ఈ అమ్మలు.. ప్రాణదాతలు!

మృత్యువు ముంగిట్లో ఉన్న వారిని బతికించే సంజీవని రక్తం.. ఆ సంజీవని క్షణం ఆలస్యం చేయకుండా అందించడంలో వీళ్లకు వీళ్లే సాటి. అర్ధరాత్రి తలుపుతట్టినా... మేమున్నాం అంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు వీళ్లంతా. నెలల పసిపాప... రక్తంలేక చనిపోవడం ఆమెని కలిచివేసింది. దాంతో రక్తదాన ఉద్యమకారిణి అయిపోయారు కావలికి చెందిన పార్వతి శంకర్‌. తాను 29 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, తోటి మహిళల్లో చైతన్యం తెస్తూ వారితోనూ చేయిస్తున్నారు...

Updated : 14 Jun 2022 07:05 IST

ప్రపంచ రక్తదాన దినోత్సవం నేడు

మృత్యువు ముంగిట్లో ఉన్న వారిని బతికించే సంజీవని రక్తం.. ఆ సంజీవని క్షణం ఆలస్యం చేయకుండా అందించడంలో వీళ్లకు వీళ్లే సాటి. అర్ధరాత్రి తలుపుతట్టినా... మేమున్నాం అంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు వీళ్లంతా.

పిల్లలూ రక్తదాతలే...

నెలల పసిపాప... రక్తంలేక చనిపోవడం ఆమెని కలిచివేసింది. దాంతో రక్తదాన ఉద్యమకారిణి అయిపోయారు కావలికి చెందిన పార్వతి శంకర్‌. తాను 29 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, తోటి మహిళల్లో చైతన్యం తెస్తూ వారితోనూ చేయిస్తున్నారు.

మా అక్కయ్య కూతురు, నెలల పిల్ల. రక్తహీనతతో పుట్టిన ఆ పాప సమయానికి రక్తం అందక చనిపోయింది. అప్పుడు నేనూ చిన్నదాన్నే. నా పుట్టిల్లు గుంటూరు. పెళ్లై కావలిలో మెట్టినింట అడుగుపెట్టాక ఆ పసిపాపలా ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదని అనిపించి, రక్తదానం చేయడం మొదలుపెట్టాను. దీనికి మా వారు శంకర్‌ సహకారం కూడా తోడయ్యింది. ఆయన సూపర్‌మార్కెట్‌ నడిపేవారు. నేను బ్యుటీషియన్‌ని. అప్పట్లో బ్లడ్‌ బ్యాంకులు ప్రత్యేకించి ఉండేవి కావు. ప్రాణాలమీదకు వచ్చింది రక్తం కావాలనే వారు. దాంతో ఆసుపత్రికి వెళ్లే సమయం కూడా లేక మా బ్యూటీపార్లర్‌లో ఉండే కుర్చీలో కూర్చోబెట్టి రక్తం తీసుకున్న సందర్భాలూ ఎక్కువే. మరొకరి ప్రాణం నిలబెట్టే ఈ మంచి పనిని క్రమంగా ఓ అలవాటుగా మార్చుకున్నా. రెడ్‌క్రాస్‌ సభ్యురాలిగా మారి... ఎన్నో అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఇప్పటివరకూ 29 సార్లు ఇచ్చాను. ఇప్పడు కూడా నేను ఇవ్వడానికి సిద్ధమే. కానీ వయసురీత్యా... వద్దని అంటున్నారు. అందుకే చురుగ్గా ఉండేందుకు క్రీడల్లో అడుగుపెట్టి పతకాలు అందుకుంటున్నా. ప్రస్తుతం మా అబ్బాయి, అమ్మాయి నా లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు. మా అబ్బాయి డాక్టర్‌ అభిషేక్‌ ఎవరికైనా అవసరం అంటే అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా పరుగెడతాడు. మా అమ్మాయి నాగిని టీచర్‌గా పనిచేస్తూ... పదిసార్లైనా రక్తదానం చేసి ఉంటుంది.


బరువు పెరిగి మరీ...

తమకొచ్చిన కష్టం... మరొకరికి రాకూడదనుకున్నారామె. అందుకే రక్తదానాన్ని అలవాటుగా మార్చుకున్నారు కూకట్‌పల్లికి చెందిన డి. అన్నపూర్ణ...

2005లో.. మా బావగారికి రోడ్డు ప్రమాదం జరిగింది. ‘అత్యవసరంగా రక్తం కావాలి.. లేకపోతే బతకడం కష్ట’మన్నారు వైద్యులు. మా ఇంట్లో ఎవరికీ ఆ గ్రూపు రక్తం లేకపోవడంతో ఆశలు వదులుకుని, ఏడుస్తూ కూర్చున్నాం. ఆ సమయంలో.. ఓ వ్యక్తి దేవుడిలా రక్తమిచ్చి ఆయన ప్రాణాలు నిలబెట్టాడు. ఆ తర్వాతే రక్తదానంతో కొందరి ప్రాణాలైనా నిలబెట్టాలని గట్టిగా అనుకున్నా.. మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు. నాన్న కోఆపరేటివ్‌ బ్యాంకు మేనేజర్‌గా చేసి రిటైరయ్యారు. కాదనకుండా సాయం చేసే తత్వం ఆయనది. ఆయన్ని చూస్తూ పెరిగిన నాకూ సమాజానికి ఎంతో కొంత సేవచేయాలని ఉండేది. మొదట్లో తగినంత బరువు లేనని రక్తం తీసుకోకుండా తిప్పి పంపారు. తగినంత బరువు పెరిగాక అంటే 33 ఏళ్ల వయసు నుంచీ క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నా. కరోనా కష్టకాలంలోనూ ఇచ్చాను. ఇప్పటివరకూ 21 సార్లు అందించాను. నేను రక్తం ఇచ్చేటప్పుడు నా బంధువులు, పిల్లలను, స్నేహితులను కూడా తప్పకుండా వెంట తీసుకొని వెళ్తాను. మా అమ్మాయి అమెరికాలో ఉంటోంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ‘బ్లడ్‌డొనేషన్‌’కు ఎప్పుడెళ్దాం? అంటుంది. అవయవ దానంపైనా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా. వినాయకచవితితో పాటు ఇతర పండగల్లో వేడుకలు సాధారణం కదా! అలాంటప్పుడు మా కమ్యూనిటీలో డొనేషన్‌ బాక్సుని ఉంచుతాను. అందులో నిత్యావసరాలు వంటివి వేస్తారు. అలా పోగైన వస్తువులను... అవసరమైన వారికి, వృద్ధాశ్రమాలకీ, అనాథాశ్రమాలకీ అందిస్తాను.

- కాసాల ప్రశాంత్‌గౌడ్‌, హైదరాబాద్‌


యాభైసార్లు ఇచ్చి...

రక్తం ఇవ్వడానికి మహిళలు పనికిరారు అనే అపోహని కొట్టిపారేస్తూ... 50సార్లు రక్తమిచ్చి అత్యధికంగా రక్తదానం చేసిన మహిళగా గుర్తింపుని దక్కించుకున్నారు కావలి మహిళ గొట్టిపాటి నిర్మల...

