Updated : 28/12/2021 05:33 IST

సాయంలో.. అసామాన్యులు!

కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న దశలో 2021 ప్రారంభమైంది. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతోంటే.. కొందరు మాత్రం కొవిడ్‌పై పోరుకు సిద్ధమయ్యారు... ఆ దిశగా సృజనకు, మేథకు పనిచెప్పి ఆవిష్కరణలు చేశారు. రోగులు, వైద్య సిబ్బందికి తోడ్పడ్డారు. వారిలో కొందరు వీళ్లు..

కొవిడ్‌ సోకిన వారికి సేవలందిస్తూ డాక్టర్లు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడటమేకాక ప్రాణాలూ కోల్పోయారు. వారికి సాయపడేలా రోబో రూపొందించింది పట్నాకు చెందిన ఆకాంక్ష కుమారి. ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ చదువుతోన్న ఈమె తయారు చేసిన మెడి-రోబో.. రోగి రియల్‌టైమ్‌ డేటాను డాక్టర్లకు చేరుస్తుంది. మందుల సరఫరా, ఆహారం, నీటిని అందించడం, ఆక్సిజన్‌ అమర్చడం వంటివీ చేస్తుంది. దీనిలోని రాత్రిళ్లూ పని చేయగల 360 డిగ్రీల హై రిజల్యూషన్‌ కెమెరాతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులు, రోగులతో మాట్లాడొచ్చు. ఆక్సిజన్‌ స్థాయులు, బీపీ, శరీర ఉష్ణోగ్రత, చక్కెర స్థాయులు, గుండె, ఊపిరిత్తుల పనితీరునూ పరిశీలించగలుగుతారు. ఈ ఆవిష్కరణకుగానూ ఆకాంక్ష ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ, విద్యా మంత్రిత్వ శాఖ నుంచి విశ్వకర్మ అవార్డునూ పొందింది.


ఇన్‌స్టా మాస్క్‌.. చెన్నైకి చెందిన కృష్ణ ప్రియదర్శినికి సామాన్యులకు ఏదైనా చేయాలనే తపన. కరోనాపై పోరులో మాస్కుల అవసరాన్ని గుర్తించిందీ ఇంజినీర్‌. ‘ఇన్‌స్టా మాస్క్‌’ వెండింగ్‌ మెషిన్‌ను రూపొందించింది. దీనిలో రూ.5 నాణెం వేస్తే మాస్క్‌ వచ్చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు, ఆసుపత్రులు వీటిని వినియోగించుకుంటున్నాయి.


చాట్‌బోట్‌తో సాయం.. అలీషా లోబో.. సింగపూర్‌కు చెందిన సంస్థలో రిక్రూటర్‌. కొవిడ్‌ సమయంలో దేశానికి తిరిగొచ్చింది. అప్పుడు కొవిడ్‌ సోకిన తన కజిన్‌కు ఆసుపత్రిలో బెడ్‌ కోసం సామాజిక మాధ్యమాల్లో వెతికింది. అవాస్తవాలే ఎక్కువ కనిపించాయి. ఎవరో సాయం చేస్తే తన కజిన్‌ ఆసుపత్రిలో చేరి, కోలుకోగలిగింది. కానీ పెద్దగా సౌకర్యాలు లేనివారి పరిస్థితేంటని ఆలోచించింది. టెక్నాలజీతో ఎక్కువమందిని చేరొచ్చనుకుంది. స్నేహితులతో కలిసి ‘కొవిడ్‌ ఆశా’ చాట్‌బోట్‌ను రూపొందించింది. మెడికల్‌ స్టార్టప్‌లతో ఒప్పందం చేసుకుని ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌, సిలిండర్ల లభ్యత, అంబులెన్సులు, పడకలు.. తదితర సమాచారం అందించేది. దీన్ని గ్రామీణుల కోసం 8 భాషల్లోనూ అందుబాటులో ఉంచింది.


రెండో వేవ్‌లో ఒత్తిడిలో ఉన్నవాళ్ల కోసం ‘మెంటల్‌ వెల్‌నెస్‌’ చాట్‌బోట్‌ను చేసింది హర్షిణి రాజి. ఈమె ఎదుర్కొన్న ఇబ్బందులు తన మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపాయి. కొవిడ్‌ కారణంగా తనలా ఎంతోమంది ఈ సమస్యను ఎదుర్కోవడం చూసి ఫేస్‌బుక్‌లో ‘మెంటల్‌ వెల్‌నెస్‌’ చాట్‌బోట్‌ను రూపొందించిందీ చెన్నై అమ్మాయి. దీని కోసం సైకాలజీ కోర్సులనూ చేసింది. మానసిక సమస్యలు ఉన్న వారు దీని సాయంతో మెడిటేషన్‌, ఇతర చిట్కాలను పొందవచ్చు. ఈ బోట్‌ లక్షల మందికి సాయం చేసింది.


స్కానర్‌ సాయం..

కొవిడ్‌ సమయంలో పీపీఈ కిట్‌లు పక్కదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ధరా ఎక్కువ, పైగా ఒకసారే వాడాలి. దీనికి పరిష్కారంగా రోమితా ఘోష్‌ ‘రోర్‌ స్టెరిలైజర్‌’ను కనుక్కొంది. ముంబయికి చెందిన ఈమె అడ్మైరస్‌, ఐహీల్‌ అనే హెల్త్‌ టెక్‌ సంస్థలను స్థాపించింది. ఇవి కొత్తటెక్నాలజీలను తక్కువ ఖర్చుతో దేశీ మార్కెట్‌కు అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే యూవీ కిరణాలను ఉపయోగించి పీపీఈ కిట్‌లను శుభ్రం చేసే రోర్‌ స్టెరిలైజర్‌ను కనుక్కొంది. అలా బయోవేస్ట్‌ను తగ్గేలా చూడటమే కాకుండా కేంద్రప్రభుత్వం నుంచి శ్రీ శక్తి ఛాలెంజ్‌ పోటీల్లో బహుమతినీ గెల్చుకుంది.


ఈ ఆపద వేళ దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు అంబులెన్స్‌ డ్రైవర్లు అయ్యారు. శ్మశానవాటికల్లో సహాయకులుగా స్వచ్ఛందంగా అంత్యక్రియలు చేశారు. వీళ్లంతా సామాన్యులే.. వీళ్లలో అసలు చదువురాని వాళ్లు.. అప్పుడే ఇంకా కళాశాల విద్య దాటని వాళ్లే ఎక్కువ. అయినా ఎంతోమందికి అండగా నిలిచారు.. అందరితో శభాష్‌ అనిపించుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని