తన కథకు తనే హీరో!

‘నా కథలో నేనే హీరో కావాలి’ చిన్నప్పట్నుంచీ ఆమె ఆలోచనలు ఇలానే ఉండేవి. ఇప్పుడు ఆమె వయసు 58. ఆమె ప్రస్థానం గురించి తెలిసిన వాళ్లెవరైనా ఆమె ‘నిజమైన హీరో’ అని తప్పక చెబుతారు. మూడు దశాబ్దాల్లో నాలుగు విభిన్నమైన రంగాల్లో అడుగుపెట్టి అన్నింటా విజయం సాధించారామె. ఇప్పటికీ భవిష్యత్తు గురించి కలలు కంటారు. ‘జీవితం చిన్నదే దాన్ని మనమే పెద్దదిగా మలచుకోవాలి’ అని చెప్పే వంగ అరుణారెడ్డి ప్రస్థానం ప్రతి మహిళకూ స్ఫూర్తి పాఠమే...

Published : 10 May 2022 01:40 IST

‘నా కథలో నేనే హీరో కావాలి’ చిన్నప్పట్నుంచీ ఆమె ఆలోచనలు ఇలానే ఉండేవి. ఇప్పుడు ఆమె వయసు 58. ఆమె ప్రస్థానం గురించి తెలిసిన వాళ్లెవరైనా ఆమె ‘నిజమైన హీరో’ అని తప్పక చెబుతారు. మూడు దశాబ్దాల్లో నాలుగు విభిన్నమైన రంగాల్లో అడుగుపెట్టి అన్నింటా విజయం సాధించారామె. ఇప్పటికీ భవిష్యత్తు గురించి కలలు కంటారు. ‘జీవితం చిన్నదే దాన్ని మనమే పెద్దదిగా మలచుకోవాలి’ అని చెప్పే వంగ అరుణారెడ్డి ప్రస్థానం ప్రతి మహిళకూ స్ఫూర్తి పాఠమే...

హోమ్‌సైన్స్‌లో డిగ్రీ, న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ చేసిన అరుణకు 1986లో వ్యాపారవేత్త సుధీర్‌రెడ్డితో వివాహమైంది. తర్వాత పిల్లల కోసం నాలుగైదేళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అరుణ తల్లిదండ్రులదీ, అత్తమామలదీ హైదరాబాదే. బాబు స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టాక ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేసి ఆ రంగంలో సేవలు అందించడం మొదలుపెట్టారు. దాదాపు 20 ఏళ్లపాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలూ, భవనాలకు డిజైనర్‌గా సేవలు అందించారు. వాటిలో నాంపల్లిలోని అబ్కారీ భవనం ఒకటి. అరుణకు వ్యవసాయమంటే చాలా ఇష్టం. పల్లెకు పోవాలి, మట్టితో మైత్రి చేయాలనుకునేవారు. ఇరువైపులా వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాలే కావడంతో వారి ప్రోత్సాహమూ లభించింది. దాంతో 1996లో హైదరాబాద్‌ శివారు మహేశ్వరంలో గ్రీన్‌ హౌస్‌లు నిర్మించి రకరకాల రంగుల్లోని గులాబీలను సాగుచేసి ఎగుమతి చేసేవారు. వ్యవసాయానికి అనుకూల ప్రాంతం కాకపోయినా బిందు సేద్యంతో విజయవంతమయ్యారు. ఉత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి నుంచి 1996లో పురస్కారాన్నీ అందుకున్నారు. తర్వాత కాలంలో కూరగాయలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో పంట మార్పు తెచ్చి అక్కడా విజయం సాధించారు.

కుమార్తె వివాహం స్ఫూర్తితో

2014లో వీరి కుమార్తె పర్ణిక వివాహ వేడుకని మహేశ్వరంలో చేశారు. పల్లెదనం ఉట్టిపడేలా ప్రాంగణాన్నీ, మండువానీ తీర్చిదిద్దారు. వివాహానికి హాజరైన వాళ్లందరూ పెళ్లినీ, మండువాని ప్రశంసిస్తుండటంతో ఆ మండువాని అలాగే ఉంచి అక్కడ సదుపాయాల్ని మెరుగుపర్చి కల్యాణ మండపాన్ని అభివృద్ధి చేశారు. నగరం పెరుగుతున్నకొద్దీ పల్లె వాతావరణం దూరమైంది. అప్పుడే నగరానికి దగ్గర్లోనే పల్లె వాతావరణం ఉంటే బావుంటుంది అనుకున్నారు. నగరవాసులు వారాంతాల్లో పల్లె వాతావరణంలో గడిపేలా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ‘గ్రాండ్‌ ఎరీనా స్పోర్ట్స్‌ కౌంటీ’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అబ్బాయి సిద్దార్థ టెబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు. యువతరంలో క్రీడలపైన ఉన్న ఆసక్తిని గమనించి తమ గ్రీన్‌ హౌస్‌కు ఆనుకుని తొమ్మిది ఎకరాల్లో క్రికెట్‌ మైదానం నిర్మాణం చేపట్టారు. ఫ్లడ్‌లైట్లనీ ఏర్పాటు చేశారు. క్యారమ్స్‌, చెస్‌, కబడ్డీ, వాలీబాల్‌, పుట్‌బాల్‌,  టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్నూకర్‌ వంటి వన్నీ ఆడేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేశారు. మహేశ్వరాన్ని క్రీడా గ్రామంగా తీర్చిదిద్దాలన్నది తన ఆశయంగా చెబుతారు అరుణ. వర్ధమాన క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకుగాను తెలంగాణ క్రికెట్‌ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నారు.

అరుణకు ఆభరణాలంటే బాగా ఇష్టం. బంగారు నగలతోపాటు వజ్రాలూ కొనేవారు. కానీ వాటి నాణ్యతపైన నమ్మకం కుదిరేది కాదు. దాంతో జెమాలజీలో క్రాష్‌ కోర్స్‌ చేశారు. ‘ఆ తర్వాత దుకాణాల్లో వజ్రాలు కొనడం మానేశా. నేనే ముడి సరుకు తెప్పించుకుని స్వర్ణకారుణ్ని నియమించుకుని ఇంట్లోనే మెరుగు పట్టించేదాన్ని. అవి ధరించినపుడు మీ వజ్రాలు మాకంటే బాగా మెరుస్తున్నాయే అనేవారంతా. విషయం చెబితే వాళ్లకి చేయించమని అడిగేవారు. తర్వాత వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ వదిలి ఇటువైపు వచ్చి ‘పర్ణికా జెమ్స్‌, అండ్‌ జ్యువలరీస్‌’ను 15ఏళ్లుగా నడుపుతున్నా’ అని వివరించారావిడ. వీళ్ల అమ్మాయి పర్ణిక జెమాలజిస్ట్‌ కోర్సు చేసింది. ఆమె సహకారంతో ఆభరణాల వ్యాపారంలో   ముందుకు వెళ్తున్నారు అరుణ. చిన్నప్పట్నుంచీ పాటలంటే ఇష్టం. కానీ చదువులూ, పిల్లలూ, వ్యాపారాలతో... అందులో శిక్షణ తీసుకోవడానికి కుదరలేదనీ ఇప్పుడు వీలుచేసుకొని గత అయిదేళ్లుగా కర్ణాటక సంగీతం(గాత్రం)లో శిక్షణ తీసుకుంటున్నాననీ చెబుతారు. ‘చేయాలన్న తపన, నిరంతర శ్రమ, అంకితభావం ఉంటే నేనే కాదు... ప్రతి మహిళా తన కథలో తనే హీరో కావొచ్చు’ అంటారు అరుణ.

-డి.యాదగిరిరెడ్డి, మహేశ్వరం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్