ఇంకెన్నాళ్లో బతకవన్నారు...

పండంటి బిడ్డకు తల్లైన రోజుల్లోపే హెచ్‌ఐవీ అని తేలింది. ఇంకెంతో కాలం బతకవన్నారందరూ. చంటిబిడ్డను లాక్కొని అత్తింటి వారు నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తే, పుట్టిల్లు అక్కున చేర్చుకుంది.

Published : 16 Apr 2022 00:23 IST

పండంటి బిడ్డకు తల్లైన రోజుల్లోపే హెచ్‌ఐవీ అని తేలింది. ఇంకెంతో కాలం బతకవన్నారందరూ. చంటిబిడ్డను లాక్కొని అత్తింటి వారు నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తే, పుట్టిల్లు అక్కున చేర్చుకుంది. తర్వాత జీవితంపై విరక్తి పెంచుకోకుండా తనలాంటివారి గురించి ఆలోచించింది. వందలమంది బాధితుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న సురేందర్‌ కౌర్‌ స్ఫూర్తి కథనమిది.

సురేందర్‌ కౌర్‌ అమ్మానాన్న కూలీలు. అయినా... చదువుపై ఆసక్తి ఉన్న ఈమెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే, పదోతరగతి వరకూ చక్కగా చదువుకుంది. ఆపై చదివించే స్థోమత లేక, 18 ఏళ్లు నిండేసరికే ఓ ట్రక్కు డ్రైవరుకిచ్చి పెళ్లి చేశారు. కోటి ఆశలతో మెట్టింట అడుగుపెట్టింది హరియాణలోని రోహ్‌తక్‌కు చెందిన సురేందర్‌. ఆవెంటనే ఓ బిడ్డకు తల్లైంది. ఆ సంతోషంలో ఉండగానే గుండెపగిలే వార్త. తనకు ఎయిడ్స్‌ ఉన్నట్లు తెలిసింది. భర్త నుంచి సోకిందని తెలిసి కూడా అత్తింటివాళ్లు ఆమెనే చీదరించుకున్నారు. వైద్యులు మరో ఆరు నెలలు మాత్రమే బతుకుతావని చెప్పడంతో కుంగిపోయింది. అదే సమయంలో చంటిబిడ్డను లాగేసుకుని మరీ అత్తామామలు ఇంటి నుంచి గెంటేశారు. భర్త ఆదరణ కరవైంది. ఇక అమ్మానాన్నలే నీడ చూపించారు. వారి పంచన ఉంటూ రోజులు లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టింది. ఓవైపు అనారోగ్యం, మరోవైపు ఈ వ్యాధికి మందులేదనే ప్రచారం ఈమెను మరీ నిస్సత్తువకు గురిచేసింది. గ్రామంలో అందరూ ఈమెను చీదరించుకునే వారు. తన కలలన్నీ నీరుగారిపోవడంతో ఆత్మహత్యే శరణ్యమనుకునేది. కానీ చనిపోవడానికి ధైర్యం చాల్లేదు. అయితే చనిపోతుందనుకున్న మనిషి ఆశ్చర్యకరంగా పదేళ్లు గడిపేసింది.

బాధితులకు కొత్త జీవితం
ఇదంతా పదేళ్లనాటి మాట అంటుంది సురేందర్‌ కౌర్‌. ‘కలలన్నీ పేకమేడల్లా కూలిపోయినప్పుడు ఏ అమ్మాయైనా ఆత్మహత్య చేసుకుందామనుకుంటుంది. నాకూ అటువంటి ఆలోచనే వచ్చేది. ఈ అనారోగ్యంతో నేనెలా బతికానో ఆశ్చర్యంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చేవి. ఆత్మహత్య వైపు నుంచి క్రమేపీ నా మనసు నాలాంటి వారిపైకి మళ్లింది. ఇలా ఎందరో ఈ అనారోగ్యానికి గురై ఉన్నారని తెలిసింది. వారికి నేనెందుకు సాయం చేయకూడదు అనుకున్నా. నాలాంటి వారికి సేవలందిస్తున్న గుడ్‌గావ్‌కు చెందిన ఎన్జీవోలో చేరా. వారి సాయంతో చికిత్స తీసుకుంటూ, ఆత్మస్థైర్యాన్నీ.. పెంచుకొన్నా. ఆత్మవిశ్వాసంతో హెచ్‌.ఐ.వి. బాధితుల్లో అవగాహన కలిగించడానికి సిద్ధమయ్యా. మొదట నేను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రూ.4,000 జీతానికి హరియాణా ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో చేరా. బాధితులకు అవగాహన కల్పించడం, చికిత్స చేయించడం, ఉచిత మందులిప్పించడం నుంచి, వారే మరికొందరికి చేయూత నందించేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నా. ఎన్జీవోలు విహాన్‌, సాథీ వంటి వాటితో కలిసి పనిచేస్తున్నా. బాధితులకు పునరావాసం అందేలా చేస్తున్నా. ముఖ్యంగా ఈ వ్యాధి బారిన పడిన గర్భిణులకు వైద్య సేవలందిస్తున్నా. బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు వారికి వైద్య పరీక్షలు, చికిత్స, పోషకాహారంతోపాటు వైద్యుల పర్యవేక్షణ అందేలా కృషి చేస్తున్నా. ఇప్పటివరకు దాదాపు 200 మందికిపైగా గర్భిణులకు సేవలందించా. ఇప్పుడు నేను చనిపోయినా సంతోషమే. ఎందుకంటే నాలాంటి ఎందరికో ఈ వ్యాధిపై అవగాహన కలిగించడమే కాదు, నాకెదురైన అనుభవాలు వాళ్లకు కలగకుండా కాపాడా అనే తృప్తి ఉంది’ అని చెప్పుకొస్తున్న 40 ఏళ్ల సురేందర్‌ కౌర్‌ తనలాంటి వందల మంది బాధితుల్లో జీవితంపట్ల ఆసక్తిని పెంచుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్