నేను పుట్టిపెరిగింది నెల్లూరులో. నాన్న రామచంద్రనాయుడు నెల్లూరు రెడ్‌క్రాస్‌ ఫౌండర్‌ మెంబర్‌. బాబాయి డాక్టర్‌. ఎవరికైనా రక్తం అత్యవసరం అయితే రాత్రిళ్లు కూడా వెళ్లి ఇచ్చేవారు. వీళ్ల స్ఫూర్తితోనే డిగ్రీ చదివే రోజుల్లోనే రక్తదానంపై అవగాహన పెంచుకున్నా. పెళ్తై కావలిలోని అత్తారింట్లో అడుగుపెట్టాక మా మామగారు గొట్టిపాటి సుబ్బానాయుడుగారి ప్రభావంతో సేవాకార్యక్రమాలు మరింత ముందుకు సాగాయి. మొదట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో మా కుటుంబ ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఒక గదిని కేటాయించి రక్తదాన కార్యక్రమాలు చేసేవాళ్లం. తర్వాత విడిగా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో... కావలి బ్లడ్‌ బ్యాంకుని ప్రారంభించి సొంతంగా కార్యక్రమాలు మొదలుపెట్టా. 1993 నుంచీ ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు ఇచ్చే దాన్ని. ఇప్పటివరకూ 50 సార్లు ఇచ్చాను. కొవిడ్‌ తర్వాత.. వయసురీత్యా కాస్త దూకుడు తగ్గింది కానీ.. నాకే అనారోగ్య సమస్యలూ లేవు. రక్తం ఇవ్వడం వల్లనే ఇంత చురుగ్గా ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా మందికి రక్తం ఇస్తే ఏమవుతుందో అన్న అనుమానం ఉంటుంది. అలాంటి వారు చురుగ్గా ఉన్న నన్ను చూసి స్ఫూర్తి పొంది వాళ్లూ ఇవ్వడం మొదలుపెట్టారు. మా అబ్బాయి హర్షవర్దన్‌, అమెరికాలో ఉంటున్న మా అమ్మాయి హంసిని కూడా తరచూ రక్తదానం చేస్తూ నా లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు.

- ఇట్టా సాంబశివరావు, విజయవాడ


వారిస్తున్నా.. దానం ఆపలేదు!

‘అమ్మాయి.. రక్తం ఇవ్వకూడదు’ అని ఇంట్లో వాళ్లు వారిస్తున్నా మూడు దశాబ్దాలుగా రక్త దానం చేస్తున్నారు ఆశా సూర్యనారాయణ్‌.

మెది అరుదైన గ్రూపు... ‘ఎ నెగెటివ్‌’. 1994... ఓసారి చావుబతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి రక్తం అవసరమైంది. అతనిదీ అదే బ్లడ్‌ గ్రూపు. అప్పటికి రక్తదానంపై ఆవిడకు అవగాహన లేదు. కానీ ఒక ప్రాణం నిలబడుతుందని ఒప్పుకొంది. అలా మొదలైన ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆశా వాళ్లది బెంగళూరు. టెలికామ్‌ సంస్థలో ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అమ్మాయి రక్తమిస్తే ఆరోగ్యానికి హాని, గర్భధారణలో, ప్రసవంలో ఇబ్బంది అని అమ్మానాన్నల భయం. కానీ ఆశా వాళ్లకి చెప్పకుండా వెళ్లి ఇచ్చేవారు. ఇప్పుడామె వయసు 55 ఏళ్లు. ఇప్పటికి 100 యూనిట్లకుపైగా రక్తాన్నిచ్చారు. ‘1996లో... ఒక క్యాన్సర్‌ రోగి. అసలే అరుదైన రక్తం. దీనికితోడు గతంలో ఇచ్చిన వారి రక్తం సరిపడలేదు. పరిస్థితి విషమించింది. విషయం తెలిసి నేను ఇచ్చాను. అతను చావు నుంచి బయటపడ్డాడు. అతని తల్లి నన్ను చూడగానే కాళ్లమీద పడబోయింది. ఈ సంఘటన నా మీద చాలా ప్రభావం చూపింది. ఇక అప్పటి నుంచి దీన్నో పుణ్యకార్యంగా భావిస్తూ తరచూ ఇస్తున్నా. ఇతరులకీ అవగాహన కల్పిస్తున్నా’ అని గుర్తు చేసుకున్నారు ఆశా. కొవిడ్‌ సమయంలోనూ ఆవిడ తన సేవలను ఆపలేదు. వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారి కోసం 44 సార్లు ప్లాస్మానీ దానం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్