వేల అడుగులెత్తున యోగా నేర్పుతూ..

అతి ఎత్తైన ప్రాంతమది. ఎడతెరిపిలేకుండా కురిసే మంచు. శ్వాస తీసుకోవడమే కష్టం. అటువంటి చోట ఆమె ప్రాణాయామం నేర్పుతున్నారు. సైనికులతో యోగా చేయిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత యోగా శిబిరాలను నిర్వహిస్తున్న 78 ఏళ్ల పద్మినీ జోగ్‌ సేవాస్ఫూర్తి కథనమిది.

Updated : 09 Dec 2022 04:53 IST

అతి ఎత్తైన ప్రాంతమది. ఎడతెరిపిలేకుండా కురిసే మంచు. శ్వాస తీసుకోవడమే కష్టం. అటువంటి చోట ఆమె ప్రాణాయామం నేర్పుతున్నారు. సైనికులతో యోగా చేయిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత యోగా శిబిరాలను నిర్వహిస్తున్న 78 ఏళ్ల పద్మినీ జోగ్‌ సేవాస్ఫూర్తి కథనమిది.

బెంగళూరుకు చెందిన పద్మిని లండన్‌ విశ్వ విద్యాలయంలో చదివారు. బీఎస్‌సీ హోంసైన్స్‌ పూర్తయ్యాక కల్నల్‌ ప్రతాప్‌ జోగ్‌తో వివాహమై, ఇద్దరు పిల్లలు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక, మాంటిసోరీ కోర్సు చేసి పిల్లలకు ఉచితంగా బోధించేవారు. భర్త ఉద్యోగవిరమణ తర్వాత సొంతూరు నాగ్‌పుర్‌కు చేరుకున్నారు.సేవగా.. నాగ్‌పుర్‌లో యోగా క్యాంపు జరుగుతుంటే భర్తతో కలిసి వెళ్లారు పద్మిని. ‘అది మా ఇద్దరికీ యోగాపై ఆసక్తిని కలిగించింది. అప్పటి నుంచి ఇద్దరం ఇంట్లో చేసే వాళ్లం. కొన్నాళ్లకు బాగా పట్టొచ్చిందనుకున్నాక... హరిద్వార్‌లో రామ్‌దేవ్‌ బాబా శిక్షణలో యోగా టీచర్స్‌ కోర్సు పూర్తి చేశాం. తర్వాతా యోగాలో మరిన్ని కోర్సులు చేశాం. భోపాల్‌కు సమీపంలోని సేహోర్‌ వద్ద క్యాంపు నిర్వహించాలంటూ ఒక స్వచ్ఛంద సంస్థ అడిగింది. అలా మా ప్రయాణం మొదలుపెట్టాం. మొదటి క్యాంపులో 600 మంది పాల్గొన్నారు. ఆసనాలు, ప్రాణాయామం ఆయన చేయిస్తుంటే, వాటి వివరణ, చేసే విధానం, ప్రయోజనాలను నేను మైకులో చెప్పేదాన్ని. అలా జంటగా దేశమంతా పర్యటించాం. పాఠశాలలు, కళాశాలలు, వృద్ధాశ్రమాలు, రోటరీ క్లబ్స్‌, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్స్‌... ఇలా వీలైనన్ని చోట్ల శిబిరాలు నిర్వహించాం’ అంటారీమె.

రక్షకదళాలకు.. ప్రతాప్‌, పద్మిని సైనిక, నావికా, వైమానిక, పోలీసు దళాలకూ సేవలను అందించడం మొదలుపెట్టారు. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌, కేంద్రీయ విద్యాలయాల్లో శిక్షణ ఇచ్చే వారు. ‘అప్పటికి 561 క్యాంపులు అయ్యాయి. 2014, సెప్టెంబరు అయిదో తేదీని మరవలేను. ఎందుకంటే ఆ రోజే మావారికి హార్ట్‌అటాక్‌. ఆర్మీ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. ఆయన మాకు శాశ్వతంగా దూరమయ్యారు. భరించలేని వేదన. నిత్యం యోగా, ప్రాణాయామం చేస్తున్న ఆయనకు ఇలా ఎందుకు జరిగిందని వైద్యులను అడిగా. ఇవన్నీ ప్రారంభించకముందే.. అంటే 20 ఏళ్ల క్రితమే ఆయనకు హృదయ సంబంధిత అనారోగ్యం ఉందని చెప్పారు. యోగాతో ఆరోగ్య పరిరక్షణను అందరికీ చేర్చాలన్న మావారి ఆశయాన్ని కొనసాగించాలనుకున్నా. నెల తర్వాత బెంగళూరు ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో క్యాంపుతో ఒంటరి ప్రయాణాన్ని ప్రారంభించా. ఇప్పటికి 940 క్యాంపులు చేయగలిగా. నిరంతర ఆందోళన, ఒత్తిడితో విధులు నిర్వహించే సైనిక సోదరులకు యోగా చాలా అవసరం. అందుకే జమ్మూ, కశ్మీరు వంటి ప్రాంతాల్లో 12,300 అడుగులెత్తున సైనికులకు రోజూ రెండు గంటల చొప్పున యోగా, ప్రాణాయామం నేర్పా. అలా ప్రతి బేస్‌ క్యాంపులోనూ పర్యటిస్తున్నా. వారే కాదు... ప్రతి ఒక్కరూ రోజూ ఓ అరగంట ప్రాణాయామం, పది నిమిషాలు యోగాసనాలు చేయాలి. ఆహారం, నిద్ర ఎలా విధిగా పాటిస్తామో, దీన్నీ అలానే భావించాలి. తుది శ్వాస వరకూ కృషి చేస్తా’ అంటోన్న పద్మిని ప్రస్థానం స్ఫూర్తిదాయకం కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్