Updated : 30/01/2022 06:18 IST

క్యాన్సర్‌ చిన్నారుల జీవితాల్లో.. వెలుగులు నింపుతోంది!

హాయిగా సాగుతున్న జీవితం ఆమెది. అనుకోకుండా కూతురికి అనారోగ్యం. వెంటనే ఆసుపత్రిలో చేర్చాలన్నారు. కాస్త కలిగిన కుటుంబమే కాబట్టి వెంటనే సిద్ధమయ్యారు. పక్కనే ఇంకో చిన్నారిదీ విషమ పరిస్థితి. శస్త్రచికిత్స చేయించాలి. కానీ ఆ స్థోమత లేదా తల్లిదండ్రులకి. ఈమె సాయంతో ఆ కుర్రాడు బతికాడు. ఇంకా అలాంటి వాళ్లెందరో ఉన్నారని తెలిసిందామెకు. మరి వాళ్ల పరిస్థితేంటి? సప్నా ఉపాధ్యాయ్‌కి ఎదురైన ఈ ప్రశ్న ఇరవై వేలకుపైగా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది.

సప్నా ఉపాధ్యాయ్‌ది లఖ్‌నవూ. పెళ్లయ్యాక గృహిణిగా మారింది. పాప స్కూలుకి వెళుతోంటే తనూ చదువు కొనసాగించాలనుకుంది. ఇంట్లోవాళ్లూ ప్రోత్సహించారు. అంతా సజావుగా సాగిపోతోందనుకుంటే.. అకస్మాత్తుగా పాపకి ఆస్తమా. అదీ తీవ్రదశలో. దీనికితోడు తీవ్రమైన జ్వరం. వెంటనే అత్యవసర విభాగంలో చేర్చాలన్నారు వైద్యులు. చేర్చి బయట వేచి చూస్తోన్న వాళ్లకి పక్కనే ఓ తల్లి తన బిడ్డతో కూర్చొనుంది. బాబుకి న్యుమోనియా. శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. డబ్బుల్లేక కంగారుపడున్న ఆ తల్లిని చూసి సప్నాకి జాలేసింది. భర్తనడిగి శస్త్రచికిత్సతోపాటు మందులకు అవసరమైన డబ్బును అందించింది. కోలుకున్న ఆ బాబుని చూసి ఆమె చాలా సంతోషించింది. తీవ్రంగా జబ్బుపడి, సరైన ఆహారం, మందులు దొరకని చిన్నారులను చూసింది. వారికి ఆరోగ్యకరమైన ఆహారం, మందులు, దుస్తులు పంచడం మొదలుపెట్టింది. చేస్తూ పోయేకొద్దీ సాయం అవసరమైన పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పెద్ద జబ్బుల బారిన పడినవారికి దీర్ఘకాల సాయం అవసరమవుతుంది. కేవలం భర్త సంపాదనతో ఇదంతా అసాధ్యమని అర్థమైంది. దీంతో పరిశోధన విద్య పక్కన పెట్టి, 2005లో ఈశ్వర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ను స్థాపించింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)తో కలిసి పని చేయడం మొదలుపెట్టింది. మిగతావారితో పోలిస్తే క్యాన్సర్‌ వచ్చిన వాళ్లు ఎక్కువ ఇబ్బంది పడుతుండటం, ఒక్కోసారి మరణిస్తుండటమూ చూసి వారికోసమే పనిచేయడం మొదలుపెట్టింది. లఖ్‌నవూలోని రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు మూడుపూటలా పౌష్టికాహారం, నెలకు సరిపడా మందులు, దుస్తులు, ఇతర సామగ్రిని అందిస్తోంది. దాతల సాయమూ తీసుకుంటోంది.

క్యాన్సర్‌ నుంచి కోరుకున్నవాళ్లకి విద్య, రిహబిలిటేషన్‌, ఉపాధి అవకాశాల్నీ చూపిస్తోంది. తన ఎన్‌జీవో ద్వారా క్రాఫ్ట్స్‌, సంప్రదాయ నగల తయారీని చేయిస్తోంది. తద్వారా క్యాన్సర్‌ బాధితుల కుటుంబానికి ఉపాధి కల్పిస్తోంది. కొవిడ్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ఆహారం, సుగంధద్రవ్యాల వ్యాపారం వంటివీ ప్రారంభించింది. వాటి ద్వారా వచ్చిన మొత్తాన్నీ సేవకే వినియోగిస్తోంది. ‘ఈ ప్రయాణం సులువేమీ కాలేదు. దాతల కోసం చూస్తున్నప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసేవారు. ఎంత ప్రయత్నించినా క్యాన్సర్‌ సోకిన చిన్నారులను కాపాడటం కష్టమయ్యేది. వాళ్ల అంత్యక్రియలను చేస్తోంటే.. మా ఉపాధిని పోగొడుతున్నావంటూ శ్మశాన వాటికల వాళ్లు గొడవపెట్టుకునేవాళ్లు. ఇన్నేళ్లలో ఇలాంటివెన్నో. కానీ నారోజు పిల్లల్ని కలవడం, వారికి కావాల్సినవి అందించడంతోనే ప్రారంభమవుతుంది, ముగుస్తుంది. దీంతో చాలామంది నమ్మి ముందుకొచ్చారు. 12,000కుపైగా నిరంతరం సాయమందించే దాతలున్నారు. ఇప్పటివరకూ 20,000కుపైగా క్యాన్సర్‌ చిన్నారులకు సాయపడ్డాం. అప్పటికప్పుడు ఆదుకొని వదిలేయకూడదు. వారికి దీర్ఘకాలంలో అవసరమైన సాయమందించాలన్నది నా ఉద్దేశం. కోలుకొని చిరునవ్వులు చిందిస్తున్న వాళ్ల ముఖాలు చూస్తే వచ్చే సంతృప్తి ఇంక దేనిలోనూ దొరకదు’ అంటోంది 51 ఏళ్ల సప్నా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని