జీవిత పాఠాలు చెప్పి... కోట్లు ఆర్జిస్తోంది!

అప్పటిదాకా తనో సాధారణ అమ్మాయి. అమ్మానాన్న చాటు బిడ్డ. తరగతిలోనూ తన ఉనికి తెలియకుండా చూసుకునేది. ఉద్యోగం చేసినా అదే తీరు. అలాంటి ఆమే లైఫ్‌కోచ్‌గా మారింది

Updated : 19 Feb 2022 06:18 IST

అప్పటిదాకా తనో సాధారణ అమ్మాయి. అమ్మానాన్న చాటు బిడ్డ. తరగతిలోనూ తన ఉనికి తెలియకుండా చూసుకునేది. ఉద్యోగం చేసినా అదే తీరు. అలాంటి ఆమే లైఫ్‌కోచ్‌గా మారింది. తను మారడమే కాకుండా.. ఇతరుల్లోనూ ఆత్మవిశ్వాసం నింపుతోంది. రూ. కోట్లలో సంపాదనా అందుకుంటోంది. శిల్పా సింగ్‌కు ఇదెలా సాధ్యమైంది?
శిల్పకి మొదట్నుంచీ ఆత్మవిశ్వాసం తక్కువ. స్కూల్లో తరగతులైనా, ప్రత్యేక కార్యక్రమాలైనా టీచర్ల కంట పడకూడదని సహాధ్యాయుల మాటున దాక్కునేది. కానీ ఉన్నతవిద్య కోసం ఊరు దాటక తప్పలేదు. ఈమెది ఇండోర్‌. నాన్న వస్త్ర వ్యాపారి, అమ్మ గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో ఈమే చిన్నది. దీంతో కొద్దిగా గారాబం. ఏవి కావాలన్నా ఇంట్లోవాళ్లే చేసిపెట్టేవారు. దీనికితోడు ఇంగ్లిష్‌ ఓ పట్టాన కొరుకుడు పడేదికాదు. అందుకని పాఠశాలలో ఏ కార్యక్రమంలోనూ పాల్గొనేది కాదు. డిగ్రీ తర్వాత ఇక్ఫాయ్‌లో ఎంబీఏ సీటొచ్చింది. దాన్ని చేయడానికి ముంబయి వెళ్లింది. అక్కడా ఇదే పరిస్థితి. ఎవరితోనూ కలవలేకపోయేది. మొదటి సెమిస్టర్‌లో ఫెయిల్‌ అయ్యింది కూడా. మానేసి ఇంటికి వెళ్లిపోదామనుకుంటే ఇంట్లోవాళ్లు వారించి, ప్రోత్సహించారు. అప్పుడు అభిషేక్‌ సింగ్‌ అనే సహాధ్యాయితో పరిచయం ఏర్పడింది. అందరితో కలివిడిగా, నవ్విస్తూ ఉండే అతని వల్ల తన పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. దాంతోపాటే అతనిపై ఇష్టమూ ఏర్పడింది. ధైర్యం చేసి ప్రేమను వ్యక్తం చేస్తే అతను సమాధానమివ్వలేదు. దీంతో మళ్లీ పూర్వ స్థితిలోకి వెళుతున్న సమయంలో అతను ఆమె ప్రేమను అంగీకరించాడు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో ప్రాంగణ నియామకాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడే కుదురుకుంటున్న శిల్పకి అదో పెద్ద గండమే అయ్యింది. గ్రూప్‌ డిస్కషన్‌లో మాట పెగిలేది కాదు. తన స్నేహితులందరూ మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించినా తను మాత్రం అలా మిగిలిపోయింది. స్నేహితురాలి సాయంతో ఓ బ్యాంకులో క్రెడిట్‌ కార్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. అందరూ నీడపట్టున ఉద్యోగాలు చేసుకుంటోంటే తను మాత్రం ఎండలో రోడ్ల మీద తిరగాల్సొచ్చేది. ఆ అసంతృప్తి ఆమెను వెంటాడేది. అయినా కొనసాగించింది. అనుభవం సాధించాక వేరే సంస్థల్లోకి మారింది.

‘కార్పొరేట్‌ ప్రపంచం ఓ రేస్‌. నిరంతర పోటీ, ఒత్తిడి. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా ఏదో వెలితి. ప్రేమించే భర్త, ఇద్దరు పిల్లలు... అయినా ఏదో దిగులు. రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదు. అప్పుడే ‘లా ఆఫ్‌ అట్రాక్షన్‌’ గురించి తెలిసింది. జీవితంలో సానుకూలతను పరిచయం చేసే విధానమన్నమాట. దీనిపై ఎంతోమంది పనిచేస్తున్నారు. పుస్తకాలూ రచించారు. ఆ శిక్షణనిచ్చే వాళ్లని లైఫ్‌ కోచ్‌లు అంటారని తెలిసి 2019లో ఒకరి దగ్గర చేరా. నా జీవితంలో పెద్ద మార్పు రావడం గమనించా. నేనూ ఈ శిక్షకురాలిని అవ్వాలనుకున్నా. ఉద్యోగం మానేసి 15 రకాల శిక్షకుల దగ్గర శిక్షణ తీసుకున్నా. ఇందుకోసం నా దగ్గరున్న మొత్తాన్నీ పెట్టుబడిగా పెట్టా. మావారు ఇంటినీ తాకట్టు పెట్టారు. ఇప్పుడున్నది నా రెండో వెర్షన్‌’ అంటుంది శిల్ప. లైఫ్‌ కోచ్‌గా ఐదు నుంచి 30 రోజుల శిక్షణ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది. రెండేళ్లలో మూడు లక్షల మందికి శిక్షణనిచ్చింది. ఆస్ట్రేలియా, దుబాయ్‌ సహా ఇతర దేశాల్లోనూ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది. ఇప్పుడామె వార్షికాదాయం రూ.రెండున్నర కోట్లకు పైనే! సొంత ఇంటినీ ఏర్పాటు చేసుకుంది. ఇదంతా సమయానికి తాను మార్పును అందుకోవడం వల్లే సాధ్యమైందంటోంది. దాన్నే ఇతరులకూ అందిస్తున్నానని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని