ఒత్తిడిని ఓడించి.. చిరునవ్వులు చిందిస్తారు..

ఏ వృత్తిలో ఉన్నా మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఆ క్రమంలో ఒత్తిడికి గురి కావడం సాధారణం. ఆమె ఇల్లాలు కూడా అయితే ఆ తీవ్రత మరీ ఎక్కువ. ఈ మానసిక సమస్య కొన్నిసార్లు మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఒత్తిడిని చిత్తుచేయడం ఆధునిక మహిళకు చాలా ముఖ్యం.

Updated : 17 Aug 2022 12:52 IST

ఏ వృత్తిలో ఉన్నా మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఆ క్రమంలో ఒత్తిడికి గురి కావడం సాధారణం. ఆమె ఇల్లాలు కూడా అయితే ఆ తీవ్రత మరీ ఎక్కువ. ఈ మానసిక సమస్య కొన్నిసార్లు మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఒత్తిడిని చిత్తుచేయడం ఆధునిక మహిళకు చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం కోసం తాము పాటించే చిట్కాలూ, నియమాల గురించి పలువురు ప్రముఖులు ఏం చెబుతున్నారంటే...


నృత్యంతో..

దాదాపు నటీనటులందరూ జిమ్‌కు వెళుతుంటారు. అయితే నేను దీనికి భిన్నం. నేనెప్పుడూ జిమ్‌లోకి అడుగు పెట్టలేదు. ఇల్లు లేదా షూటింగ్‌.. ఎక్కడైనా నృత్యం నా దినచర్యలో భాగం. ఇది నాకు థెరపీగా పనిచేసి ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే దూరం చేస్తుంది. మరొక విషయం చెప్పనా... చిత్రీకరణల మధ్యలో వ్యవధి దొరికినా డ్యాన్స్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తా. మానసికంగానే కాదు, శారీరకంగానూ నేను ఫిట్‌గా ఉండటానికి ఈ అభిరుచి ఉపయోగపడుతుంది.

- సాయి పల్లవి


వర్కవుట్లు, ఐస్‌క్రీంతో..

మయంతో పనిలేకుండా పరుగులు పెడుతుంటాం. ఎక్కడున్నా సినిమాలో చేస్తున్న పాత్ర గురించి ఆలోచించడం, లుక్‌.. వంటివెన్నో మనసులో మెదులుతూనే ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడికి గురి చేసేవే. దీన్నుంచి వీలైనంత త్వరగా బయట పడటానికి జిమ్‌లో ఎక్కువసేపు గడుపుతా. బాగా ఒత్తిడి అనిపిస్తే.. రోజూ చేసేదానికన్నా ఎక్కువ వర్కవుట్లు చేస్తా. ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ ఎక్కువగా ఐస్‌క్రీం తింటూ గడిపేస్తా. అంతే.. సమస్యలన్నీ మటుమాయం.    

- రష్మికా మంధాన


సంగీతమే ఔషధం

కొన్ని సందర్భాల్లో కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన మనల్ని ఆవరిస్తాయి. వాటి నుంచి వెంటనే దూరంగా జరగలేం. మరీ బాధగా అనిపిస్తే ఏడ్చేస్తా. మనసు తేలిక పడుతుంది. రోజూ కాసేపు మనసుకు నచ్చిన పాటలు, మ్యూజిక్‌ వింటాను. ఇది థెరపీగా పనిచేసి ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది. ఆ క్షణానికి బయట పడాలనిపిస్తే దాని గురించి ఆలోచించకుండా మంచి విషయాల్ని గుర్తు తెచ్చుకుంటా. ఇదీ పనిచేసే మార్గమే.

