ఆ పల్లెలు...ఈ అమ్మల చేతి రంగవల్లికలు

రాత్రికిరాత్రి ఏ ఊరూ ప్రగతి సాధించలేదు. అందుకోసం నాయకులు నిరంతరం అంకితభావంతో శ్రమించాలి. అన్నింటికీ మించి ప్రజల మద్దతు సంపాదించాలి. సర్పంచులుగా బ్లెస్సీ, సరోజన ఈ విషయంలో విజయం సాధించారు. ఓ అమ్మ తన ఇంటిని తీర్చిదిద్దినట్లే తమ గ్రామాల్ని తీర్చిదిద్ది.. జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలబెట్టారు.

Updated : 20 Apr 2022 04:21 IST

రాత్రికిరాత్రి ఏ ఊరూ ప్రగతి సాధించలేదు. అందుకోసం నాయకులు నిరంతరం అంకితభావంతో శ్రమించాలి. అన్నింటికీ మించి ప్రజల మద్దతు సంపాదించాలి. సర్పంచులుగా బ్లెస్సీ, సరోజన ఈ విషయంలో విజయం సాధించారు. ఓ అమ్మ తన ఇంటిని తీర్చిదిద్దినట్లే తమ గ్రామాల్ని తీర్చిదిద్ది.. జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలబెట్టారు.


ఆ గ్రామం బాలల స్వర్గం!

ఆ ఊళ్లో బడి ఈడు పిల్లలందరూ చదువుకోవాల్సిందే. ఆరేళ్లలోపు చిన్నారులందరికీ టీకాలు పడాల్సిందే. ఈ విషయాల్లో తల్లిదండ్రులు కాస్త అటూఇటుగా ఉన్నా, గ్రామ సర్పంచి బ్లెస్సీ మాత్రం పక్కాగా ఉంటారు. గ్రామాభివృద్ధి విషయంలోనూ ఆమెది ఇదే పంథా. అందుకే దేశంలోనే అత్యుత్తమ పంచాయతీల్లో ఒకటిగా ఆమె సర్పంచిగా ఉన్న యేకొల్లు నిలిచింది..

కరోనా మొదటి లాక్‌డౌన్‌ వేళ ఎక్కడివాళ్లక్కడే నిలిచి పోయారు. తిరుపతి జిల్లాలో ఉన్న యేకొల్లుకు చెందిన ఆవల బ్లెస్సీ మాత్రం భర్త అనిల్‌కుమార్‌, గ్రామ యువత, మహిళల సాయంతో గ్రామంలో కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నిత్యం వీధుల్ని శుభ్రం చేసేవారు. రెండో దశలోనూ ఇదే రీతిలో పనిచేశారు. 2021లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. కష్టకాలంలో తలలో నాలుకలా నిల్చిన బ్లెస్సీని సర్పంచిని చేద్దామని పెద్దలు భావించినా పోటీ తప్పలేదు. అయినా భారీ ఆధిక్యతతో గెలిచారు బ్లెస్సీ.

కేరళ నుంచి వచ్చి...

బ్లెస్సీ సొంతూరు కేరళలోని ఇడుక్కి. 20 ఏళ్ల కిందట ఓ కాన్వెంట్‌లో టీచర్‌గా పనిచేసేందుకు వచ్చారామె. అప్పుడే ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే అనిల్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరికిద్దరు అబ్బాయిలు. టీచర్‌గా పనిచేస్తూనే సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. సర్పంచి అయ్యాక కస్తూర్బా గాంధీ, ప్రభుత్వ గురుకుల పాఠశాల, ప్రభుత్వ వసతి గృహాలూ ఉండటంతో.. పేద పిల్లల్ని ఇక్కడ చేర్పించేవారు. గ్రామంలో బడి ఈడు పిల్లలు 100 శాతం విద్యను అభ్యసిస్తున్నారిపుడు. అంగన్‌వాడీ కేంద్రాల సాయంతో పిల్లలకు పోషకాహారం, టీకాలు సక్రమంగా అందేలా చూస్తున్నారు. రూ.15 లక్షలతో చెత్త నిర్వహణ కేంద్రం ఏర్పాటుచేయించారు. 3,500 పండ్ల మొక్కల్ని నాటించి గ్రామాన్ని పచ్చదనంతో నింపేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేక అవార్డుల్ని ప్రకటించింది. ‘చైైల్డ్‌ ఫ్రెండ్లీ’ విభాగంలో యేకొల్లు ఎంపికైంది. అందుకుగానూ రూ.10-15 లక్షల మధ్య నగదు బహుమతి రానుంది. ఆ సొమ్ముతో గ్రామంలో మరిన్ని సదుపాయాలు తెస్తానంటారు బ్లెస్సీ.

- శివరామకృష్ణ అల్లం, నెల్లూరు


ఇదే అసలైన గెలుపు!

ఊరి బాగు కోసం నిన్ను గెలిపిస్తున్నాం.. ఎలాంటి అభివృద్ధిని చేసి చూపిస్తావో... సర్పంచిగా పోటీలో ఉన్నపుడు ఆమెతో గ్రామ ప్రజలు అన్న మాటలివి. ఇప్పటికీ తన చెవిలో ఆ మాటలు వినిపిస్తున్నాయంటారు వీర్ల సరోజన. తెలంగాణాలోని కరీంనగర్‌ జిల్లా, రామడుగు మండలం వెలిచాల గ్రామ సర్పంచి ఈమె. అందమైన రోడ్లు, బృహత్తర వనాలు, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, భూగర్భ డ్రైనేజీ... ఆ ఊళ్లో ఇలాంటివెన్నో దర్శనమిస్తాయి. ఏడుపదుల వయసులోనూ ఊరి జనం ఆశించిన అభివృద్ధి సాధించారామె.

గంగదేవిపల్లి స్ఫూర్తిగా...

తెలుగు రాష్ట్రాల్లో గంగదేవిపల్లి గ్రామం ఆదర్శమని అధికారులూ, పాలకులూ చెబుతుంటే తన ఊరికీ అంతటి ఖ్యాతిని తేవాలనుకున్నారు.. 2019లో సర్పంచిగా గెలిచిన సరోజన. ఒకప్పటి గడీ స్థలంలో పంచాయతీ కార్యాలయాన్ని ఆధునికంగా కట్టించారు. కొత్తగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మింపజేశారు. 4,573 మంది జనాభా ఉండే ఈ గ్రామంలోని 1,509 నివాసాలూ పరిశుభ్రత ఒడిలో ఉండేలా ఏరోజుకారోజు చెత్తను తరలిస్తారు. ఇంటింటా ఇంకుడు గుంతలు, అన్ని వీధుల్లోనూ సీసీ కెమెరాలు... ఆ ఊరి ప్రత్యేకతలెన్నో. అంగన్‌వాడీ కేంద్రంలో కిచెన్‌ గార్డెన్‌తోపాటు పిల్లలకు ఆధునిక ఆట వస్తువులూ తెచ్చి ఇక్కడి ప్రాంగణాన్ని ఆదర్శప్రాయంగా మార్చారు. గ్రామంలోని పురాతన ఆలయాలన్నింటికీ ఆధునికతను అద్దారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సశక్తికరణ్‌ అవార్డుకు ఈ గ్రామం ఎంపికైంది. ‘నిజానికి 2019లో కాదు.. ఇప్పుడు గెలిచాననిపిస్తోంది. ఇందుకోసం ఎంతో తపించాను. 2016లోనూ మా గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఊరిని మరింత ప్రగతి పథంలో నడిపించడంతో మరోసారి జాతీయస్థాయిలో మెరిశాం. ఇంకా మంచి పనులు చేస్తూ ఊరిని మరింత ఆదర్శంగా మలుస్తా’ అంటారు సరోజన.

- తుమ్మల శ్రీనివాస్‌, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్