మా రేడియో ఆడవాళ్ల కోసం!

పన్నెండేళ్లకే పెళ్లి... ఆ వెంటనే ఇంటి బాధ్యతలు మీదపడ్డాయి. తనలా మరో ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని గజ్జెకట్టి, పాటపాడి దేశమంతా తిరిగి ఆడపిల్లల్లో చైతన్యం తీసుకొచ్చారు. వేలమంది స్త్రీలని స్వయం ఉపాధి బాట పట్టించారు. తాజాగా ‘ఆవాజ్‌ వనపర్తి’ అంటూ రేడియో వేదికగా మరింత మంది స్త్రీలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వనపర్తికి చెందిన కమర్‌ రెహమాన్‌..

Updated : 17 Mar 2022 02:42 IST

పన్నెండేళ్లకే పెళ్లి... ఆ వెంటనే ఇంటి బాధ్యతలు మీదపడ్డాయి. తనలా మరో ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని గజ్జెకట్టి, పాటపాడి దేశమంతా తిరిగి ఆడపిల్లల్లో చైతన్యం తీసుకొచ్చారు. వేలమంది స్త్రీలని స్వయం ఉపాధి బాట పట్టించారు. తాజాగా ‘ఆవాజ్‌ వనపర్తి’ అంటూ రేడియో వేదికగా మరింత మంది స్త్రీలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వనపర్తికి చెందిన కమర్‌ రెహమాన్‌..

మా అమ్మకు పెళ్లైన పద్నాలుగేళ్లకు పుట్టాను. ఆ తర్వాత తన ఆరోగ్యం పాడైంది. దాంతో ‘నేను చనిపోకముందే నీ పెళ్లి చూడాలంటూ’ పన్నెండేళ్లకే పెళ్లిచేశారు. అప్పుడు నేను ఆరోతరగతి. మావారు రహీమ్‌. చిరువ్యాపారి. ఆయన ప్రోత్సాహంతోనే చదువుపై దృష్టిపెట్టి.. పదోతరగతి రాశాను. తర్వాత డిగ్రీ చేశా. ఈలోపు ఇద్దరు పిల్లలు. ఫహీమ్‌, నయీమ్‌.

అప్పట్లో మహిళల్లో చదువు, పొదుపుని ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలు నన్ను ఆకట్టుకున్నాయి. నేను పాటలు బాగా పాడతా. సందర్భాన్ని బట్టి ఆశువుగా పాటలు అల్లి, పాడేదాన్ని. దాంతో అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార బాధ్యతల్ని అప్పగించారు. అలా గజ్జెకట్టుకుని.. పాటలు పాడుతూ పల్లె పల్లెనా పొదుపు గురించి చెప్పేదాన్ని. ఈ కార్యక్రమాల కోసం దేశమంతా కూడా తిరిగా. కొన్ని ప్రాంతాల్లో గజ్జె కట్టుకుని తిరిగే నన్నుచూసి నక్సల్‌ అనుకొని రాత్రిపూట ఇంటికి రానిచ్చే వారు కాదు. దాంతో పస్తులున్న రోజులూ ఉన్నాయి. అధికారులు కూడా ఆటపట్టించడానికి ‘కమరక్క దళం’ వచ్చిందనే వారు. యూఎన్‌డీపీ ఆధ్వర్యంలో కళాకారులకి వందల వర్క్‌షాపులు నిర్వహించాను. అలా కల్చరల్‌ డైరెక్టర్‌గానూ ఎదిగాను. ఆడపిల్లలని స్వయంఉపాధి దిశగా నడిపించాలని 1994లో ‘వనితా జ్యోతి మహిళా సంఘం’ స్వచ్ఛంద సంస్థని మొదలుపెట్టాను. డీఆర్‌డీఏ సాయంతో మా సంస్థ ద్వారా 20 వేలమందికిపైగా కంప్యూటర్‌, టైలరింగ్‌, మగ్గం, సర్ఫ్‌ తయారీ, అగరొత్తులు, వడ్రంగి పనుల్లో శిక్షణ ఇచ్చాం.

