పాపను ఎత్తుకోలేకపోయేదాన్ని...

అమ్మా అంటూ చేతుల్లోనే ఒదిగిపోయే తన చిన్నారిని కనీసం కాసేపైనా ఎత్తుకోలేని అశక్తతను అధిక బరువు తెచ్చిపెట్టింది. ఈ సమస్యను దూరం చేసుకుంటేనే పాప ఆరోగ్యాన్నీ పరిరక్షించగలనని అర్థం చేసుకుంది. అదే ఆమెను తిరిగి ఆరోగ్యవంతురాలిని చేసింది.

Published : 29 May 2022 01:22 IST

అమ్మా అంటూ చేతుల్లోనే ఒదిగిపోయే తన చిన్నారిని కనీసం కాసేపైనా ఎత్తుకోలేని అశక్తతను అధిక బరువు తెచ్చిపెట్టింది. ఈ సమస్యను దూరం చేసుకుంటేనే పాప ఆరోగ్యాన్నీ పరిరక్షించగలనని అర్థం చేసుకుంది. అదే ఆమెను తిరిగి ఆరోగ్యవంతురాలిని చేసింది. కన్నకూతురి కోసం మానసికంగానే కాదు, శారీరక సామర్థ్యాన్నీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రేరణ స్ఫూర్తిగాథ.... ఇది.

దువుకునే రోజుల్లో ప్రేరణ నాజూకుగా ఉండేది. బాస్కెట్‌బాల్‌ బాగా ఆడేది. పెళ్లి, ఆ తర్వాత తల్లి కావడం క్రమంలో శారీరకంగా మార్పు మొదలైంది.  2019లో ఉన్నత విద్య కోసం భర్త జర్మనీ వెళ్లడంతో కూతురిని చూసుకుంటూ ఇండియాలోనే ఉండిపోయింది. ఒంటరిగా ఉండటం, దాంతో అమితంగా ఆహారం తీసుకోవడంతో రెండేళ్లలోనే ఈమె బరువు 93 కేజీలకు పెరిగింది. అప్పటికి పాప అనైషాకు నాలుగో ఏడు. అనుకోకుండా ఆ చిన్నారికి తీవ్ర అనారోగ్యం చేసింది. వైద్య పరీక్షల్లో పాపకు క్యాన్సర్‌ అని తెలిసింది. కొవిడ్‌ సమయం కావడంతో విదేశం నుంచి భర్త రాలేని పరిస్థితి. దీంతో లక్నోలో ఉంటూ ఒంటరిగానే ఈ వేదనను భరించింది ప్రేరణ. 

ఛాలెంజ్‌గా.. చికిత్స మొదలుపెట్టడంతో తీవ్ర అస్వస్థతగా మారిన అనైషాను ప్రతి నిమిషం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రేరణదైంది. ఎక్కడికైనా ఎత్తుకొనే వెళ్లాల్సి వచ్చేది. చేతుల్లోంచి పాప కిందకు దిగేది కాదు. దాంతో ప్రేరణకు తీవ్రంగా ఆయాసం మొదలయ్యేది. ‘ఆసుపత్రిలో ప్రతి క్షణం అనైషాను ఎత్తుకునే ఉండేదాన్ని. భరించలేని నడుం నొప్పితో బాధపడేదాన్ని. ఓవైపు పాప అనారోగ్యం నన్ను తీవ్రంగా కుంగదీసేది. మరోపక్క అధికబరువు నన్ను నాలుగడుగులు కూడా వేయనిచ్చేది కాదు. నా పరిస్థితి దుర్భరంగా మారింది. అనైషాకు కీమోథెరపీ చేసేవారు. అది జరిగినంతసేపు తను నా ఒడిలోనే కూర్చుంటానని మారాం చేసేది. చికిత్స తర్వాత తనను బెడ్‌పై ఉంచి, నేను లేచి నుంచోవడానికి నరకం చూసేదాన్ని. రెండు మూడు గంటలు అడుగుతీసి అడుగు వేయలేక పోయేదాన్ని. కండరాలు పట్టేసేవి. వాష్‌రూంకు వెళ్లడానికీ కష్టమయ్యేది. దీంతో నీళ్లు తాగడం తగ్గించేశా. అది నా ఆరోగ్యంపై మరింత ప్రభావాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆలోచించా. నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా.. పాపను బాగా చూసుకోగలను అనిపించింది. అప్పటికే పాప చాలా నీరస పడింది. తనను చూసుకుంటూనే నా బరువునూ తగ్గించుకోవాలని అనుకున్నా. ఎలాగైనా బరువు తగ్గితే చాలనుకున్నా. మామూలుగా నడవడమే కష్టంగా ఉన్న ఆ సమయంలో ఏం చేయాలా అని ఆలోచించా. దీన్ని ఛాలెంజ్‌గానే తీసుకున్నా. పాప అవసరాలన్నీ తీర్చిన తర్వాత నా కసరత్తులు  మొదలు పెట్టేదాన్ని. నడక, చిన్నచిన్న వ్యాయామాలతోపాటు పోషకాలన్నీ ఉండేలా ఆహారం తీసుకునేదాన్ని. వ్యాయామాలు చేయడం అనుకున్నంత సులువు కాలేదు. అప్పటివరకూ పెద్దగా కష్టపడని నా శరీరం మాట వినేదికాదు. నేను సన్నబడాలి అనే లక్ష్యాన్ని గుర్తుకు తెచ్చుకునేదాన్ని. పూర్తిగా లైఫ్‌స్టైల్‌ మార్చుకున్నా. కొన్నిసార్లు కీమోథెరపీ తర్వాత అనైషా చాలా చికాకుగా ఏడుస్తూ ఉండేది. తనను నిద్రపుచ్చి ఆ చిన్న లైట్‌ వెలుతురులోనే తన గదిలోనే వర్కవుట్లు చేసేదాన్ని. రోజుకి నాలుగులీటర్ల నీటిని తీసుకోవడం, లిఫ్ట్‌ వాడటం తగ్గించి మెట్లు ఎక్కి వెళ్లడం మొదలుపెట్టా. చిన్నచిన్న లక్ష్యాలను పెట్టుకొనేదాన్ని. అంటే ముందుగా పావుగంట వ్యాయామాలు చేసి, నెమ్మదిగా అరగంటకు పెంచా. ఆ తర్వాత గంట సమయాన్ని కేటాయించుకున్నా. మొదట్లో నాలుగడుగులు వేయడానికి కష్టపడే నేను ఇప్పుడు నాలుగైదు కిలోమీటర్లు సునాయసంగా నడవగలిగే స్థాయికి చేరుకున్నా. నా శారీరక సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం నా కూతురిని ఎంతసేపైనా ఎత్తుకోగలను. ఎక్కడికైనా ఎత్తుకొని తీసుకెళ్లగలను. అలా పది నెలల్లోపు 20 కేజీలు తగ్గగలిగా’ అని చెప్పుకొచ్చింది 35 ఏళ్ల ప్రేరణ. అంతే కాదు తను ఉత్సాహంగా కూతురితో గడపడం వల్ల తన ఆరోగ్యం కూడా మెరుగు పడుతోంది. ఆ పాప క్రమంగా క్యాన్సర్‌ నుంచి బయటపడుతోంది. మరో రెండు మూడు నెలల్లో మరింత బరువు తగ్గుతా అంటున్న ప్రేరణ కథ మరికొందరికి ప్రేరణ కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్