Published : 14/02/2022 00:21 IST

చినజీయర్‌స్వామి నమ్మకాన్ని నిలబెట్టాం

భగవద్రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ.. కనీవినీ ఎరుగని రీతిలో సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం జరుగుతోంది. 144 యాగశాలలు ఆధ్యాత్మికతను పంచడానికే పరిమితం కాలేదు.. పర్యావరణహితానికీ పాటుపడుతున్నాయి. కర్టెన్ల నుంచి రుత్విజుల ఆసనాల వరకు.. అన్నీ జనపనారతో చేసినవే. వీటన్నింటి ఏర్పాటు వెనక బోయినపల్లి కవితారావు కృషి దాగి ఉంది. ఆ వివరాలు.. ఆమె మాటల్లోనే!

త ఆరేళ్లుగా చినజీయర్‌స్వామి ఆశ్రమానికి బ్యాగులందిస్తున్నాం. ఈసారి రుత్విజులు, ప్రముఖులు, భక్తులకిచ్చే వాటినీ వీటిల్లోనే ఇద్దామని చినజీయర్‌స్వామికి సూచించా. ఆయన యజ్ఞం, యాగశాలలలోనూ సహజసిద్ధంగా తయారు చేసినవే వినియోగించాలని నిర్ణయించారు. స్వామీజీ నాపై నమ్మకంతో ఈ మహాక్రతువును పర్యావరణహితంగా చేసే బాధ్యత అప్పగించారు. ఏలూరు నుంచి ముడిసరుకు తెచ్చి, 35 వేల సంచులు, 15వేల ఆసనాలతోపాటు కర్టెన్లు, వేదికలపై పరిచే పరదాలు, యాగశాలల చుట్టూ కట్టే తోరణ పరదాలు.. ఇలా రకరకాలవి తయారు చేసిచ్చాం. వాటిపై ముద్రించిన రంగులూ సహజసిద్ధమైనవే. ప్రతిదాన్ని రెండుసార్లు వేయాలి. ఒక్కసారి వేసింది పూర్తిగా ఎండటానికి 24 గంటలు పట్టేది. కష్టమైనా ఆశయం మంచిదని చేసుకుంటూ వెళ్లాం. ఇలా మూణ్ణెళ్లు కష్టపడ్డాం. దీన్ని చూసి యాదాద్రిలో ప్రారంభోత్సవంలో చేపట్టే యాగాల కోసమూ అధికారులు మమ్మల్ని సంప్రదించారు. మాది ఖమ్మం జిల్లా ఎర్రగుంట్ల. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నేనూ సాధారణ గృహిణినే. పర్యావరణానికి హితమైనవి చేస్తూనే మహిళలకు ఉపాధి కల్పించాలనుకున్నా. నాకు తెలిసిన బంధువొకరు జనపనారతో సంచులు తయారు చేస్తే బాగుంటుందని సలహానిచ్చారు. అలా ఇద్దరు మహిళలు, రెండు యంత్రాలతో ‘సిరి జ్యూట్‌ క్రియేషన్స్‌’ ఏర్పాటైంది. తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డా. ఖర్చు ఎక్కువ. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమైంది. నా భర్త శ్రీనివాసరావు తోడు నిలిచారు. మా తాత జలగం కొండలరావు రామకృష్ణ మఠానికి సంచులు అందించేలా చేశారు. తర్వాత ప్రముఖ మిఠాయి దుకాణాలు.. ఇలా చేసుకుంటూ వచ్చాం. తెలుగు మహాసభలప్పుడు పదివేల బ్యాగులిచ్చాం. రెండేళ్ల క్రితం మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా సిద్దిపేటలో ఇంటికో జ్యూట్‌ బ్యాగందించాం. సత్తుపల్లితోపాటు మా గ్రామంలోనూ ఇచ్చాం.

ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి వరకు టర్నోవర్‌ సాధిస్తున్నాం. ప్రతి మహిళా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. మా పరిశ్రమ ఉద్దేశమూ అదే! అందుకే మా పరిశ్రమలో అందరూ మహిళలే. ప్రత్యక్షంగా 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. యాగ క్రతువు కోసం అదనంగా 100 మంది భాగస్వాములయ్యారు. సొంత ఆదాయముంటే నైతికంగా దృఢంగా ఉన్నామన భావనుంటుంది. కుటుంబానికీ ఆసరా. జ్యూట్‌ బ్యాగులు ఖర్చు ఎక్కువైనా.. కొన్నేళ్లు వాడుకోవచ్చు. వీటితో కనీసం 200 పాలిథీన్‌ సంచులు పక్కనపెట్టొచ్చు. అందుకే మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ల ద్వారా కుటుంబంలోనూ మార్పొస్తుందని ఆశ. ఈ దిశగా ప్రచారమూ చేస్తున్నాం.

- యార్లగడ్డ అమరేంద్ర, ఈనాడు, హైదరాబాద్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని