Published : 11/01/2022 06:36 IST

స్వచ్ఛమైన తేనె..సరికొత్త తోవ చూపింది!

మన ఊళ్లలో తేనెతుట్టెల నుంచి తేనె తీయడం చూసే ఉంటారు. చాలా సందర్భాల్లో శుచీ, శుభ్రత కొరవడతాయి. దానివల్ల స్వచ్ఛతలోనూ తేడా వస్తుంది.  పైగా పెద్ద సంఖ్యలో తేనెటీగలూ చనిపోతాయి. ఈ పరిస్థితుల్లో మనం కొంటున్న తేనె ఎంత స్వచ్ఛమో తెలియదు. ఇవన్నీ ఎందుకు? మనమే నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తే... అనుకుందామె. అందుకోసం ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టింది జూకూరి అనూష. అక్కడి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

మాది మిర్యాలగూడ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. చెన్నైలో బీఫార్మసీ చదివాక.. వివాహం కావడం.. మా వారు సుమన్‌తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాను. మెల్‌బోర్న్‌లోని సెంట్రల్‌ క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ఫైనాన్స్‌ చేశాను. ఏడాది తర్వాత అమెరికా వెళ్లాం. అక్కడే నాకు ఇన్ఫోసిస్‌లో బ్యాంకు ఆధారిత సేవల విభాగంలో ఉద్యోగం వచ్చింది. 2019లో మేం అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఉద్యోగం కొనసాగించాను. గతేడాది మార్చిలో ఉద్యోగాన్ని మానేశా. మా ఇంట్లో తేనె వాడకం ఎక్కువ. కానీ ఎక్కడా స్వచ్ఛమైన తేనె లభించేది కాదు. ఇక తప్పక అందుబాటులో ఉన్నదాంతోనే సర్దుకుపోయే వాళ్లం.

అలా మొదలైంది... గతేడాది మార్చిలో మా సొంతూరికి వెళ్లినప్పుడు తేనె తీయడం చూశాను. అది చూశాక.. దాన్ని ముట్టుకోవాలని అనిపించలేదు. అప్పుడే అసలు స్వచ్ఛమైన తేనె ఎలా పొందగలం.. ఏం చేయొచ్చు అనే విషయంపై పరిశోధన చేశా. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లోనూ శిక్షణ తీసుకున్నా. అలా బాక్సుల్లో తేనెటీగల పెంపకం మీద అవగాహన వచ్చింది. ముందుగా అనుభవం కోసం 5 బాక్సులతో తేనెటీగల పెంపకం ప్రారంభించాను. నమ్మకం వచ్చాక 50 బాక్సులకు పెంచాను. తెనేటీగల పెంపకం చాలా కష్టం, సరైన అవగాహన, ఆసక్తి ఉంటేనే ముందుకు సాగాలి. ముందుగా ఎక్కడెక్కడ పుష్పించే జాతుల పంటలు వేస్తున్నారు.. ఎలాంటి మొక్కలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో వివరాలు తెలిసి ఉండాలి. లేకపోతే తేనెటీగలకు ఇబ్బంది. అలా తెలంగాణ వ్యాప్తంగా ఏయే నెలల్లో ఎక్కడెక్కడ పుష్పించే మొక్కలు, పంటలు అందుబాటులో ఉంటాయో అధ్యయనం చేశా. బాక్సులను ఆయా కాలాల్లో ఆ ప్రాంతాలకు తరలిస్తుంటా. ప్రస్తుతం 700 బాక్సులతో తేనెటీగల్ని పెంచుతున్నా. రంగారెడ్డి జిల్లాలోని అడవులు, వికారాబాద్‌, నిజామాబాద్‌, ఆర్మూర్‌ వంటి ప్రాంతాలకు బాక్సులను తిప్పుతుంటాం.

ఉత్పత్తులు కూడా... కరోనా వల్ల రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు తేనె వాడకం బాగా పెరిగింది. ఆయుర్వేద మందుల తయారీలోనూ స్వచ్ఛమైన తేనె అవసరం. అందుకే స్వచ్ఛమైన తేనె, దాని ఆధారిత ఉత్పత్తులను అందించాలనే ‘బీ ఫ్రెష్‌’ను ప్రారంభించాం. శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల ప్రాణాలకు ముప్పు లేకుండా స్వచ్ఛమైన తేనె తీసి అందించగలుగుతున్నాం. మా తేనెలో ఆయుర్వేద గుణాలు కూడా ఎక్కువ. ఎందుకంటే వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు మొక్కలు ఉంటాయి. మేం అక్కడ బాక్సులు పెడతాం కాబట్టి, అక్కడి పువ్వుల మకరందాన్ని ఈగలు తీసుకుంటాయి. కనుక ఆయా మొక్కల్లోని ఆయుర్వేద గుణాలు తేనెలో కలుస్తున్నాయి.

తేనె, దాని ఉత్పత్తుల విక్రయాల కోసం ఎల్‌ఆర్‌ నేచురల్‌ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించా. ప్రస్తుతం నెలకు 3 టన్నుల తేనె ఉత్పత్తి అవుతోంది. దీని ఆధారంగా రసాయనరహిత సబ్బులు, లిప్‌బామ్స్‌, బీస్వాట్స్‌ కూడా తయారు చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబయి, చెన్నై, పుణె నగరాలకు మా ఉత్పాదనలను సరఫరా చేస్తున్నాం. ఈ వ్యాపారంలోకి వస్తానన్నప్పుడు మా వాళ్లు ఇష్టపడలేదు. నా భర్త ఒక్కరే ప్రోత్సహించారు. అయితే నా ఆలోచనలు, వ్యాపార ప్రణాళికలు వివరించాక అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఉద్యోగంలో నెలకు రూ.1.30 లక్షలు వేతనం వచ్చేది. ఇప్పుడు నెలకు రూ.15 లక్షల టర్నోవర్‌ సాధిస్తున్నా. బాక్సుల సంఖ్య మరింత పెంచి.. మరిన్ని ఉత్పత్తులు తీసుకువచ్చి ప్రత్యేక స్టోర్లు ప్రారంభించాలని అనుకుంటున్నా. నా పరిజ్ఞానం ఎక్కువ మందికి అందాలని జాతీయ తేనెటీగల బోర్డు, కృషి విజ్ఞాన కేంద్రాల తరపున రైతులకు శిక్షణ ఇస్తున్నాను. రైతులకు పాలినేషన్‌ కోసం ఉచితంగా బాక్సులూ అందిస్తున్నాను. కొత్తదారిలో వెళ్లాలనుకున్నప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. మనమీద మనకు నమ్మకం ఉంటే వాటిని అధిగమించడం పెద్ద సమస్య కాదు.

- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాదు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని