Published : 04/01/2022 20:59 IST

300 మందికి ఇంధనమై...

ఆదివారం ఎప్పుడొస్తుందా... అని వాళ్లంతా ఆతృతగా ఎదురు చూసేది సరదాలు, సంతోషాలని పంచుకోవడం కోసం కాదు. విందులు, వినోదాల కోసం అంతకన్నా కాదు. పేదల ఆకలి తీర్చి, వాళ్ల కష్టసుఖాలని తెలుసుకోవడమే ఆ 300మంది స్కై ఫౌండేషన్‌ కార్యకర్తల లక్ష్యం. వారిని ముందుండి నడిపిస్తోంది పావని... 

ఆకలితో అల్లాడే అభాగ్యులు, యాచకులు, మతిస్థిమితంలేని వాళ్లు... ఎదురయినప్పుడు ఎంతో కొంత చిల్లర చేతిలో పెట్టి ఊరుకుంటాం. చాలా సందర్భాల్లో అంతకు మించి వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించం. కానీ పావని బృందం మాత్రం ఒక అడుగు ముందుకేసి నెలకి రెండుసార్లయినా పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలని అనుకున్నారు. 2012లో నలుగురితో మొదలయిన సంకల్పం ఇది. ఓ ఆదివారం ఇంట్లోనే ఓ పదిమందికి సరిపడా అన్నం, కూరలు వండి దాన్ని పొట్లాలుగా కటి రోడ్డు వారన ఆకలితో అలమటిస్తున్నవారికి పంచారు. ఆ అన్నం పొట్లాన్ని అందుకుని ఆవురావురు మంటూ తిన్నప్పుడు వాళ్ల కళ్లలో కనిపించిన కృతజ్ఞతాభావం, కన్నీటిచెమ్మతో పాటు ‘చల్లంగుండుండ్రీ బిడ్డా!’ అన్న మాటలు ఆ చిన్న బృందానికి గొప్ప ఇంధనంలా పనిచేసి ముందుకు నడిపించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అడ్డగుట్టకు చెందిన ఐటీ ఉద్యోగిని పావనిని ఈ మాటలు బాగా కదిలించాయి. దాంతో తను ఈ కార్యకలాపాల్లో మరింతగా మమేకమైంది. బాధ్యతల నిర్వహణతో పాటు ఆమె అందిస్తోన్న ఆర్థిక సహకారం ఇప్పుడు వందల మంది పేదల ఆకలి తీర్చడానికి కారణమవుతోంది. తన నెలజీతంలో నలభైశాతం స్కై ఫౌండేషన్‌ కోసమే కేటాయిస్తోంది పావని. అలాగని ఆమె ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చిందేమో అనుకుంటే పొరపాటు. చిన్నప్పట్నుంచీ ఎన్నో ఆర్థిక సమస్యల నడుమే పెరిగింది. తండ్రి కుటుంబానికి దూరం కావడంతో తల్లే కుటుంబాన్ని నడిపింది. ఆమె కూడా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు... సీటు వచ్చినా స్తోమతలేని కారణంగా వైద్యవిద్య చదవలేకపోయిన పరిస్థితి పావనిది. ఆ ఇబ్బందుల మధ్యే ఎంఫార్మసీ చదివి ఐటీ ఉద్యోగాన్ని సాధించింది. కష్టం విలువ తెలుసు కాబట్టే ఫౌండేషన్‌ సాయంతో ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలనుకున్నా అంటోంది పావని.

ఆకలితీర్చి... కష్టాలు తెలుసుకుని..

పేదల ఆకలి తీర్చడం మాత్రమే కాదు, సరైన దుస్తులు కూడా లేకుండా రోడ్లపై ఆగచాట్లు పడేవారికోసం మంచి దుస్తులను సేకరించి ఇవ్వడం, అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య పరీక్షలు చేయించి మందులు అందించడం ఈ సంస్థ లక్ష్యాల్లో కొన్ని. నలుగురితో ప్రారంభమైన ఈ ఫౌండేషన్‌లో ప్రస్తుతం 300మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు ఉన్నారు. వీరంతా వ్యక్తిగత పనుల్ని పక్కన పెట్టి తమవంతుగా సేవ కోసం సమయం కేటాయిస్తారు. వీళ్లలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు, విద్యార్థులు ఉన్నారు. కొంతమంది అన్నం, కూరలు వండి, పొట్లాలుగా కట్టి ఓ వ్యానులో వేసుకుని బయలుదేరుతారు. తక్కినవారు ఆ ఆహార పొట్లాలను పంచుతారు. ఆకలితో అలమటిస్తున్న వారు కనిపించగానే వారికి అందజేస్తారు. ఇలా నెలలోని రెండు, నాలుగో ఆదివారాల్లో చేస్తారు. సుమారు ఐదువందలకి ఇలా పంపిణీ చేస్తారు. మొదటి, మూడో ఆదివారాల్లో సేకరించిన పాతబట్టలతోపాటు బిస్కెట్లు, పండ్లు, వాటర్‌ప్యాకెట్లను పంచిపెడతారు. ఎవరైనా జబ్బులతో బాధపడుతున్నారని తెలిస్తే వైద్యుల సలహాతో అవసరమైన మందులు తీసుకెళ్లి ఇస్తారు. ఇక ఎండాకాలంలో రోజంతా ఎండలో నిలువుకాళ్ల ఉద్యోగం చేసే ట్రాఫిక్‌ పోలీసులకి మజ్జిగ, అంబలి, పండ్లు, వాటర్‌ ప్యాకెట్లు ఇవ్వడం ఓ అలవాటుగా పెట్టుకున్నాం అంటున్న పావని బృందంలో  45 మంది అమ్మాయిలున్నారు. 

కరోనా టీకాలు వేయించి...

‘కరోనా కష్టకాలం రెండేళ్లు ఎంత దారుణంగా గడిచిందో మనందరికీ తెలుసు. ఆ సమయంలో ఫౌండేషన్‌ తరుపున మా సేవలను విస్తృతం చేశాం. అన్నదానాలు, అల్పాహారాలు, పండ్లు, బిస్కట్ల్లు అందించి ఎంతోమంది ఆకలితీర్చాం. పారిశుద్ధ్య కార్మికులకూ అండగా నిలిచాం. మనమైతే టీకాలు వేయించుకుంటాం. కానీ ఏ చిరునామా లేని రోడ్డువారన ఉండే అభాగ్యులకు ఎవరు వేస్తారు. అలాంటి ఎంతో మందికి టీకాలు వేయించాం. ప్రభుత్వం సహకరిస్తే ఆనాథాశ్రమాన్ని ఏర్పాటుచేసి ఇలాంటి వారందరిని అందులో ఉంచి మంచిభోజనం, మెరుగైన వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం’ అంటున్నారు పావని.

- బోయినభాస్కర్‌, హైదరాబాద్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని