పట్టుగూళ్లతో... వన్నెలద్దుతోంది!

వృథాగా మారే పట్టుపురుగు గూడును అందమైన ఆభరణంగా ఈమె మార్చేయగలదు. వాటితో వందల ఏళ్ల క్రితం రాజ వంశీకులు ధరించిన నగలను సృష్టించి చూపించగలదు. ఒకప్పుడు కుటుంబపోషణ కోసం కూరగాయలు అమ్మిన ఆవిడ...

Updated : 05 Jan 2022 04:26 IST

వృథాగా మారే పట్టుపురుగు గూడును అందమైన ఆభరణంగా ఈమె మార్చేయగలదు. వాటితో వందల ఏళ్ల క్రితం రాజ వంశీకులు ధరించిన నగలను సృష్టించి చూపించగలదు. ఒకప్పుడు కుటుంబపోషణ కోసం కూరగాయలు అమ్మిన ఆవిడ తన వైవిధ్య ఆలోచన, సృజనాత్మకతలతో ఆభరణాల డిజైన్‌లో నూతన ఒరవడిని తెచ్చింది. అతి తక్కువ పెట్టుబడితో ఈ రంగంలోకి అడుగుపెట్టి... ఓ కొత్త బ్రాండ్‌కు అధిపతిగా ఎదిగిన మణిపుర్‌కు చెందిన శ్రీమయుం గీతాదేవి స్ఫూర్తి కథనమిది.

ఖురైతొంగం లీకెయ్‌ గ్రామంలో నివసించే గీతాదేవి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. ఇద్దరు పిల్లల పోషణ ఈమెదే కావడంతో ఇంటింటికీ తిరిగి కూరగాయలు విక్రయించేది. పేద మహిళలకు ఉపాధిని కల్పించేలా ఓ సామాజిక సేవాసంస్థ పట్టు పురుగుల పెంపకం, పట్టు ఉత్పత్తిపై ఇచ్చే శిక్షణ తరగతుల్లో చేరింది గీతాదేవి. అక్కడే పట్టు గూళ్లతో ఆభరణాల తయారీనీ.. నేర్చుకుంది. వీటితో చేసే నగల డిజైన్‌పై ఆసక్తి పెంచుకున్న ఈమె సాధనతో నైపుణ్యాన్ని పెంచుకుంది. క్రమేపీ చిన్నచిన్న నగలను తయారుచేయడం మొదలుపెట్టింది.

ప్రత్యేకంగా... మణిపురిలో వందల ఏళ్లనాటి సంప్రదాయ నగలు, అప్పటి రాజవంశీయుల ఆభరణాల డిజైన్లను స్ఫూర్తిగా తీసుకున్న గీతాదేవి అందులో చాలా ప్రయోగాలు చేపట్టింది. ఈ హస్తకళలో తనకంటూ ఓ ప్రత్యేకతనూ సాధించింది. ‘లీమా లిక్లాంగ్‌ నయీన్‌’ పేరుతో సంస్థను స్థాపించింది. నెక్లెస్‌, చెవి లోలకులు, మాలలు, ఇంటి అలంకరణ ఉత్పత్తులు వంటివన్నీ పట్టు గూళ్లతో తయారుచేయడంలో తన సృజనాత్మకతను ప్రదర్శించింది. చిన్నచిన్న ప్రదర్శనలలో వీటిని ఉంచేది. అలా మొదట స్థానికులకు గీతాదేవి తయారుచేసే ఆభరణాలపై ఆసక్తి మొదలైంది. క్రమేపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆభరణాలు విక్రయించే స్థాయికి ఎదిగిందీమె.

అలనాటి డిజైన్లు..  మొదట రూ.3వేలతో నగల తయారీని ప్రారంభించా అంటుంది గీతాదేవి. ఏడాది తర్వాత  నాలో ఆలోచనను మెచ్చిన ప్రభుత్వం రూ.3 లక్షల రుణం అందించింది. ఇది నాకెంతో తోడ్పడింది. నేను డిజైన్‌ చేస్తున్న నగలకు ఇప్పుడు మంచి పేరుంది. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు వస్తున్నాయి. వీటికి గత చరిత్ర ఉంది. మహారాణులు వారికోసం పట్టు చీరలను నేయించుకునేటప్పుడు పట్టుపరిశ్రమ ప్రత్యేకంగా ఉండేది. అక్కడ పటు గూడుతో నగలను డిజైన్‌ చేయించుకొని  పండుగలకు, ప్రత్యేక కార్యక్రమాలకు ధరించేవారు. ఆ సంప్రదాయాన్ని అధ్యయనం చేసి వాటిని పోలినట్లే ప్రస్తుతం నేను డిజైన్‌ చేస్తున్నా. రాణుల కాలం తర్వాత క్రమేపీ ఈ తరహా నగలు తగ్గాయి. మేం ఈ గూళ్లను ముందుగా కూరగాయలతో తయారుచేసే రంగుల్లో ముంచి ఉడికించి తర్వాత కావల్సిన డిజైన్‌గా కత్తిరిస్తాం. వీటికి రంగు రంగుల రాళ్లు, పూసలు, ముత్యాలు వంటివి జత చేసి ఆభరణంగా మారుస్తాం. ఒక నగ తయారీకి దాదాపు నాలుగు గంటలకుపైగా పడుతుంది. ఖర్చులు పోగా నెలకు రూ.50 వేలు ఆదాయాన్ని పొందుతున్నా. స్థానికంగా గృహిణిలకు ఉచితంగా శిక్షణ అందించి స్వయం ఉపాధి కల్పిస్తున్నా’ అని చెబుతున్న 62 ఏళ్ల గీతాదేవి ప్రభుత్వ విభాగాలు, సామాజిక సేవాసంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా క్రాఫ్ట్‌ బజారులలో ఈ ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతోంది. ఈమె కృషికి ‘స్టేట్‌ క్రాఫ్ట్స్‌ పర్సన్‌’ అవార్డు సహా పలు పురస్కారాలు దక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్