అలా రేడియో మొదలయ్యింది...

ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడే డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ సంస్థ దిల్లీలో కమ్యునిటీ రేడియోల ద్వారా ప్రజలకు చేరువవ్వడంపై శిక్షణ ఇచ్చింది. మహిళల్లో చైతన్యం తేవడంలో బాగా ఉపయోగపడుతుందని 2014లో కమ్యూనిటీ రేడియో స్థాపనకు దరఖాస్తు చేశా. దీనికి ఎన్నో వడపోతలుంటాయి. దిల్లీ చుట్టూ పలు సార్లు తిరిగా. మొత్తం 13 వడపోతలు. ఏదైతేనేం 2019లో అనుమతి వచ్చింది. మా రేడియో పేరు వీజేఎమ్‌ఎస్‌ ‘ఆవాజ్‌ వనపర్తి 90.4’. దీని ఏర్పాటుకు రూ.35 లక్షల దాకా అయింది. కొంత ప్రభుత్వమే భరించింది. తక్కినది మా సంఘ సభ్యులం సమకూర్చుకున్నాం. వనపర్తిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే రేడియో సెంటర్‌ని ప్రారంభించాం. రైతులు, మహిళలు, కళాకారులకు మేలు చేయాలనేదే ఈ రేడియో కార్యక్రమాల లక్ష్యం. రేడియో అందరికీ చేరుతుందనుకున్న సమయంలో కొవిడ్‌ మొదలయ్యింది. నిర్వహణ కష్టంగా మారింది. ఇదీ ఓ అవకాశం అనుకున్నా. జనం ఇంటి వద్దే ఉండే ఆ సమయంలో రేడియో కార్యక్రమాలవైపు మళ్లించుకోవాలనుకున్నా. అందుబాటులో ఉన్న కళాకారులతోనే చిన్న చిన్న హాస్య నాటికలు, చిన్నారులకు ఇష్టమైన పద్యాలు, పాటలు ప్రసారం చేసేదాన్ని. మంచిమాట, ఆరోగ్య సూత్రాలు, వంటింటి చిట్కాలు చెప్పే వాళ్లం. కొవిడ్‌ జాగ్రత్తలను వైద్యాధికారులతో చెప్పించే వాళ్లం. అలా స్థానికులకు బాగా దగ్గరయ్యాం. దాదాపుగా వెయ్యి మంది కళాకారులు మా ‘ఆవాజ్‌ వనపర్తి’ వేదికగా పరిచయం అయ్యారు. ఒక కళాకారిణిగా నాకంతకంటే సంతోషం ఏముంటుంది? ప్రస్తుతం చర్చా వేదికలు, మహిళా సంఘాలతో సమావేశాలు, రైతులు అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి ప్రసారం చేస్తున్నాం. మేమే రైతుల దగ్గరకు వెళ్తాం. సాగు సమస్యలు తెలుసుకుంటాం. వ్యవసాయాధికారులతో సలహాలు, సూచనలు చెప్పిస్తాం. 18 మంది సిబ్బంది, అంతా మహిళలమే. మా అబ్బాయిలు, కోడళ్లు కూడా వనితాజ్యోతి సంఘం, రేడియో కోసమే పని చేస్తున్నారు. 40 కి.మీ.ల పరిధిలో మా కార్యక్రమాలు వస్తాయి. మాకిదే పేరుతో వెబ్‌ రేడియో కూడా ఉంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, లింక్డిన్‌ల ద్వారా దాని ప్రచారం చేస్తున్నాం. మా రేడియోని మరింత మందికి చేరువ చెయ్యాలన్నది లక్ష్యం.

- ఘాట్‌కర్‌ శ్రీనివాసరావు, వనపర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్