- పూజా హెగ్దే


కుటుంబంతో పర్యటనలు...
- జస్టిస్‌ రాధారాణి, తెలంగాణ హైకోర్టు,

దువు, ఉద్యోగం, కుటుంబం, పిల్లలు వీటి మధ్య క్షణం కూడా మనకి తీరిక ఉండదు. 1998లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ క్యాడర్‌గా చేరినప్పుడు పదేళ్లపాటు ఉన్నత చదువులకు అవకాశం దక్కింది. ఇంటిని, పిల్లలను చూసుకుంటూ, మరోవైపు విధులు నిర్వహిస్తూ ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా పూర్తిచేయగలిగా. చదువుకోవడంతోపాటు  ఉద్యోగం, పిల్లల చదువులు, ఇంటి శుభ్రత, కుటుంబాన్ని చూసుకోవడం వంటివన్నీ సమన్వయం చేసేదాన్ని. వీటిలోనూ రిలాక్స్‌ పొందేదాన్ని. ఇంట్లో పరిశుభ్రత పాటిస్తేనే సంతోషం ఉంటుందని నమ్ముతా. అలాగే 2008 - 2021 మధ్య జిల్లా జడ్జిగా పనిచేశా. అప్పుడు వేరే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. కుటుంబానికి దూరంగా ఉండేదాన్ని. వారాంతంలో ఇంటికి వెళ్లడం, వారికిష్టమైనవి వండిపెట్టడం వంటివన్నీ సంతోషాన్నిచ్చేవి. గతేడాది అక్టోబరులో హైకోర్టు జడ్జిగా బాధ్యతలు తీసుకున్నా. ఇప్పుడిక క్షణం కూడా తీరిక దొరకడం లేదు. అయితే ఇప్పటికే పిల్లలు ఇంటి పనులన్నీ నేర్చుకున్నారు. వాళ్లే చదువుకునే స్థాయికెదిగారు. తల్లిగా మనకు తెలియకుండానే ఇంటిల్లపాదికీ చాలా విషయాలు నేర్పుతాం. పుస్తకాలు చదవడమంటే ఇష్టం. అయితే పుస్తకాన్ని తెరడానికి కూడా తీరిక లేదు. దాంతో ఒత్తిడిని దూరం చేయాలంటే అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం, శుభకార్యాలకు హాజరై బంధువులు, స్నేహితులను కలవడం చేస్తుంటా.  


పిల్లల కథలు వింటా...
-స్వాతి లక్రా, అడిషనల్‌ డీజీపీ, తెలంగాణ మహిళా భద్రతా విభాగం

కుటుంబం, విధుల సమన్వయం కొన్ని సందర్భాల్లో కొంచెం కష్టమే. రోజూ ఆఫీస్‌ ఒత్తిడి ఒకేలా ఉండదు. అలా దొరికిన సమయాన్ని కుటుంబంతో గడపడానికి వెచ్చిస్తా. మావారితో కలిసి సినిమాలు చూస్తా. పాటలు వింటా. పిల్లలను కథలు చెప్పమని వింటుంటా. పిల్లల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. దాన్ని బయటికి తెస్తే చాలు. మనకూ అది రిలీఫ్‌ను ఇస్తుంది. ఆఫీస్‌లో క్లిష్టమైన సందర్భాలెదురైనప్పుడు ఒత్తిడికి గురవకుండా, పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తా. అలా చేస్తే సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. ఉదయం మావారితో కలిసి నడకకు వెళ్లినప్పుడు వాటి గురించి చర్చిస్తా. ఇవన్నీ ఒత్తిడిని నాదగ్గరకు రానివ్వవు. గతంలో టీవీలో వార్తలు మాత్రమే చూసేదాన్ని. ఈమధ్య సమయం ఉంటే డిస్కవరీ ఛానెల్‌ చూస్తున్నా. ప్రకృతి, జంతువులను పరిశీలిస్తుంటే హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు, ఇటీవల ఓటీటీలో వెబ్‌సిరీస్‌లనూ చూస్తున్నా. ఇక పిల్లల చదువులు, పేరెంట్‌ మీటింగ్స్‌ వంటివన్నీ మావారు, నేను ఎవరికి సమయం ఉంటే వాళ్లం పంచుకుంటాం. సమయపాలనను పాటిస్తా. వ్యాయామం, ధ్యానం వంటివీ చేస్తుంటా. ఇవన్నీ నన్ను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఏదైనా సమస్య వచ్చినా తేలికగా పరిష్కరించి సమన్వయం చేయగలుగుతున్నా. నా సంతోషమంతా విధులు, కుటుంబంలోనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్