డింగ్‌ చూసి.. నా డిజైన్లనూ అలా చూసుకోవాలనుకునేదాన్ని. ఇప్పుడు తారలు నా డిజైన్లను ధరించిన ఫొటోలను చూస్తోంటే ఆ కల నెరవేరినట్లు అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

- కురెళ్ల శ్రీనివాస్‌, మొగల్తూరు


Advertisement

మరిన్ని